
మాట్లాడుతున్న డాక్టర్ కోడెల శివప్రసాదరావు
శాసనసభ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించాక ముప్పాళ్ళ మండలంలో రైతుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తొలిసారిగా పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని డాక్టర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు.
స్పీకర్ కోడెల శివప్రసాదరావు
చాగంటివారిపాలెం (ముప్పాళ్ళ): శాసనసభ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించాక ముప్పాళ్ళ మండలంలో రైతుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తొలిసారిగా పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని డాక్టర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. చాగంటివారిపాలెం శ్రీ ప్రసన్న షిరిడీసాయి ఆలయంలో సోమవారం వ్యవసాయ శాఖ ఏర్పాటుచేసిన సబ్సిడీ విత్తనాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథి కోడెల మాట్లాడుతూ తాను రైతు కుటుంబం నుంచి వచ్చానని గుర్తుచేశారు.
ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక వ్యవసాయాధికారులతో మాట్లాడి ఖరీఫ్ సీజనులో రైతులకు కావలసిన ఎరువులు, విత్తనాలు సకాలంలో అందేలా చూడాలని కోరినట్లు చెప్పారు. గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా కాలువ చివరి భూములకు సాగునీరు సక్రమంగా అందేలా చర్యలు తీసుకున్నానని, ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగించేలా చూస్తానని చెప్పారు.
రైతులు విత్తనాలు వేసినప్పటి నుంచి పంటలు చేతికొచ్చేవరకు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చి రైతుమిత్రులుగా పేరుతెచ్చుకోవాలని వ్యవసాయాధికారులను కోరారు. రైతు రుణమాఫీపై మాట్లాడుతూ అర్హులందరికీ ఎటువంటి ఇబ్బంది ఉండదని కోడెల పేర్కొన్నారు. అనంతరం రైతులకు సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేశారు. తొలుత కోడెల ఆలయంలో పూజలు చేశారు.
ఏడీఏ ఎన్.వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తహశీల్దార్ కన్నెగంటి సుధారాణి, ఇన్‌చార్జి ఎంపీడీవో వెంకటేశ్వరరావు, ఏవో వరలక్ష్మి, చాగంటివారిపాలెం సర్పంచి మధిర సీతమ్మ, ముప్పాళ్ళ సర్పంచి చెల్లి ముసలయ్య, మండల అధికారులు, టీడీపీ నాయకులు, కోరమండల్ మనగ్రోమోర్ ప్రతినిధులు, ఆదర్శ రైతులు తదితరులు పాల్గొన్నారు.