విజయనగరం@సంక్షేమం..సాకారం | Ap Budget Special Story In Vizianagaram | Sakshi
Sakshi News home page

విజయనగరం@సంక్షేమం..సాకారం

Published Sat, Jul 13 2019 7:53 AM | Last Updated on Sat, Jul 13 2019 7:54 AM

Ap Budget Special Story In Vizianagaram - Sakshi

సాక్షి, విజయనగరం : ఎన్నో ఏళ్ల కల. ఎప్పుడు నెరవేరుతుందో... పెండింగ్‌ సమస్యలు ఎప్పుడు పరిష్కారమవుతాయో తెలియక... తమ కష్టాలు ఎవరు తీరుస్తారో అర్థం కాక... కాలం వెళ్లదీస్తున్న జనానికి ఓ గొప్ప వరం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రూపంలో లభించింది. జనం కష్టాన్ని చూసిన ఆ నేత తొలి బడ్జెట్‌లోనే వారి కన్నీళ్లు తుడిచారు. సమస్యతో సతమతమయ్యే సామాన్యుడి కళ్లల్లో సంతోషం నింపారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన 43 రోజుల్లోనే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌లోనే జిల్లాకు వరాలు కురిపించడమే గాకుండా సంక్షేమానికి పెద్దపీట వేసి, బంగారు భవితకు భరోసా కల్పించారు.

జిల్లాకు చెందిన మంత్రి బొత్ససత్యనారాయణ ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్‌లోనూ వరాలు కురిపించారు. వెనుకబడిన జిల్లాగా ఉన్న విజయనగరం జిల్లా ప్రజలు మెరుగైన వైద్యానికి నోచుకోవడం లేదు. జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్లుగా ఇక్కడి ప్రజలు వేడుకుంటున్నారు. అయినా గత ప్రభుత్వాల మనసు కరగలేదు.

కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతి కూడా మెడికల్‌ కళాశాల విషయంలో ప్లేటు ఫిరాయించారు. మాన్సాస్‌ ట్రస్ట్‌ ద్వారా మెడికల్‌ కళాశాల నిర్మిస్తామని ముందుకు వచ్చి, ఖర్చు ఎక్కువవుతోందనే ఉద్దేశంతో వెనక్కు తగ్గారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాగానే జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇవ్వడమేగాకుండా... తొలి బడ్జెట్‌లోనే రూ.66 కోట్లను కేటాయించారు.

జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులు:
తోటపల్లి : రూ. 156 కోట్లు
జంఝావతి : రూ. 5.07 కోట్లు
తారకరామ తీర్ధసాగర్‌ : రూ.  21కోట్లు
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి : రూ. 170.06 కోట్లు

విజయనగరంతో పాటు ఉత్తరాంధ్రకు ఈ కళాశాల సేవలందించనుంది. ప్రాజెక్టులకు మహర్దశ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో తోటపల్లి పనులు 90శాతం పూర్తికాగా... మిగిలిన 10 శాతం పనులనైనా గత టీడీపీ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. కానీ తామే ఆ ప్రాజెక్టు పూర్తి చేశామని గత ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నారు. జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి తోటపల్లి గట్టుపై పాదయాత్ర చేశారు. ప్రాజెక్టు వల్ల జిల్లాకు కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకున్నారు. మిగిలిపోయిన పనులను పూర్తి చేస్తే వేలాది ఎకరాలు సాగులోకి వస్తాయని, ఎన్నో గ్రామాలకు తాగునీటి అవసరాలు తీరుతాయని గ్రహించారు.

అంతేగాదు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి సాగునీటి ప్రాజెక్టుల కొరతే ప్రధాన కారణమని భావించిన జగన్‌ ఈ ప్రాంతంలో వాటిని అభివృద్ధి చేయాలని సంకల్పించారు. దానిలో భాగంగా తోటపల్లి ప్రాజెక్టును సంపూర్ణంగా పూర్తి చేస్తామని బడ్జెట్‌లో హామీ ఇవ్వడమే గాకుండా జంఝావతి, తారకరామతీర్థ సాగర్‌ తదితర ప్రాజెక్టులకు నిధులు కేటాయించారు. రైతులు... మహిళలకు పెద్దపీట తొలి బడ్జెట్‌లో రైతులు, మహిళలు, క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బందికి పెద్దపీట వేశారు. పగటిపూటే రైతులకు 9గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తామని ప్రకటించారు.

