
కురవని మబ్బు.. కదలని కర్రు
- గణనీయంగా తగ్గిన వర్షపాతం
- అన్నదాత ఆశలకు అశనిపాతం
- వర్షాభావం కొనసాగితే ఆరుతడి పంటలే శరణ్యం
అమలాపురం : ‘వాన రాకడ.. ప్రాణం పోకడ’ తెలియదన్నది నానుడి. వానలు రావలసిన సమయంలో రాకపోగా వడగాడ్పులు చెలరేగడంతో జిల్లాలో అనేక ప్రాణాలు పోయాయి. అన్నదాతలసాగు ఆశలూ.. నడివేసవిలో నీటిచెలమల్లా నానాటికీ ఆవిరవుతున్నాయి. ఈ ఏడాది ఎల్‌నినో వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలకు తగ్గట్టే.. నైరుతి రుతుపవనాలు వచ్చినా ఆశించిన స్థాయిలో వర్షం కురవలేదు. సాధారణంగా జిల్లాలో జూన్ రెండో వారంలోనే రుతుపవనాలు ప్రవేశించి ఆశించిన స్థాయిలో వర్షాలు పడుతుంటాయి. అయితే ఇప్పటి వరకూ వాతావరణ మార్పుల వల్ల అడపాదడపా వర్షాలు కురిసినా తొలకరి వర్షం మాత్రం పడలేదు.
జిల్లాలో సాధారణంగా జూన్‌లో తొలి 19 రోజులకూ సగటు వర్షపాతం 80.4 మిల్లీ మీటర్లు. ఈ ఏడాది అది కేవలం 13 మిల్లీ మీటర్లు మాత్రమే కావడం వర్షాభావ తీవ్రతకు నిదర్శనం. గత ఏడాది ఇదే సమయానికి 56.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆ తరువాత ఊహించని విధంగా భారీ వర్షాలు కురవడంతో మెట్ట, డెల్టా రైతులు వేల ఎకరాల్లో పంటను కోల్పోవాల్సి వచ్చింది. అసాధారణంగా జూలైలోనే గోదావరికి వరద వచ్చింది. గోదావరికి నాలుగుసార్లు వరదలు రాగా ఆ ఉధృతి నెలరోజులకు కొనసాగింది. దీని వల్ల కూడా రైతులు పంట నష్టాలను చవిచూశారు.
డెల్టాలోనూ అరకొరగానే నారుమడులు
మెట్ట, ఏజెన్సీలలోనే కాదు.. డెల్టాలో కూడా వర్షం వస్తే కానీ నాగలి కర్రు చురుకుగా కదిలేలా లేదు. ప్రధానంగా వర్షాధార పంటలు సాగు చేసే మెట్ట, ఏజెన్సీలలో ఈ ఏడాది వరిసాగు తగ్గిపోయే అవకాశముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సాధారణ వర్షం కురిసి మెట్ట, ఏజెన్సీలలోని చెరువులు, ప్రాజెక్టులు నిండినా పూర్తిస్థాయిలో నీరందడం లేదు. చెరువులు, ప్రాజెక్టులకు అనుబంధంగా ఉన్న కాలువల వ్యవస్థ అధ్వానంగా మారడమే ఇందుకు కారణం.
అలాంటిది వర్షాభావం కొనసాగితే సాగు వదులుకోవాల్సిందేనని ఏజెన్సీ, మెట్ట రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రైతులు తొలి దఫా దుక్కులు చేసి వర్షం కోసం ఎదురు తెన్నులు చూస్తున్నారు. డెల్టాలో కాలువలకు నీరు వదిలినా ఎండలకు జడిసి రైతులు నారుమడులు వేయడం లేదు.
గత రెండు రోజులుగా వాతావరణం చల్లబడడంతో కొందరు నారుమడులు వేసినా..భారీ వర్షాలు కురిసి వాతావరణం పూర్తి అనుకూలంగా మారాకే వేయాలని ఎక్కువమంది భావిస్తున్నారు.
పొంచి ఉన్న కరువు పరిస్థితి
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవకుంటే ఏజెన్సీ, మెట్ట ప్రాంతాలు కరువుబారిన పడే ప్రమాదముంది. 2011-12లో వర్షాలు తక్కువగా పడడం వల్ల కరువు పరిస్థితులు నెలకొన్నాయి. అప్పట్లో జిల్లాలో సుమారు 13 మండలాలను కరువు మండలాలుగా గుర్తించారు. ఈ ఏడాది కూడా ఈ పరిస్థితి తప్పదనే ఆందోళన రైతులలోనే కాక అధికారయంత్రాంగంలోనూ ఉంది. వర్షాభావం కొనసాగితే వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు చేయాల్సి ఉంది.