
సాక్షి, అమరావతి: రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో కీలకమైన వైజాగ్– చెన్నై పారిశ్రామిక కారిడార్ (వీసీఐసీ) పనులు ఇక వేగంగా జరగనున్నాయి. తూర్పు తీరంలో కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో ఎంతో కీలకమైన వీసీఐసీ పనులు కొన్నేళ్లుగా నత్తనడకన సాగుతున్న విషయం తెలిసిందే. ఆసియా అభివృద్ధి బ్యాంకుతో కలిసి చేపడుతున్న ఈ ప్రాజెక్టులో భాగంగా4 క్లస్టర్లలో కనీస మౌలిక వసతులు కల్పించే విధంగా ప్రభుత్వం పరిపాలన అనుమతులను మంజూరు చేసింది. ట్రాంచ్1, ట్రాంచ్2 కింద రూ.3,512.67 కోట్ల విలువైన వీసీఐసీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులను చేపట్టడానికి రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలన్ గురువారం అనుమతులు మంజూరు చేశారు.
ట్రాంచ్1లో వీసీఐసీ కారిడార్‌లో రహదారుల విస్తరణ, విద్యుత్, మురుగునీటి శుద్ధి వంటి కార్యక్రమాలు చేపట్టడానికి రూ.1,869.01 కోట్లు, ట్రాంచ్–2లో నాలుగు పారిశ్రామిక కస్టర్లను రూ.1,643.66 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. చిత్తూరు నోడ్‌లో ఏపీఐఐసీకి చెందిన 2,770 ఎకరాల్లో చిత్తూరు దక్షిణ క్లస్టర్‌లో రూ.660 కోట్లతో కీలకమైన పారిశ్రామిక మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. విశాఖపట్నం నోడ్‌లో అచ్యుతాపురం క్లస్టర్‌లో ఏపీ సెజ్, రాంబిల్లి పారిశ్రామిక వాడలకు అవసరమైన 95 ఎంఎల్‌డీ సామర్థ్యంతో నీటి సరఫరా చేయడానికి రూ.303.60 కోట్లు వ్యయం చేయనున్నారు. అదే విధంగా 392 ఎకరాల రాంబిల్లి పారిశ్రామిక వాడలో రూ.198 కోట్లతో మౌలిక వసతులు, అదే విధంగా నక్కపల్లి క్లస్టర్‌లో 1,120 ఎకరాల్లో రూ.376 కోట్లతో మౌలిక వసతులు కల్పించనున్నారు. వీటికితోడు ఏపీ మెడ్‌టెక్ జోన్‌లో రూ.106.06 కోట్లతో అంతర్గత మౌలిక వసతులు అభివృద్ధి చేయనున్నారు.