పేదల జీవితాల్లో మార్పు కోసమే ఇంగ్లిష్‌ మీడియం | AP CM YS Jaganmohan Reddy Coments an English Medium in Assembly | Sakshi
Sakshi News home page

పేదల జీవితాల్లో మార్పు కోసమే ఇంగ్లిష్‌ మీడియం

Published Fri, Dec 13 2019 4:13 AM | Last Updated on Fri, Dec 13 2019 8:04 AM

AP CM YS Jaganmohan Reddy Coments an English Medium in Assembly - Sakshi

శాసనసభలో గురువారం మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సంతోషం.. ఇప్పటికైనా చంద్రబాబు యూటర్న్‌ తీసుకుని ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. నారా లోకేష్‌ను ఎక్కడ చదివించారు? మనవడిని ఏ మీడియమ్‌లో చదివిస్తున్నారు? అచ్చెన్నాయుడి  కొడుకును ఏ మీడియంలో చదివించారు? ఈనాడు, ఆంధ్రజ్యోతి యాజమాన్యాలను అడుగుతున్నా.. వాళ్ల పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు చదువుతున్నది ఇంగ్లిష్‌ మీడియంలో కాదా? ఈనాడు యాజమాన్యం నడిపే స్కూల్‌ కూడా ఇంగ్లిష్‌ మీడియమే.– సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పేదల జీవితాలు మార్చడం కోసమే ఇంగ్లిష్‌ మీడియం విద్య ప్రవేశపెట్టామని, దేశం మొత్తం గర్వపడేలా ఈ విధానాన్ని అమలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. నిరుపేద కుటుంబాల పిల్లలు కూడా బాగా చదువుకుని అన్ని రంగాలలో ఎదగాలన్నదే తమ ఆకాంక్ష అని చెప్పారు. ‘రైట్‌ టు ఇంగ్లిష్‌ మీడియం’ అన్నది ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంపై అసెంబ్లీలో గురువారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఇంగ్లిష్‌ మీడియంపై ప్రతిపక్ష నేత చంద్రబాబుతో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు యుద్ధం ప్రకటించిన తీరును, ఆ తర్వాత ప్రజల నుంచి తిరుగుబాటు రావడంతో యూటర్న్‌ తీసుకున్న తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే..

ఇంగ్లిష్‌ మీడియం జీవోపై చంద్రబాబు విమర్శలు
దేశం మొత్తం గర్వపడేలా మన రాష్ట్రం ఒక్కటే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంను తీసుకువచ్చే కార్యక్రమం చేసింది. ఇందుకు సంబంధించి గత నెల 5వ తేదీన జీఓ జారీ చేశాం. ఈ జీఓపై విపక్ష నేత చంద్రబాబు పలు విమర్శలు చేశారు. ‘సాక్షి’లో రాస్తే అది మీ మైండ్‌సెట్‌ కాదా? అంటున్నారు. ఈనాడు పేపర్‌ చంద్రబాబు నాయుడును ఈ రోజు వరకు కూడా మోస్తూనే ఉంది. ఆంధ్రజ్యోతి, టీవీ ఛానళ్ల గురించి నేను చెప్పాల్సిన పని లేదు. కానీ, మాకు ఏ పేపరూ లేదు.. ఏ టీవీ లేదు.. అంటూ వీళ్లు ఏ రకంగా మోసం చేస్తున్నారన్న సంగతి రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. పిల్లి పాలు తాగుతూ తననెవరూ చూడలేదనుకుంటుందట. అలా వీరు కూడా అంతే.

