అంతన్నాడు... ఇంతన్నాడు...చివరికి నట్టేట ముంచాడు!
- కంఠంనేని నామినేషన్ ఉప సంహరణపై మండిపడుతున్న అభిమానులు చర్చలు ‘ఫలప్రదం’
అవనిగడ్డ, న్యూస్‌లైన్ : అంతన్నాడు.. ఇంతన్నాడు.. గంగరాజు చివరికి నట్టేట ముంచేశాడు అనే పాటను రవిశంకర్ అభిమానులు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి అభిమానుల భారీ పాదయాత్ర నడుమ నామినేషన్ దాఖలు చేసిన తెలుగువన్ ఫౌండేషన్ అధినేత కంఠంనేని రవిశంకర్ నాటకీయ పరిణామాల నేపథ్యంలో బుధవారం తన నామినేషన్ ఉపసంహరించుకోవడం ఆయన అభిమానులను హతాశులను చేసింది. నామినేషన్ వేసిన నాటినుంచీ పోటీ నుంచి విరమించేదే లేదంటూ తేల్చిచెబుతున్న కంఠంనేని ఉపసంహరణల చివరిరోజు చేతులెత్తేశారు.
పలికినవన్నీ డాంబికాలే...
అవనిగడ్డ అసెంబ్లీ స్థానాన్ని కనీసం తనతో సంప్రదించకుండా మండలి బుద్ధప్రసాద్‌కు కట్టబెట్టడంపై కినుక వహించిన రవిశంకర్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం అభిమానులతో నిర్వహించిన సమావేశంలో పలువురు మాట్లాడుతూ చంద్రబాబు, బాలకృష్ణ ఫోను చేస్తే నామినేషన్ తీసేస్తారని వార్తలు వస్తున్నాయని ఆయన వద్ద ప్రస్తావించారు. దీనిపై ఆయన స్పందిస్తూ ‘ఎన్‌టీ రామారావు దిగి వచ్చి చెబితే తప్ప నామినేషన్ ఉపసంహరించే ప్రసక్తే లేదు’ అని అభిమానులకు స్పష్టం చేశారు.
నామినేషన్ అనంతరం గుర్తు కేటాయించకపోయినా ప్రచార పర్వాన్ని ప్రారంభించారు. తీరాచూస్తే నామినేషన్ ఉపసంహరణకు చివరి రోజైన బుధవారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్‌తో కలసి వచ్చి నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో అభిమానులు హతాశులయ్యారు. తమను నమ్మించి వెంట తిప్పుకొని ఇప్పుడు నట్టేట ముంచాడని వారు మండిపడుతున్నారు.
2009 ఎన్నికల సందర్భంగా కూడా అవనిగడ్డ సీటును ఆశించిన రవిశంకర్‌ను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బుజ్జగించారు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా రవిశంకర్ ఇండిపెండెంటుగా నామినేషన్ దాఖలు చేయటంతో పార్టీ అగ్రనాయకులు రంగంలోకి దిగి బుజ్జగింపుల పర్వం ప్రారంభించారు. చివరికి అవి ఫలప్రదమయ్యాయి.
నామినేటెడ్ పదవికి ఆశపడి...
రావివారిపాలెం (మోపిదేవి) : పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో మొదటి నామినేటెడ్ పోస్టు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని నామినేషన్ ఉపసంహరణ అనంతరం కంఠంనేని వివరించారు. టీడీపీ రెబల్ అభ్యర్థిగా అవనిగడ్డ నియోజకవర్గంలో బరిలో నిలిచిన తెలుగువన్ ఫౌండేషన్ అధినేత రవిశంకర్ బుధవారం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌తో కలసి అవనిగడ్డ వెళ్లి నామినేషన్ ఉపసంహరించారు. అంతకుముందు మండలి ఉదయం స్వయంగా కంఠంనేని ఇంటికి వెళ్లి ఏకాంతంగా జరిపిన సమాలోచనలు ఫలప్రదమయ్యాయి. అనంతరం కంఠంనేని మాట్లాడుతూ చంద్రబాబు రెండు సార్లు ఫోన్ చేయడంతో కాదనలేకపోయానని చెప్పారు.