న్యూఢిల్లీ: లక్షలాది మంది ఆశా, అంగన్‌వాడి కార్యకర్తలకు ప్రధాని మోదీ తీపి కబురు అందించారు. అక్టోబర్ నుంచి వారి నెలవారీ గౌరవ వేతనాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు. ఆశా కార్యకర్తలను పలు సామాజిక భద్రతా పథకాల పరిధిలోకి తీసుకొస్తామని, ప్రధాన్‌మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రైమ్‌మినిస్టర్ సురక్షా బీమా యోజన కింద ఉచిత బీమా కల్పిస్తామని, ఏదైనా ప్రమాదానికి గురైతే వారికి రూ.4 లక్షల వరకు బీమా పరిహారం చెల్లిస్తామని చెప్పారు. ఆశా, ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ కార్యకర్తలతో మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. రూ.3 వేల గౌరవ వేతనం పొందుతున్న వారికి తాజా పెంపుతో ఇకపై రూ.4,500 లభిస్తుంది.
అలాగే, రూ.2200గా ఉన్నవారి వేతనం రూ.3,500కు పెరగనుంది. అంగన్‌వాడీ సహాయకుల గౌరవ వేతనాన్ని రూ.1500 నుంచి రూ.2,500కు పెంచుతున్నట్లు మోదీ వెల్లడించారు. ఈ పెంపు అక్టోబర్ నుంచే అమల్లోకి రాబోతున్నా, నవంబర్ వేతనాల్లో ప్రతిబింబిస్తుందని, ఇది వారికి దీపావళి కానుక అని మోదీ అభివర్ణించారు. కామన్ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్(ఐసీడీఎస్–సీఏఎస్) ఉపయోగిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు అదనంగా రూ.250–రూ.500 మధ్య ప్రోత్సాహకాలిస్తామని చెప్పారు.
ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలకు కేంద్రం ప్రోత్సాహకాలు ప్రకటించడం సాధారణమే. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వేరుగా ప్రోత్సాహకాలిస్తాయి. దేశవ్యాప్తంగా సుమారు 14 లక్షల అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఆరేళ్లలోపున్న చిన్నారులు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు సుమారు 10 లక్షల మంది దాకా ఈ కేంద్రాల ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. 12,83,707 అంగన్‌వాడి కార్యకర్తలు, 10,50,564 సహాయకులు వారికి సేవలందిస్తున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది ఆశా కార్యకర్తలు పనిచేస్తున్నారు.
‘ఆయుష్మాన్ భారత్’ తొలి లబ్ధిదారు కరిష్మ..
నవజాత శిశువుల ఆరోగ్యం, పోషణ ప్రమాణాల పరిరక్షణలో ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని మోదీ కొనియాడారు. ఈ నెల 23న జార్ఖండ్‌లో ప్రారంభించబోతున్న ప్రతిష్టాత్మక ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులను గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. హరియాణాలోని కర్నాల్ జిల్లాలో ఇటీవల జన్మించిన కరిష్మ అనే చిన్నారి ఈ పథకంలో తొలి లబ్ధిదారు అని వెల్లడించారు.
రక్తహీనత సంబంధిత వ్యాధులను మూడు రెట్లు తగ్గించేందుకు రెట్టింపు ప్రయత్నాలు అవసరమని పిలుపునిచ్చారు. ‘పోషన్ అభియాన్’ లక్ష్యసాధన దిశగా సాంకేతికత సాయంతో వినూత్న పద్ధతుల్లో సేవలందిస్తున్న కార్యకర్తలను మోదీ ప్రశంసించారు. సెప్టెంబర్ మాసాన్ని పోషణకే అంకితం చేస్తున్నామని, గరిష్ట పోషణ ప్రయోజనాలను వివరిస్తూ ఇంటింటికీ ప్రచారం చేపట్టాలని సూచించారు. ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తల వేతన పెంపుపై మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధి మంత్రి మేనకా గాంధీ హర్షం వ్యక్తం చేశారు.
పని సంస్కృతిని మార్చేశాం
న్యూఢిల్లీ: యువత ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం కొత్త పని సంస్కృతిని తీసుకొచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. అణగారిన వర్గాల్లో విశ్వాసం నింపేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. వ్యవసాయం, ఆర్థికం, సాంకేతికత సహా అన్ని రంగాల్లో దేశం పురోగమిస్తోందని చెప్పారు. షికాగోలో స్వామి వివేకానంద ప్రసంగించి 125 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కోయంబత్తూరులోని శ్రీరామకృష్ణ మఠం మంగళవారం నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి మోదీ వీడియో ద్వారా మాట్లాడారు.
‘యువత ఆకాంక్షలు, ఆశయాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పని సంస్కృతిలో మార్పులు చేసింది. ఈ సంగతిని గుర్తించి నైపుణ్యాభివృద్ధికే ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేశాం. వినూత్న ఆలోచనలు, అంకుర పరిశ్రమలకు స్టార్టప్ ఇండియా చక్కని వేదికైంది’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment