జిల్లాలో మరో విమానాశ్రయం?
విజయవాడ: జిల్లాలో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాన్ని నిర్మించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. హైదరాబాద్ తరహాలో విజయవాడకు దగ్గరలో కొత్త ఎయిర్‌పోర్టును నిర్మించడంలో గల సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు సోమవారం ఢిల్లీలో మాట్లాడుతూ, విజయవాడలో కొత్త ఎయిర్‌పోర్టు ఏర్పాటుచేస్తామని ప్రకటించారు.
దీంతో మరింత బలం చేకూరినట్లయింది. ప్రస్తుతం గన్నవరంలో వున్న ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి భూసేకరణ ప్రతిబంధకంగా మారింది. ప్రభుత్వ విలువలు, బహిరంగ మార్కెట్ విలువలు అధికంగా ఉన్న గన్నవరం విమానాశ్రయం సమీపంలో భూములు సేకరించడం కంటే నూజివీడు సమీపంలోని కాట్రేనిపాడు వద్ద ఉన్న అటవీ భూమి లేదా ప్రైవేటు భూమిని సేకరించడం మేలనే ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.
గన్నవరంలో మార్కెట్ విలువ కంటే నూజివీడు ప్రాంతంలో ధరలు తక్కువగా ఉండడంతో, తక్కువ వ్యయంతో అక్కడ కొత్త ఎయిర్‌పోర్టు నిర్మాణ ప్రతిపాదన తెరమీదకు వచ్చిందని చెబుతున్నారు. హైదరాబాద్‌లో బేగంపేటలో మాదిరిగా డొమెస్టిక్ సర్వీసులు నడిపే విధంగా గన్నవరం విమానాశ్రయాన్ని వినియోగించాలని భావిస్తున్నారు. శంషాబాద్ తరహాలో నూజివీడు ప్రాంతంలో అంతర్జాతీయ సర్వీసులు, కార్గో సర్వీసులు నడిపేందుకు మరో ఎయిర్‌పోర్టును నిర్మించాలని భావిస్తున్నట్లు సమాచారం. నూజివీడులో నిర్మించే విమానాశ్రయం నుంచి నేరుగా కొత్తగా నిర్మించనున్న విజయవాడ బైపాస్, అవుటర్ రింగ్‌రోడ్డుల్లోకి ప్రవేశించవచ్చు. అక్కడ్నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ బైపాస్‌లోకి చేరుకోవచ్చు.
సగానికి సగం బడ్జెట్ తేడా
అంతర్జాతీయ విమానాశ్రయం నూజివీడులో నిర్మిస్తే సగానికి సగం బడ్జెట్ వ్యయం తేడా వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఐదేళ్లక్రితమే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు రూ. 100 కోట్ల బడ్జెట్ అవసరమని ఎయిర్‌పోర్టు అథారిటీ అంచనా వేసింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో రూ. 500 కోట్లతో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మించవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో గన్నవరంలో పెరిగిన మార్కెట్ విలువల ప్రకారం వెయ్యి ఎకరాల భూసేకరణకు దాదాపు వెయ్యికోట్లు ఖర్చవుతుంది. అదే నూజివీడు సమీపంలో కాట్రేనిపాడు వద్ద మూడు వేల ఎకరాల అటవీ భూముల్ని వినియోగించుకోవచ్చు.
అలా కాకుండా నూజివీడులో ప్రైవేటు భూమిని సేకరించినా రూ. 500 కోట్లతో గన్నవరం కంటే తక్కువ వ్యయంతో కొనుగోలు చేయవచ్చు. గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలో భూసేకరణ జరపనున్న ప్రాంతంలో ఎకరం రూ.25 లక్షల నుంచి కోటి రూపాయలకు పెరిగింది. ఆ ప్రాంతంలో ప్రభుత్వ విలువలు దాదాపు రూ. 20లక్షలు ఉండగా నూజివీడు ప్రాంతంలో ప్రైవేటు విలువలు రూ. 8 లక్షల నుంచి రూ. 10 లక్షల లోపే ఉన్నాయి.
నూజివీడు ఏరియాలో బహిరంగ మార్కెట్ ధరలు ఎకరం రూ. 30 లక్షల నుంచి రూ. 50 లక్షల లోపు ఉంది. గన్నవరం విమానాశ్రయానికి దగ్గర్లో 431 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. ఇక్కడ భూసేకరణతోపాటు ఇళ్లు కూడా ఖాళీ చేయించాల్సి రావడం ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలో నూజివీడులో రూ.500 కోట్ల వ్యయంతోనే అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.