సాక్షి, అమరావతి: ‘‘హలో.. మీరు నాగరాజు గారేనా.. మేం బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నాం.. మీ ఆధార్ నెంబరు ఇదేనా.. అకౌంట్ నెంబర్ ఇదేనా.. ఆర్‌బీఐ ఆదేశాల మేరకు కేవైసీ పరిశీలనలో భాగంగా ఆథార్‌తో సహా అన్ని వివరాలను చూస్తున్నాం.. ఇప్పుడు మీ ఫోన్ నెంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. అది మాకు చెబితే ఈ–కేవైసీ వెరిఫికేషన్ అయిపోతుం దంటూ అవతల వ్యక్తి నుంచి కాల్ వస్తుంది. మనకు సంబంధించిన అన్ని వివరాలు ఖచ్చితంగా చెప్పారు కదా.. బ్యాంకు అధికారులే అయి ఉంటారనుకుని ఓటీపీ చెప్పడం.. ఆ వెంటనే మన బ్యాంకు ఖాతాలోంచి డబ్బులు మాయమైపోవడం క్షణాల్లో జరిగిపోతుంది. ఆ తర్వాత సదరు నెంబర్‌కు ఫోన్‌చేసినా కాల్ కలవదు. డబ్బులు పోయినవాళ్లు లబోదిబోమంటూ బ్యాంకులు, పోలీసుల చుట్టూ తిరగడం మామూలైపోయింది’’. .. ఈ మధ్య ఇలాంటి సంఘటనలు మనం తరచూ చూస్తూనే వింటూనే ఉన్నాం.
రెండు మూడేళ్లుగా రాష్ట్రంలో పెరిగిపోతున్న ఈ తరహా సైబర్ నేరాలకు.. ఫొటోల మార్ఫింగ్ ద్వారా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు ఇటీవల వెలుగుచూసిన డేటా స్కాంకు పెద్ద లింకే ఉన్నట్లు తెలుస్తోంది. పౌరుల వ్యక్తిగత సమాచారం మొత్తం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోవడమే ఇందుకు కారణమని నిపుణులు తేల్చిచెబుతున్నారు. అదెలాగంటే.. రెండు తెలుగు రాష్ట్రాలను గత కొద్దిరోజు లుగా ఓ కుదుపు కుదుపుతున్న డేటా స్కాం బాగోతం ఇప్పుడు పలు చీకటి కోణాలనూ ఆవిష్కరిస్తోంది. ఈ వ్యవహారం ఓట్ల మార్పులు, చేర్పులకు మాత్రమే పరిమితం కాకుండా అనేకానేక సైబర్ నేరాలకు కేంద్రంగా నిలుస్తోంది. పౌరుల వ్యక్తిగత సమాచారం ఒక్క ఐటీ గ్రిడ్స్, బ్లూఫ్రాగ్ సంస్థల వద్దే పరిమితం కాకుండా వీరి నుంచి సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయినట్లు రాష్ట్రంలో గత రెండేళ్లుగా చోటుచేసుకుంటున్న నేరాల తీరుబట్టి స్పష్టమవుతోంది. సర్వే పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు కాల్‌చేయడం, ట్రేడింగ్ సలహాలంటూ బయట రాష్ట్రాలతోపాటు విదేశీ కాల్స్, కుప్పలుతెప్పలుగా స్పామ్ మెయిల్స్ ఇటీవల దాదాపు అందరికీ రావడం బాగా పెరిగిపోయాయి.
ప్రజలకు సంబంధించిన.. ప్రభుత్వం వద్ద గోప్యంగా ఉండాల్సిన అంత్యంత కీలకమైన వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లడంవల్లే ఈ కాల్స్, స్పామ్ మెయిల్స్ ద్వారా చేసే మోసాలు ఏటా భారీగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం దగ్గర భద్రంగా ఉండాల్సిన ఆధార్, ఫోన్ నెంబర్లు, ఈ మెయిల్ చిరునామా, బ్యాంకు అకౌంట్ నెంబర్లు, బయోమెట్రిక్ వంటి సమస్త వ్యక్తిగత సమాచారం రాష్ట్ర ప్రభుత్వ దన్నుతో ఐటీ గ్రిడ్స్, బ్లూఫ్రాగ్ ద్వారా ఆర్థిక మాఫియా చేతుల్లోకి వెళ్లిపోయిందన్నది సైబర్ నేరాల పెరుగుదల ద్వారా స్పష్టమవుతోంది. తెలుగుదేశం ప్రభుత్వం తన పార్టీ అవసరాలను పర్యవేక్షించే ఐటీ గ్రిడ్స్ అనే సంస్థ వద్ద రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారం ఉందన్న విషయం బహిర్గతం కావడం.. సరిగ్గా రెండేళ్ల నుంచే రాష్ట్రంలో రకరకాలుగా ఆర్థిక నేరాలు పెరగడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. రాష్ట్రంలో పోలీసు శాఖ విడుదల చేసిన సైబర్ నేరాల సంఖ్య సైతం ఇదే స్పష్టం చేస్తోంది.