ఇంగ్లిష్‌ మీడియంపై గత నెల 6వ తేదీ నుంచి ‘ఈనాడు’ యుద్ధం ఇలా..
► 6వ తేదీన ‘తెలుగు చదువులకు చెల్లు చీటి’ అని రాశారు.
7వ తేదీన ఈనాడు, చంద్రబాబు కలిసి యుద్ధం ప్రకటించారు. అది ఒక సామాజికవర్గ దాడి అని కూడా చెప్పవచ్చు. మామూలుగా జరగలేదు ఆ దాడి. అదే రోజు ‘ఇక ఆంగ్లప్రదేశ్‌’ అని రాశారు.
8వ తేదీన ‘తెలుగు జాతి మనుగడకే ముప్పు’ అంటూ.. ‘అశాస్త్రీయం.. అధికార భాష సంఘం ఏం చేస్తోంది? సర్కారు బడుల్లో ఆంగ్ల భాష నిర్ణయంపై గళమెత్తిన భాషావేత్తలు’ అని అక్కకు వెళ్లగక్కారు.
9వ తేదీన ‘అంపశయ్యపై అమ్మ భాష’ అని ఎడిటోరియల్‌. భాషను కాపాడుకోకుంటే తెలుగు జాతి ఉనికిని కోల్పోతుందని చంద్రబాబునాయుడు స్టేట్‌మెంట్‌.. ‘తెలుగు మాధ్యమం తప్పనిసరి’ ఇంటూ ఆయన కొడుకు స్టేట్‌మెంట్‌.
11వ తేదీన ‘మాతృభాషను విస్మరిస్తే అనర్థాలు తప్పవు’. ఇందుకు వెంకయ్యనాయుడు వత్తాసు.. ప్రాంతీయ భాషలోనే విద్యాబోధన జరగాలి.. ఈ విషయంలో ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని. ఇదే రోజు ‘తెలంగాణ సీఎంను చూసి నేర్చుకోండి. తెలుగు విలువ తెలిస్తే వైకాపా నేతలు అలా చేయరు’ అంటూ చంద్రబాబు పార్టీకి సంబంధించిన ఒక యాక్టర్‌ సపోర్ట్‌.
13వ తేదీన ‘మాధ్యమంపై ఉద్యమం.. 35 సంస్థలతో మాతృభాష మాధ్యమమే వేదిక. దీక్ష ర్యాలీలు. భాషావేత్తల నిర్ణయం’
15వ తేదీన ‘తెలుగుకు దూరం సరి కాదు. మాతృభాషపై పట్టు ఉంటేనే ఏదైనా నేర్చుకోవడం సులువు’ – ఈనాడు హాయి బుజ్జి వెలుగు పోటీల్లో వక్తలు.. అంటూ ఇచ్చారు.
16వ తేదీన ‘తుగ్లక్‌ చర్యలను తూర్పార పట్టండి.. ఆంగ్ల మాధ్యమం, మీడియాపై ఆంక్షలను పార్లమెంటులో ప్రస్తావించండి’ అని చంద్రబాబు స్టేట్‌మెంట్‌.
17వ తేదీన ‘అన్ని చోట్లా అమ్మ భాషే. ప్రపంచ వ్యాప్తంగా అదే బాట. కొన్ని దేశాల్లోనే ఆంగ్ల మాధ్యమం’ అంటూ బ్యానర్‌ స్టోరీ.
19వ తేదీన ‘తెలుగులో ఇక్కడ కాకపోతే విదేశాల్లో బోధిస్తారా?’ అంటూ బ్యానర్‌. మరోవైపు చంద్రబాబు స్టేట్‌మెంట్లు.
అదే నెల 16వ తేదీన వాళ్లకు సంబంధించిన మరొక పత్రిక ‘ఆంధ్రజ్యోతి’లో (దాన్ని చంద్రజ్యోతి అని కూడా పిలుస్తారు) ‘తెలుగుతోనే ముందడుగు’ అని చంద్రబాబు స్టేట్‌మెంట్‌.. మళ్లీ 21న అదే చంద్రజ్యోతిలో ‘ఇది రద్దుల శకం. తెలుగులో చదివితే ఉద్యోగాలు రావా?’ అంటూ రాశారు.

