ఏటా పెరుగుతున్న అగ్ని ప్రమాదాలు
ఉన్నవి 11 స్టేషన్లు, 10 ఫైర్ ఇంజిన్లు
అగ్నిమాపక శాఖను వేధిస్తున్న సిబ్బంది కొరత
విశాఖపట్నం : వేసవిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇది సహజం. ఆందోళనకర విషయం ఏమిటంటే జిల్లాలో ఏటా ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. ఏ ఏటికాయేడు అగ్ని ప్రమాదాల భారిన పడి చనిపోతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఆ అగ్ని పరీక్షను ఎదుర్కొనేందుకు సరైన సన్నద్ధత మాత్రం మద్ద వద్ద లేదు. అగ్నిప్రమాదం సంభవించినప్పుడు ఆదుకోవాల్సిన అగ్నిమాపకశాఖ అరకొర సౌకర్యాలతో కొట్టుమిట్టాడుతూ అగ్నిపరీక్షను ఎదుర్కొంటోంది. సమయానికి వెళ్లాలన్నా, బాధితులను రక్షించాలన్నా ఆ శాఖకు కష్టసాధ్యమవుతోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో అంతే వేగంగా పెరుగుతున్న ప్రమాదాల సంఖ్యకు అనుగుణంగా ఫైర్‌స్టేషన్‌ల సంఖ్య, సిబ్బంది పెరగడం లేదు.
అరకొర సిబ్బందితో అవస్థలు
ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 10 ఫైర్ ఇంజిన్లతో 11 ఫైర్ స్టేషన్లు నడుస్తున్నాయి. వాటిలో మూడు సిటీ పరిధిలో ఉన్నాయి. నక్కపల్లి, రావికమతంలో ఒక్కో స్టేషన్ చొప్పున మరో రెండు స్టేషన్లు అవుట్‌సోర్సింగ్ విధానంలో నిర్వహిస్తున్నారు. వాటన్నిటికీ 154 మంది సిబ్బంది అవసరం కాగా 92 మంది మాత్రమే ఉన్నారు. దీంతో 62 మంది హోంగార్డులకు శిక్షణ ఇచ్చి వారి సాయంతో నెట్టుకొస్తున్నారు. గత రెండేళ్లుగా ఇదే పరిస్థితి. ఏటా సిబ్బందిలో కొందరు రిటైర్ కావడం, బదిలీ అవుతుండటంతో ఖాళీల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయినప్పటికీ ఆ స్థాయిలో నియామకాలు మాత్రం చేపట్టడం లేదు. జిల్లాలో కనీసం మరో రెండు ఫైర్‌స్టేషన్లు, శాశ్వత సిబ్బంది సరిపడా ఉంటే తప్ప ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా పనిచేసే అవకాశం లేదని అధికారులు అంటున్నారు.
పెరుగుతున్న మరణాలు
జిల్లా వ్యాప్తంగా అగ్ని ప్రమాదాలు పెరుగుతున్నాయి. అదే స్థాయిలో మరణాలు సంభవిస్తున్నాయి. 2013-14లో 847 ప్రమాదాలు జరిగితే 14 మంది, 2014-15లో 1479 ప్రమాదాల్లో 26 మంది, 2015-16లో 1031 ప్రమాదాలు జరిగి 43 మంది చనిపోయారు. ఈ లెక్కలను పరిశీలిస్తే ప్రమదాల సంఖ్యల్లో హెచ్చుతగ్గులున్నప్పటికీ మరణాలు మాత్రం భారీగా పెరగుతున్నాయని స్పష్టమవుతోంది. ప్రమాదం సంభవించినపుడు త్వరిత గతిన రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్లనే మరణాల సంఖ్య పెరుగుతోంది. కానీ ఆ మేరకు స్పందించడానికి అగ్నిమాపక శాఖకు ఉన్న వనరులు సరిపోవడం లేదు. దీంతో ప్రైవేటు వ్యక్తుల సాయం తీసుకుంటున్నారు. అత్యవరస సమయాల్లో ప్రైవేటు వాహనాలను వినియోగిస్తున్నా నష్ట తీవ్రతను మాత్రం తగ్గించలేకపోతున్నారు.
ప్రతిపాదనలు పంపించాం
నగర శిశారు ప్రాంతాల్లో అభివృద్ధి ఎక్కువగా జరుగుతోంది. గృహాలు, పరిశ్రమలు విపరీతంగా పెరుగుతున్నాయి. పది నుంచి 20 అంతస్తుల భారీ భవంతులు నిర్మిస్తున్నారు. మా వద్ద 54 మీటర్ల ఒక బ్రోన్టో స్కైలిఫ్ట్ మాత్రమే ఉంది. ఇది కేవలం 16 నుంచి 18 అంతస్తుల వరకే వెళ్లగలదు. కనీసం 90 మీటర్లు ఎత్తుకు వెళ్లగలిగే మూడు స్కైలిఫ్ట్‌లు అవసరం. లైఫ్ డిటెక్టర్లు, బాధితులున్న ప్రదేశాలను కనిపెట్టే కెమెరాలు, మల్టీ కట్టర్లు, తాళ్లు, డ్రాగన్ లైట్లు వంటివి కావాలి. ప్రమాద స్థలానికి ఫైర్ ఇంజిన్లు, అధికారులను వేగంగా చేర్చేందుకు 13 మంది డ్రైవర్లు ఉండాలి. విశాఖ తూర్పు, పెందుర్తి ప్రాంతాల్లో రెండు ఫైర్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి. వీటిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. - జె.మోహన్‌రావు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి