సత్తెన్నకు‘అరకిలో’ బంగారు కానుకలు
సత్తెన్నకు‘అరకిలో’ బంగారు కానుకలు
Published Fri, Mar 17 2017 11:31 PM | Last Updated on Tue, Sep 5 2017 6:21 AM
హుండీల ఆదాయం రూ.59.47 లక్షలు
అన్నవరం : రత్నగిరివాసుడు సత్యదేవునికి హుండీల ద్వారా 17 రోజుల వ్యవధిలో రికార్డు స్థాయిలో అరకిలో బంగారం లభించగా, రూ.59.47 లక్షలు వచ్చింది. ఈ బంగారమంతా భక్తులు స్వామికి సమర్పించిన చిరుకానుకలే కావడం విశేషం. బహిరంగ మార్కెట్‌లో ప్రస్తుతం ఉన్న బంగారం రేటు ప్రకారం ఈ దీని విలువ సుమారు రూ.14 లక్షలు. ఫిబ్రవరిలో 480 గ్రాముల బంగారం వచ్చినా అప్పుడు 29 రోజులకు హుండీలను లెక్కించారు. మార్చిలో తొలివిడతగా శుక్రవారం దేవస్థానంలో హుండీలను తెరిచి లెక్కించారు. వాటిలో భక్తులు సమర్పించిన సుమారు 50 చిరు బంగారు కానుకలు ఉండడంతో వాటిని తూకం వేయించగా 500 గ్రాములు ఉన్నాయి. గత ఫిబ్రవరిలో వచ్చిన 480 గ్రాములు బంగారం ఆలయచరిత్రలో ఇప్పటివరకూ రికార్డుగా ఉంది. ఇక నగదు రూపంలో రూ.55,94,978 , రూ.3,52,886ల చిల్లర నాణాలు వచ్చాయని లెక్కింపును పర్యవేక్షించిన దేవస్థానం చైర్మన్ రాజా ఐవీ రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావు తెలిపారు. నగదుతోపాటు అమెరికా డాలర్లు 137, సౌదీ అరేబియన్ మోనాటిరీలు 22, యూరో కరెన్సీ 5 ఉన్నాయన్నారు. దేవస్థానం ఏసీ ఈరంకి జగన్నాథరావు, ఏఈఓలు వైఎస్‌ఆర్ మూర్తి, ఎంకేటీఎన్‌వీ ప్రసాద్, నటరాజ్, తదితరులు పాల్గొన్నారు. ఈ నెలాఖరున మరోసారి హుండీలను లెక్కిస్తామని అధికారులు తెలిపారు.
Advertisement