చంద్రబాబుకు యూటర్న్‌ అలవాటే..
వీరంతా ఎంతగా యుద్ధం చేసినా, ప్రజల్లో ఎప్పుడైతే తిరుగుబాటు మొదలైందో.. అప్పుడే, నవంబరు 22న చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారు. అంత వరకు ఎన్నెన్నో విమర్శలు. తుగ్లక్‌ పాలన, తుగ్లక్‌ చర్యలు అన్న చంద్రబాబునాయుడు 22 తర్వాత సన్నాయి నొక్కులు నొక్కడం మొదలు పెట్టారు. టీడీపీ ఆంగ్లానికి వ్యతిరేకం కాదనడం మొదలు పెట్టారు. కనీసం ఆ తర్వాత అయినా చిత్తశుద్ధి చూపారా అంటే.. అదీ లేదు. ఆ వెంటనే 26న మరో మాట. ‘మాతృభాషపై మాట్లాడినందుకు ప్రధానిని తప్పు పడతారేమో?’ అని స్టేట్‌మెంట్‌. ప్రజలు తిరగబడినప్పుడు యూటర్న్‌ తీసుకోవడం వీళ్లకు అలవాటే. గతంలో ప్రత్యేక హోదాపైనా అదే విధంగా వ్యవహరించారు. ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా? హోదా వల్ల రాష్టŠల్రాలు ఏం బాగుపడ్డాయి? అని ప్రశ్నించలేదా?

ఇదీ బాబు నిర్వాకం
ఇవాళ నిజంగా పేదలు చదివేది ప్రభుత్వ పాఠశాలల్లోనే. అగ్రవర్ణాలలో పేదలు కూడా ఆ స్కూళ్లలోనే చదువుతారు. కానీ చంద్రబాబు డబుల్‌ స్టాండర్డ్‌కు నిదర్శనం ఇదే.. 44 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉంటే, వాటిలో 66 శాతం స్కూళ్లలో తెలుగు మీడియం ఉంది. కేవలం 34 శాతం స్కూళ్లు మాత్రమే ఇంగ్లిష్‌ మీడియంలో ఉన్నాయి. అందుకు సిగ్గుతో తల దించుకోవాలి. ఇది ఎంత దారుణమైన పరిస్థితి. అదే సమయంలో ప్రైవేటు స్కూళ్లలో 95 శాతం ఇంగ్లిష్‌ మీడియంలోనే బోధిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చూస్తే, 1 నుంచి 6వ తరగతి వరకు 28 శాతమే ఇంగ్లిష్‌ మీడియంలో ఉన్నాయి.

పద్ధతి ప్రకారం ప్రభుత్వ స్కూళ్ల నిర్వీర్యం
పేదలు చదువుకునేది ప్రభుత్వ పాఠశాలలు. 2014 నుంచి 2019 వరకు ఒక పద్ధతి ప్రకారం వాటిని నిర్వీర్యం చేశారు. హేతుబద్ధీకరణ పేరుతో దాదాపు 6 వేల స్కూళ్లు మూసివేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సదుపాయాలు కూడా ఉండవు. బాత్‌రూమ్‌లు, తాగు నీరుండదు. అక్టోబర్, నవంబర్‌ వరకు కూడా పుస్తకాలు అందవు. మధ్యాహ్న భోజనం బిల్లులు 6 నెలల నుంచి 8 నెలల వరకు పెండింగ్‌. ఆ పథకంలో పని చేసే ఆయాల జీతాలు కూడా 8 నెలలు పెండింగ్‌లో పెట్టారు. వారికి ఇచ్చేది కేవలం రూ.1000 మాత్రమే. పిల్లలంతా నారాయణ, చైతన్య స్కూళ్లకు వెళ్లడమే అప్పటి ప్రభుత్వ ఉద్దేశం. అందుకే అలా వ్యవహరించారు.

విప్లవాత్మక మార్పునకు శ్రీకారం
గత 5 ఏళ్లలో చంద్రబాబు ప్రభుత్వ పాఠశాలల బాగు కోసం చేసిన వ్యయం ఏటా కనీసం రూ.50 కోట్లు లేదు. ప్రభుత్వ పాఠశాలల గురించి చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదు. రైట్‌ టు ఇంగ్లిష్‌ మీడియమ్‌ అన్నది మా లక్ష్యం. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా పనులు చేపట్టాం. ‘నాడు–నేడు’  కార్యక్రమం కింద రాష్ట్రంలోని 45 వేల స్కూళ్లను బాగు చేస్తున్నాం. తొలి దశలో 15,715 స్కూళ్లు బాగు చేస్తున్నాం. అందు కోసం రూ.3,600 కోట్లు కేటాయించాం. మంచి నీరు, ప్రహరీ, లైట్లు, ఫ్యాన్ల వంటి మొత్తం 9 రకాల సదుపాయాలు కల్పిస్తున్నాం. మండలానికి ఒక హైస్కూల్‌ తీసుకుని దాన్ని జూనియర్‌ కళాశాలగా మారుస్తాం. ‘నాడు–నేడు’తో పాటు, ఇంగ్లిష్‌ మీడియం, జనవరి 9న ‘అమ్మ ఒడి’తో ఒక విప్లవాత్మక మార్పు రాబోతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం  దేశ సగటు నిరక్షరాస్యత 27 శాతం ఉంటే, రాష్ట్రంలో అది 33 శాతంగా ఉంది’ అని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. 

తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్‌ చేశాం
ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు ఒక సబ్జెక్ట్‌గా తప్పనిసరిగా ఉంటుంది. మన పిల్లలు ఇంగ్లిష్‌లో పట్టు సాధించకపోతే, ప్రపంచ పోటీ ఎదుర్కోలేరు. నిరుపేద పిల్లల జీవితాలు మార్చడం కోసమే గట్టిగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఈ వేదికగా చెబుతున్నాను. ఇందులో మాకు సవాళ్లు ఉంటాయని కూడా తెలుసు. అందుకే 1 నుంచి 6వ తరగతి వరకు మాత్రమే వచ్చే ఏడాది నుంచి ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెడుతున్నాం. ఆ తర్వాత ఒక్కో ఏడాది ఒక్కో క్లాస్‌కు పెంచుకుంటూ పోతాం. ఆ విధంగా 10వ తరగతి బోర్డు పరీక్ష ఇంగ్లిష్‌ మీడియంలో రాసేసరికి ఆ విద్యార్థికి 4 ఏళ్ల సమయం ఉంటుంది. తొలి రెండేళ్లు కొంచెం కష్టం అనిపించినా.. మూడో ఏడాది వచ్చే సరికి అలవాటు పడతాడు. నాలుగో ఏడాది బోర్డు పరీక్ష ఇంగ్లిష్‌ మీడియంలో రాసే స్థాయికి ఎదుగుతాడు.

అత్యుత్తమ నిపుణులతో శిక్షణ
ఉపాధ్యాయులకు శిక్షణ కూడా ఒక సవాలే. అందుకే ఒక కరికులమ్‌ ఏర్పాటు చేశాం. కరికులమ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తున్నాం. ఇందు కోసం ప్రపంచంలోనే అత్యుత్తమ నిపుణులను ఎంపిక చేసుకుంటున్నాం. ఉపాధ్యాయుల శిక్షణ కోసం 30 మంది కీలక రీసోర్స్‌ పర్సన్స్‌ను గుర్తించాం. వారికి అత్యుత్తమ శిక్షణ కూడా ఇప్పించాం. మరో వైపు 6.5 లక్షల మంది విద్యార్థులకు బ్రిడ్జి కోర్సులు నిర్వహించనున్నాం. 1, 2వ తరగతులకు సంబంధించి వచ్చే జూన్‌ నుంచి ఆగస్టు వరకు 10 వారాలు, 3, 4 తరగతులకు జూన్, జూలైలో 8 వారాలు, 5, 6వ తరగతి విద్యార్థులకు ఇంటెన్సివ్‌ బ్రిడ్డి కోర్సును ఏప్రిల్, మే లో రెండు నెలల పాటు ఏర్పాటు చేశాం. ఇన్ని గొప్ప కార్యక్రమాలు నిర్వహించేందుకు మంచి అధికారులు కూడా ఉన్నారు. విద్యా శాఖ మంత్రి దళిత సామాజిక వర్గానికి చెందిన వారే. గతంలో ఇతను ఒక ఐఆర్‌ఎస్‌ అధికారి. సివిల్‌ సర్వెంట్‌గా పని చేశారు కాబట్టి పేదలకు మంచి జరుగుతుందని నమ్ముతున్నా.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement