అన్నవరం: తూర్పు గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని దేవస్థానానికి ఏప్రిల్ నెలకు హుండీల ద్వారా రూ.93,01,588 ఆదాయం సమకూరింది. శుక్రవారం హుండీలను లెక్కించగా నగదు రూ.88,61,208, చిల్లర నాణాలు రూ.4,40,380 వచ్చాయని ఈఓ నాగేశ్వరరావు తెలిపారు.
నగదుతోపాటు 103 గ్రాముల బంగారం, 445 గ్రాముల వెండి, 298 అమెరికన్ డాలర్లు, 20 యునెటైడ్ అరబ్ దీర్హామ్స్, 36 ఖతార్ రియాల్స్, రెండు సింగపూర్ డాలర్లు, 500 ఒమెన్ బైసాలు, 30 కెనడా డాలర్లు లభించాయని తెలిపారు.
నిలువు దోపిడీ సమర్పించిన భక్తురాలు
సత్యదేవునికి ఓ భక్తురాలు నిలువు దోపిడీ సమర్పించినట్లు ఈఓ తెలిపారు. గొలుసుతో కూడిన మంగళసూత్రం, నాలుగు గాజులు, రెండు చెవి దిద్దులు, ఒక పాపిడి బిళ్ల, ఒక ముక్కు పుడక, మూడు ఉంగరాలు, చిన్న కాసుల పేరు ఒక పట్టుబట్టలో మూటగట్టి పడవేసినట్లు తెలిపారు. వీటన్నిటి బరువు సుమారు 20 గ్రాములుంటుందన్నారు. హుండీల లెక్కింపులో ఈఓతో పాటు దేవస్థానం ఏసీ ఈరంకి జగన్నాథరావు తదితరులున్నారు.