
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ చిన్నల్లుడు, గీతం సంస్థల అధినేత ముతుకుమిల్లి భరత్ కుటుంబానికి మరో భారీ షాక్ తగిలింది. వందల కోట్లు రుణాలు తీసుకొని ఎగ్గొడుతుండటంతో తనఖా పెట్టిన ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. భరత్ కుటుంబానికి చెందిన యూనిక్ ఇన్‌ఫ్రాటెక్ కంపెనీ హైదరాబాద్ అబిడ్స్ కరూర్ వైశ్యా బ్యాంకుకు రూ. 124.39 కోట్లు బకాయి పడింది. ఆ రుణాన్ని జనవరి 21, 2020లోగా చెల్లించాలని గతంలో బ్యాంకు నోటీసులు జారీ చేసినప్పటికీ కుటుంబసభ్యులు స్పందించలేదు. దీంతో ఫిబ్రవరి 2న హైదరాబాద్‌లోని ఇంటికి బ్యాంకు నోటీసులు అంటించింది. ఈ రుణానికి హామీగా ఉన్న వారందరికీ కొరియర్, స్పీడ్‌పోస్టుల ద్వారా నోటీసులు జారీ చేయగా కొంతమందికి చేరాయని, అందని వారు బ్యాంకుకు వచ్చి తీసుకోవాల్సిందిగా పేర్కొంది.
ఈ రుణానికి ప్రధాన హామీదారునిగా ఉన్న గీతం విద్యాసంస్థల వ్యవస్థాపకుడు ఎంవీవీఎస్ మూర్తి మరణించడంతో ఆయన వారసులైన పట్టాభి రామారావు (భరత్ తండ్రి), లక్ష్మణరావు, భారతీ వరదరాజ్‌లను హామీదారులుగా చేర్చింది. గడువులోగా రుణాలను చెల్లించకపోతే బ్యాంకులో తాకట్టు పెట్టిన విశాఖ జిల్లా గాజువాక మండలం, భీమిలి మండలంలోని భూములను, విశాఖ నగరం డొండపర్తి ప్రాంతంలోని ఆస్తులను స్వాధీనం చేసుకుని వేలం వేస్తామని స్పష్టం చేసింది. గతేడాది అక్టోబర్‌లో భరత్ సహా 11 మంది కుటుంబసభ్యులు, సన్నిహితులకు విశాఖ నగరంలోని ఆంధ్రా బ్యాంకు సీతమ్మధార బ్రాంచ్ డీ ఫాల్టర్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. భరత్‌కు చెందిన సంస్థ మొత్తం రూ. 13.65 కోట్లు బాకీ పడిందని పేర్కొంది. కాగా, భరత్ గత ఎన్నికల్లో టీడీపీ నుంచి విశాఖ ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే.
బ్యాంక్ జారీచేసిన నోటీసు
Comments
Please login to add a commentAdd a comment