రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేదికి ఫిర్యాదుచేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు
సాక్షి, అమరావతి: విజయనగరం జిల్లాలో సర్వేల పేరుతో ఇళ్లకు వెళ్తున్న సర్వే బృందాలు టీడీపీ వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నాయని, వారిని పట్టుకుని అప్పగిస్తే అరెస్టు చేయాల్సిన పోలీసులు వైఎస్సార్‌సీపీ నేతల్ని నిర్బంధించి దౌర్జన్యం చేస్తున్నారని పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఆయనతోపాటు పార్టీ నేతలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, చెల్లుబోయిన వేణు, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేష్ తదితరులు సచివాలయంలో ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని, మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను శుక్రవారం కలిసి ఫిర్యాదు చేశారు. సర్వే చేయడానికి వచ్చిన ఎన్నికల కమిషన్ ఉద్యోగులమంటూ టీడీపీ కార్యకర్తలు గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ వైఎస్సార్‌సీపీ, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అభిమానులుగా పేర్కొన్న వారిని గుర్తించి, వారి ఓట్లను తొలగిస్తున్నారని ద్వివేది దృష్టికి తెచ్చారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కుమిలి గ్రామంలో ఉద్యోగులుగా చెప్పుకుంటూ సర్వేలు చేస్తున్న ఓ ప్రైవేట్ సంస్థ సిబ్బంది నుంచి స్వాధీనం చేసుకున్న కొన్ని ట్యాబ్‌లను ఆయనకు అందజేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా విజయనగరం జిల్లాలో ఓట్లు తొలగించే టీడీపీ సర్వే బృందాలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని, సర్వే పేరుతో ఓట్లు తొలగిస్తున్న యువకులను పట్టుకుని అప్పగిస్తే పోలీసులు వదిలేశారని డీజీపీ దృష్టికి తెచ్చారు.
డీజీపీకిచ్చిన ఫిర్యాదులో..
విజయనగరం జిల్లాలో సర్వే బృందాలు చేస్తున్న అక్రమాల వివరాలు, జరిగిన ఘటన, పోలీసుల తీరు తదితర అంశాలను బొత్స డీజీపీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గురువారం విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కుమిలిలో టీడీపీకి చెందిన గొల్లు కృష్ణ్ణ, గొల్లు దేముడుబాబు, తొత్తు దేముడు అనే యువకులు ప్రభుత్వ అధికారులమని చెప్పుకుంటూ ఇంటింటికీ తిరుగుతూ సర్వే చేశారని వివరించారు. వారు ట్యాబ్‌లు తీసుకొచ్చి అందులో ఓటర్ల జాబితాలు ఉంచుకుని ఎవరికి అనుకూలంగా ఉంటారు? ఏ పేపర్ చదువుతారు? ప్రభుత్వ పథకాలు బాగున్నాయా? అధికార పార్టీకి వ్యతిరేకమా? అనుకూలమా? అని ఓటర్ల నుంచి సమాధానాలు రాబట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సర్వేపై అనుమానం వచ్చిన గ్రామస్తులు కొందరు వైఎస్సార్‌సీపీ నేతల్ని పిలిచి చెప్పారని, నేతలు ఆ యువకులను ప్రశ్నించడంతో వారు తడబడ్డారని తెలిపారు. పబ్లిక్ పాలసీ రీసెర్చ్ గ్రూప్ పేరుతో సర్వే చేస్తున్నవారు టీడీపీకి చెందినవారేనని, ఇంటింటికీ తిరిగి అభిప్రాయాలు అడిగిన తర్వాత ఓటర్ల లిస్ట్‌లో వారి ఓట్లు మాయమవుతున్నాయని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు సర్వే చేస్తున్న యువకులను పోలీసులకు అప్పగించగా పోలీసులు ఆ యువకులను పంపేశారని, ఆ ట్యాబ్‌లలో ఏముందో విచారించాలని కోరినా వినకుండా ఆ ట్యాబ్‌లను తమకు అప్పగించారని డీజీపీ దృష్టికి తెచ్చారు. విజయనగరం పోలీసులు అర్ధరాత్రి సమయంలో పార్టీ నేత మజ్జి శ్రీనివాసరావుతోపాటు ఇతర నేతల్ని అక్రమంగా నిర్బందించి ఆ ట్యాబ్‌లను యువకుల వద్ద నుంచి లాక్కున్నారంటూ అక్రమ కేసులు నమోదు చేశారని ఫిర్యాదు చేశారు.
అక్రమాలను అడ్డుకుంటాం
ఎన్నికల ప్రధాన అధికారిని, డీజీపీని కలిసిన తర్వాత పార్టీ నేత బొత్స మీడియాతో మాట్లాడారు. అధికారం కోసం చంద్రబాబు ఇలాంటి అడ్డదారులు తొక్కడం దారుణమని, వీటిని అడ్డుకుంటామని అన్నారు. శుక్రవారం జాతీయ ఓటర్ల దిన్సోతవమని.. అదే రోజున ఇలాంటివి జరగడం దేశ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని వ్యాఖ్యానించారు. ఉద్యోగులుగా చెప్పుకుంటూ గ్రామాల్లో సర్వేలకొస్తున్న టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీకి అనుకూలురైనవారి ఓట్లను ట్యాబ్‌లో ఓటర్ల జాబితాలో మార్కు చేసుకొని, ఆ వివరాలను పైకి చేరవేస్తున్నారని చెప్పారు. విజయనగరంలో వీటిని అడ్డుకున్న తమ పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేయడం ప్రభుత్వ అక్రమాలకు పరాకాష్ట అని దుయ్యబట్టారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజక వర్గంలోనూ ఇలా సర్వేల ద్వారా గుర్తించిన వారి ఓట్లను 30 వేల దాకా అక్రమంగా తొలగించారని మండిపడ్డారు. ఇలా సర్వేల పేరుతో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓట్ల తొలగింపునకు వినియోగిస్తున్న ట్యాబ్‌లపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని ఎన్నికల ప్రధాన అధికారి, డీజీపీ హామీ ఇచ్చారన్నారు. డీజీపీ తీసుకునే చర్యలను బట్టి తమ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ నేతలతోపాటు లీగల్ సెల్ ప్రతినిధులు కోటంరాజు వెంకటేశ్వర శర్మ, సుజాతశర్మ, బి.సతీష్, పార్టీ సంయుక్త కార్యదర్శి అడపా శేషు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment