బాలకృష్ణ పోటీ చేస్తానంటే కోరిన సీటును ఇస్తా! | I will give seat for Bala Krishna if he interested, says Chandrababu naidu | Sakshi
Sakshi News home page

బాలకృష్ణ పోటీ చేస్తానంటే కోరిన సీటును ఇస్తా!

Published Wed, Mar 12 2014 2:05 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

బాలకృష్ణ పోటీ చేస్తానంటే కోరిన సీటును ఇస్తా! - Sakshi

బాలకృష్ణ పోటీ చేస్తానంటే కోరిన సీటును ఇస్తా!

  •  బాలకృష్ణకు పార్టీ అధ్యక్ష పదవి డిమాండ్‌పై బాబు స్పందన
  •   నేను సీమాంధ్ర నుంచే పోటీచేస్తా.. లేకపోతే ప్రజలు డీలాపడతారు
  •   నేను 1999 వరకూ స్వయంగా నిర్ణయాలు తీసుకునేవాడ్ని..
  • ఆ తర్వాత 2009 వరకూ చెప్పుడు మాటలు విని విఫలమయ్యా
  •  సాక్షి, హైదరాబాద్:  ‘‘నీకు అధ్యక్ష పదవి ఇవ్వాలని పది మంది వచ్చి కోరతారు.. ఇస్తామా ఏంటి?’’ - సినీ నటుడు, తన వియ్యంకుడు నందమూరి బాలకృష్ణకు తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టాలని ఆయన అభిమానులు డిమాండ్ చేస్తున్న విషయంపై ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు స్పందన ఇది. బాలకృష్ణ పోటీ చేస్తానంటే ఆయన కోరిన సీటును ఇస్తానని చంద్రబాబు చెప్పారు. అయితే.. పార్టీ అధ్యక్ష పదవిని ఆయనకు కేటాయించటంపై తాను ఇపుడు ఏమీ మాట్లాడనన్నారు. చంద్రబాబు మంగళ వారం తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తన కుటుంబ సభ్యులు పార్టీ తరఫున ప్రచారం చేస్తారని చెప్పారు. తాను సీమాంధ్ర ప్రాంతం నుంచి పోటీచేస్తానని.. తాను అక్కడి నుంచి పోటీ చేయకపోతే ప్రజలు డీలా పడిపోతారని చంద్రబాబు పేర్కొన్నారు. అక్కడా తనను లేకుండా చేయటంతోపాటు వైఎస్సార్ కాంగ్రెస్‌కు సహకరించాలనే ఉద్దేశంతోనే.. టీడీపీ సీమాంధ్రలో బీసీ సీఎం నినాదం ఎందుకు ఇవ్వలేదని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారని ఆయన విమర్శించారు. టీఆర్‌ఎస్‌తో అనుబంధం ఉన్న ఉద్యోగులకే తనపట్ల వ్యతి రేకత ఉందని బాబు వ్యాఖ్యానించారు. తాను 1999 వరకు స్వయంగా నిర్ణయాలు తీసుకునే వాడినని, ఆ తరువాత 2009 వరకూ పలువురు చెప్పిన మాటలు వినటంతో పాటు మొహమాటాలకు పోయి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవటంతో వైఫల్యాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. 
     
     ఐవీఆర్‌ఎస్ ద్వారా అభ్యర్థుల ఎంపిక: వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, పొత్తులు తదితర అంశాలపై చర్చించేందుకు రెండు రోజుల్లో పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశమవుతుందన్నారు. పార్టీ బలహీనంగా ఉన్న జిల్లాల్లోనే ఇతర పార్టీల నుంచి నేతలు వస్తున్నారని, దీనివల్ల పార్టీ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. అభ్యర్థులను ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవీఆర్‌ఎస్) పద్ధతి ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి ఎంపిక చేస్తామని అన్నా రు. తొలుత పార్టీ కార్యకర్తలు, ఆ తరువాత ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామన్నారు. అసెంబ్లీ లేదా లోక్‌సభ సీటుకు పోటీచేసే అభ్యర్థుల పేర్లను ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రజలకు పంపి వారి నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని, వీరు ఎవ్వరూ వద్దనుకుంటే మరొకరి పేరు సూచించాలని కోరతామని చెప్పారు. కుప్పం నియోజకవర్గంలో కూడా ఇదే పద్ధతిని అవలంభిస్తామన్నారు. ఇదిలావుంటే.. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు బుధవారం టీడీపీలో చేరనున్నారు. 
     
     వెన్నుపోటు భయమా?: చంద్రబాబు విలేకరుల సమావేశానికి ‘సాక్షి’ని అనుమతించలేదు. వివిధ మార్గాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా వార్త ఇవ్వటం జరిగింది. ఈ సమావేశానికి ‘సాక్షి’ని  అనుమతించి ఉంటే ఈ కింది ప్రశ్నలకు జవాబులు రాబట్టేది...  బాలకృష్ణకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తే 1995లో ఎన్‌టీఆర్‌కు మీరు ఎలాగైతే వెన్నుపోటు పొడిచారో అలా మీకు ఆయన వెన్నుపోటు పొడుస్తారని భయపడుతున్నారా?  ఒకప్పుడు స్వయంగా నిర్ణయాలు తీసుకునే అలవాటు ఉందంటున్న మీరు.. ఆ తరువాత మొహమాటాలకు ఎందుకు పోవాల్సి వచ్చింది?   తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి న మీకు ఇక్కడే ఓటు హక్కుంది. తెలంగాణనుంచి పోటీకి ఎందుకు జంకుతున్నారు?
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement