అంగన్‌వాడీల జీతాల పెంపు | angan wadies salsry hike says ministers | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల జీతాల పెంపు

Published Thu, Aug 6 2015 7:13 PM | Last Updated on Wed, Apr 3 2019 8:48 PM

ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌వాడీ సిబ్బందికి వేతనాలను పెంచుతూ రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌వాడీ సిబ్బందికి వేతనాలను పెంచుతూ రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు వేతనాలు పెంపుపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం రెండో భేటీలో వేతనాల పెంపునకు అంగీకరించింది. రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం గురువారం సచివాలయంలో సమావేశమైంది. ఈ భేటీలో మంత్రులు కె.అచ్చెన్నాయుడు, పీతల సుజాత పాల్గొన్నారు. అంగన్‌వాడీ జీతాల పెంపుపై రాష్ట్ర మంత్రి వర్గానికి సిఫారసు చేయనున్నారు.

రాష్ట్రంలో మొత్తం 257 అంగన్‌వాడీ ప్రాజెక్టులున్నాయి. ఈ ప్రాజెక్టుల పరిధిలో అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ అంగన్‌వాడీ వర్కర్లు మొత్తం 1,04,377 మంది ఉన్నారు. వీరికి ఏడాదికి జీతాల కింద రూ.406 కోట్లు కేటాయిస్తున్నారు. అంగన్‌వాడీ వర్కర్‌కు నెలకు ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా కింద చెల్లిస్తున్న రూ.4,200కు బదులు రూ.7,100 అందించాలని, హెల్పర్‌కు రూ.2,400కు బదులు రూ.4,600 చెల్లించాలని నిర్ణయించారు. మినీ అంగన్‌వాడీ వర్కర్లకు నెలకు రూ.2,950కు బదులు రూ.4,600 చెల్లించాలని సిఫార్సు చేయనున్నారు. పెరిగిన వేతనాల ప్రకారం ఏడాదికి రూ.317 కోట్లు ఆర్ధిక భారం పడుతుందని అంచనా వేస్తున్నారు.

అంగన్‌వాడీలకు సెప్టెంబరు నెల నుంచి కొత్త వేతనాలు అమలయ్యేలా చూస్తామని మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు కె.అచ్చెన్నాయుడు, పీతల సుజాత పేర్కొన్నారు. సమావేశం అనంతరం సచివాలయంలో మీడియా పాయింట్‌లో మంత్రులిద్దరు వివరించారు. అంగన్‌వాడీల సమస్యలన్నింటిపై చర్చించామని, పదవీ విరమణ తర్వాత అందే ప్రయోజనాల్ని వారి పనితీరు ఆధారంగా నిర్ణయిస్తామన్నారు. రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, అంగన్‌వాడీల జీతాలను పెంచామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement