
అన్నదాత సమస్యలపై ఆందోళన
- బీమా, రాయితీల విడుదలలో జాప్యం
- సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలి
- రుణమాఫీ కొందరికే
- బీకేఎస్ నాయకులు
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లా రైతులకు పెండింగ్‌లో ఉన్న పంటల బీమా, ఇన్‌ఫుట్ సబ్సిడీ తక్షణమే విడుదల చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నర్రెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బీసీ ఓబుల్‌రెడ్డి డిమాండ్ చేశారు. రైతు సమస్యలపై శుక్రవారం బీకేఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2012-13లో శనగ పంటకు ప్రకటించిన బీమాను వెంటనే రైతుల ఖాతాలకు జమ చేయాలన్నారు. పొద్దుతిరుగుడు పంటకు సంబంధించిన బీమా కూడా ఇవ్వాలని పేర్కొన్నారు. 2011 నుంచి 2015 వరకు రైతులకు ఇవ్వాల్సిన అన్ని రాయితీలను విడుదల చేయాలన్నారు. 60 ఏళ్లు దాటిన ప్రతి రైతుకు నెలకు రూ.3 వేలు చొప్పున పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలన్నారు.
ధర్నాకు ఎమ్మెల్యేల మద్దతు: ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి ధర్నాకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రైతులకు రుణమాఫీ ప్రకటించినప్పటికీ అది అస్తవ్యస్తంగా ఉందన్నారు. కొందరికి మాఫీ కావడం, మరికొందరికి కాకపోవడం వల్ల సమస్యలు ఏర్పడ్డాయన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రైతులకు అన్ని రకాల రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యల పరిష్కారం కోసం జరిగే ఆందోళనల్లో తమ పార్టీ ముందుభాగాన ఉంటుందని చెప్పారు.
ఎమ్మెల్యే ఎస్‌బీ అంజాద్‌బాషా మాట్లాడుతూ రైతుల పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారుతోందన్నారు. బీమా, పెట్టుబడి రాయితీలు, విత్తనా లు, రుణాలు, ఎరువులు వంటి అనేక సమస్యల మధ్య కొట్టుమిట్టాడుతున్నారని వివరించారు. దేశానికి అన్నం పెడుతున్న రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కార్యక్రమంలో బీకేఎస్ జిల్లా అధ్యక్షు డు సి.మాధవరెడ్డి, నాయకులు రామకృష్ణారెడ్డి, ఎం.జనార్దన్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.