హుద్‌హుద్ విధ్వంసం ఇంకా కళ్ల ముందు కదులాడుతుండగానే.. మరో తుఫాన్ ముంచుకొస్తోంది. జిల్లా వాసులకు కంటిమీద కనుకులేకుండా చేస్తోంది. చిన్నపాటి ఈదురుగాలికే వణికి పోతున్న జనం మరో తుఫాన్ అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలతో భయాందోళనలకు గురవుతున్నారు. కోత దశలో ఉన్న పంటలు తుడిచిపెట్టుకుపోతాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
సాక్షి, విశాఖపట్నం: విశాఖకు దక్షిణ బంగాళాఖాతంలో 580 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇప్పటికే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోందని.. శుక్రవా రం నాటికి పెనుతుఫాన్‌గా మారి, తీరం లో 60 నుంచి 70కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రభావంతో విశాఖ,తూర్పుగోదావరి జిల్లాల్లో శని, ఆదివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఆ రెండురోజుల్లో గరిష్టంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశముందంటున్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో తీరం దాటే అవకాశాలున్నాయని, ఏ దిశగా పయనిస్తుందో శుక్రవారం సాయంత్రానికి కానీ చెప్పలేమంటున్నారు.
ఒకటో ప్రమాద హెచ్చరిక: వాయుగుండం తీవ్రతను బట్టి ఇప్పటికే విశాఖపట్నంతో పాటు కాకినాడ, కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులంతా 8వ తేదీ ఉదయానికి తీరానికి రావాలని, ఇక నుంచి వేటకు వెళ్లరాదని జిల్లా అధికాారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్‌లు ఇప్పటికే సెలవుపై వెళ్లడంతో జిల్లా బాధ్యతలు చూస్తున్న జేసీ ప్రవీణ్‌కుమార్ ఇప్పటికే యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
కలెక్టరేట్‌లో 1800-4250-0002 నంబర్‌తో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌తోపాటు అన్ని రెవెన్యూ డివిజన్, మండల కేంద్రాల్లోనూ ప్రత్యేకంగా నియంత్రణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అధికారులకు సెలవులు రద్దు చేసి మండల కేంద్రాల్లోనే ఉండాలని ఆదేశించారు. విశాఖనగరంతో పాటు జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంచేశారు.
ముందు జాగ్రత్తగా తీరప్రాంత మండలాల్లో బియ్యం, ఇతర నిత్యావసరాలను సిద్ధం చేశారు. డివిజనల్, మండల కార్యాలయాల్లో వీహెచ్‌ఎఫ్‌సెట్స్‌తో పాటు జనరేటర్లకు కనీసం రెండుమూడు రోజులకు సరిపడా అవసరమైన డిజిల్‌ను సిద్ధం చేశారు. వేటకెళ్లొద్దంటూ తీరప్రాంత గ్రామాల్లో టాంటాం వేసి మత్స్యకారులను అప్రమత్తం చేశారు. ముందుజాగ్రత్త చర్యగా మండలాల్లో 20 రెస్క్యూ బోట్లను నేవీ సిద్ధం చేసింది.
ముంచుకొస్తున్న మరో ముప్పు
Published Fri, Nov 7 2014 2:41 AM | Last Updated on Tue, Oct 16 2018 4:56 PM
Advertisement
Advertisement