రైతు భరోసా, రైతు బీమా, వడ్డీలేని రుణాలు వంటి వరాలిచ్చారు. 11 నెలల కౌలు కాలానికి పంట సంబంధ హక్కులను కలిగి ఉండేందుకు చట్టబద్ద యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామనడం ద్వారా జిల్లాలో కౌలు రైతుల బతుకులకు భరోసా కల్పించారు. పాడి రైతులను సైతం విస్మరించకుండా లీటర్‌పై రూ.4 బోనస్‌ వచ్చేలా పాడి సహకార సంఘాలను పునరుద్ధరించనుండటం మరో మంచి పరిణామం. మన జిల్లాలోని తీరప్రాంతం వెంబడి మత్స్యకారులు అధికంగా ఉన్నారు. వేట నిషేధ సమయంలో వీరిని ఆదుకునేందుకు ఏ ప్రభుత్వాలు చొరవ చూపిన దాఖాలాల్లేవు. కానీ ఈ బడ్జెట్‌లో మత్స్యకారులకు వరాలు కురిపించారు.

బడ్జెట్‌ద్వారా లబ్ధి పొందుతున్నవారి సంఖ్య
అంగన్‌వాడీ వర్కర్లు : 6,443
ఆశా వర్కర్లు : 2,594
పారిశుద్ధ్యకార్మికులు : 750
పింఛన్‌దారులు : 3,06,124
ప్రభుత్వ ఉద్యోగులు : 22,000
విద్యార్థులు(అమ్మ ఒడి) : 3,34,574
రైతులు(రైతు భరోసా) : 4,50,000
వైఎస్సార్‌ గృహవసతి : 3,23,000
రేషన్‌కార్డుదారులు : 7,13,000
మత్స్యకారులు : 22,000 

వేట నిషేధ సమయంలో ఇన్నాళ్లూ ఇస్తున్న సహాయాన్ని రూ.4వేల నుంచి రూ.10వేలకు పెంచారు. వేటకు వెళ్లి దురదృష్ట వశాత్తూ మత్స్యకారుడు ప్రాణాలు కోల్పోతే అతనిపై ఆధారపడ్డ కుటుంబానికి రూ.10లక్షలను అందిస్తామన్నారు. నవరత్నాల అమలు, సంక్షేమ హాస్టళ్ల అభివృద్ధికి కూడా నిధులు వచ్చాయి. వివిధ కార్పొరేషన్ల ద్వారా అర్హులకు రుణాలిచ్చేందుకు నిధులు కేటాయించారు.

ఇక జిల్లాలో ఆశా వర్కర్లు, ఆటో డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులు, మధ్యాహ్న భోజన నిర్వాహకులు, అంగన్‌వాడీ వర్కర్లు, గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తలు, సెర్ప్, గ్రామ సహాయకుడు, మెప్మా రిసోర్స్‌ పర్సన్స్, హోంగార్డులు, పాస్టర్లు, ఇమామ్‌లు, మౌజామ్‌లు ఇలా అనేక వర్గాల జీతాలను పెంచుతూ బడ్జెట్లో నిధులు కేటాయించడంతో ఆయా వర్గాల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది.

ప్రజలందరూ మెచ్చే బడ్జెట్‌ 
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అన్ని వర్గాల ప్రజలు మెచ్చేలా ఉంది. ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతోంది. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసేలా కేటాయింపులు చేశారు. మెరుగైన విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిచ్చారు. గత ప్రభుత్వం ఖజానాను పూర్తిగా ఖాళీ చేసినా ధైర్యంగా భారీ బడ్జెట్‌ కేటాయింపులు చేశారు. విజయనగరానికి మెడికల్‌కళాశాల మంజూరు చేయడం హర్షణీయం.
– కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్యే 

దేశంలోనే ఆదర్శనీయ బడ్జెట్‌
రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఆదర్శవంతమైన జనరంజక బడ్జెట్‌ ఇది. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ఉంది. దేశంలోనే ఎక్కడా లేని పథకాలు, కేటాయింపులు జరపడంపై ఢిల్లీలో ఇతర రాష్ట్ర ఎంపీలు సైతం చర్చించుకుంటున్నారు. రూ.2.67 వేల లక్షలు కోట్లు ఆర్థిక లోటున్నప్పటికీ సంక్షేమ పథకాలకు సముచిత స్థానం కల్పించారు. మహిళలు, విద్యార్థులు, రైతులు, యువత, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాలకు అనుకూలమైన బడ్జెట్‌. 
– బెల్లాన చంద్రశేఖర్, విజయనగరం ఎంపీ  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement