
అన్నదాతకు ఎంత కష్టం..
జిల్లాలో ఈ రబీలో పంటలు సాగు చేసిన రైతన్నకు కరువుదెబ్బ రుచి చూపిస్తోంది. ఇది వరకే ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలన్నీ నిట్టనిలువునా ఎండిపోగా ఇప్పుడు రబీ పంటల...
కష్టపడి పంట సాగు చేసి.. రేయింబవళ్లు చెమట చిందించిన రైతన్నకు లాభాలు పలకరించడం లేదు. ఇంటిల్లిపాది శ్రమించినా ఫలితం దక్కడం లేదు. సిరులు కురిపించాల్సిన పంటలు వర్షాభావానికి వాడుముఖం పడుతున్నాయి. తెగుళ్లతో దెబ్బతింటున్నాయి. పంట బాగా వస్తే ధరల వల్ల నష్టాలు మిగులుస్తున్నాయి.
దీంతో ‘లాభాలమాట దేవుడెరుగు అసలు కూడా మిగలడం లేదం’టూ రైతు కన్నీరు కారుస్తున్నాడు. చేసేదిలేక పూల తోటలను దున్నేస్తున్నాడు. పండ్ల తోటలను నరికేస్తున్నాడు. ఉలవ,వేరుశనగ, చామంతి, బొప్పాయి ఇలా పంట ఏదైనా రైతులకు నష్టాలు తప్పడం లేదు.
కడప అగ్రికల్చర్: జిల్లాలో ఈ రబీలో పంటలు సాగు చేసిన రైతన్నకు కరువుదెబ్బ రుచి చూపిస్తోంది. ఇది వరకే ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలన్నీ నిట్టనిలువునా ఎండిపోగా ఇప్పుడు రబీ పంటల వంతు వచ్చింది. హుదూద్, బంగాళా ఖాతంలో ఏర్పడిన పలు తుపాన్లు జిల్లాను తాకకపోవడంతో పంటలకు తీవ్ర వర్షాభావం ఏర్పడింది. బోరుబావుల్లో 21.17 మీటర్ల దిగువకు పడిపోవడంతో పంటలు ఎలా రక్షించుకోవాలో అర్థం కాక రైతులు సతమతమవుతున్నారు.
అక్టోబరు నెలలో సీజన్ ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఒక్క తుపాను కూడా సాగు చేసిన పంటలను పలుకరించకపోవడంతో పంటల మనుగడ కష్టసాధ్యంగా మారింది. రబీలో ఈశాన్య రుతుపవనాల వల్ల 251 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా కేవలం 110.9 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. మొత్తం వర్షపులోటు -55.8 శాతమని వ్యవసాయాధికారులు తెలిపారు.
సాగు తలకిందులు..
ఈ సీజన్ మొత్తానికిగాను 2,05,143 హెక్టార్లలో పంటలు సాగవుతాయని వ్యవసాయాధికారులు అంచనాలు రూపొందించారు. అక్టోబరునెలలో కురిసిన వర్షానికి, బోరుబావుల కింద కలిసి అన్ని పంటలు 1,36,350 హెక్టార్లలో సాగయ్యాయి.
ఈ సారి మార్కెట్ ధరలను అనుసరించి రైతులు ధనియాలు, నువ్వుల పంటను వర్షాధారంగా అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. ప్రస్తుతం వర్షాభావంతో ధనియాలు, నువ్వుల పంట ఎండిపోతుండడంతో రైతులు విలవిల్లాడి పోతున్నారు. పంటల సాగుకోసం పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితులు లేవని రైతులు లబోదిబోమంటున్నారు. బుడ్డశనగ, పత్తి, జొన్న, మినుము, ఉలవ, మొక్కజొన్న పంటలు నిలువునా ఎండిపోయి. పంటపెట్టుబడులు నేలపాలేనని రైతులు ఆవేదన చెందుతున్నారు. రబీసీజ్‌నను కూడా కరువు కింద చేర్చి పంట నష్టపరిహారం అందించాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.
పంట అంచనా సాగైంది
(హెక్టార్లలో)
బుడ్డశనగ 89288 63972
పొద్దు తిరుగుడు 51779 8757
ధనియాలు 8008 89288
వేరుశనగ 18433 6675
నువ్వులు 6268 10773