నేరాలు ఇలా పెరిగాయి..
– తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ ఐదేళ్లలో సైబర్ నేరాల్లో 573 శాతం పైగా వృద్ధి పెరిగింది.
– 2013లో 148గా ఉన్న సైబర్ నేరాల సంఖ్య గడచిన ఐదేళ్లలో 2018 నాటికి 1,314కి చేరిందంటే ఏ స్థాయిలో పెరిగాయో అర్థం చేసుకోవచ్చు.
– 2017లో సైబర్ నేరాల్లో 45 శాతం, 2018లో 25 శాతం చొప్పున పెరుగుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.
– నమోదవుతున్న నేరాల్లో అత్యధికంగా వన్‌టైమ్ పాస్‌వర్డ్‌కి సంబంధించిన కేసులే ఉంటున్నాయని రాష్ట్ర డీజీపీ ఆర్‌పీ ఠాకూర్ ఇటీవలే వెల్లడించడం గమనార్హం.
– అంతేకాదు.. లాటరీలు వచ్చాయని, ఇన్‌కం ట్యాక్స్ రిఫండ్స్ అంటూ ఈ మెయిల్స్ రావడం.. వివరాలు ఇవ్వగానే అకౌంట్‌లోంచి డబ్బులు మాయమవుతున్న సంఘటనలూ భారీగానే పెరుగుతున్నాయి.
– గడిచిన రెండేళ్ల నుంచి ఇలా స్పామ్ మెయిల్స్ రావడం బాగా పెరిగిందని, దీనికి వ్యక్తిగత డేటా చోరీ కావడమే కారణం కావచ్చని సైబర్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మహిళల ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ..
మహిళల ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ వారి జీవితాన్ని నరకప్రాయం చేస్తున్న సంఘటనలు కొంతకాలంగా విపరీతంగా పెరిగిపోయాయి. మీ వ్యక్తిగత వివరాలు, ఫొటోలు మా వద్ద ఉన్నాయంటూ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారనే ఫిర్యాదులు అధికమవుతున్నాయి. పరువు మర్యాదలు, పేరు ప్రతిష్టలు దెబ్బతింటాయనే భయంతో చాలామంది మహిళలు తమకు ఎదురవుతున్న ఇబ్బందులను బయటకు చెప్పుకోలేక వారిలో వారు కుమిలిపోతున్నారు. ఇలాంటి వ్యవహారాలకు డేటా చోరీ ఓ ప్రధాన కారణమై ఉండవచ్చని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఐటీ గ్రిడ్స్ వద్ద ఓటర్ల కలర్ ఫొటోల మాస్టర్ డేటా ఉండడం ఇందుకు బలం చేకూరుస్తోంది.
భూరికార్డులపైనా ఆందోళన
ఆధార్‌లాగే రాష్ట్రంలోని భూములకు భూధార్ పేరుతో ఒక నెంబర్‌ను కేటాయించడమే కాకుండా భూ రికార్డులన్నీ ఆన్‌లైన్‌లో చేర్చడం, ఇప్పుడు ఈ సమాచారం అంతా కూడా ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లిందన్న వార్తలపై రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ వంటి పథకాల పేరుతో భూముల వివరాలు, బ్యాంకు ఖాతాల నెంబర్లతో పాటు ఆదాయ వ్యయాలన్నీ సేకరించి ఆర్‌టీజీఎస్‌కు పంపించారని, అక్కడ నుంచి ఈ సమాచారం ఐటీ గ్రిడ్స్‌కు చేరడం ఈ భయాందోళనలకు ప్రధాన కారణం. ఇప్పటికే బ్యాంకు ఖాతాల వివరాలతో సైబర్ నేరగాళ్లు ఖాతాల నుంచి డబ్బులు లాగేస్తున్నారని, అలాగే ఫాం–7 పేరుతో తమకు తెలియకుండానే ఓట్లు తొలగించేస్తున్నారని.. అదే విధంగా ఇప్పుడు భూ రికార్డులను కూడా తారుమారు చేస్తే మా పరిస్థితి ఏంటని విజయవాడకు చెందిన రామలింగేశ్వరరావు అనే రైతు ఆందోళన వ్యక్తంచేశాడు. ముందు ఐటీ గ్రిడ్స్ సీఈవో అశోక్‌ను అరెస్టుచేసి ఆ తర్వాత ఈ సమాచారం ఎవరెవరి చేతుల్లోకి వెళ్లిందో అన్నదానిపై సమగ్ర విచారణ జరిపించి వ్యక్తిగత సమాచార భద్రతపై భరోసా కల్పించాలన్న డిమాండ్ రాష్ట్రంలో ఇప్పుడు ఊపందుకుంటోంది.
రాష్ట్రంలో గత ఐదేళ్లలో సైబర్ నేరాలు పెరిగిన తీరు..
––––––––––––––––––––––––––––––––––––––––––––––––
సంవత్సరం సైబర్ నేరాల సంఖ్య
––––––––––––––––––––––––––––––––––––––––––––––––
2013 148
2014 195
2015 266
2016 718
2017 1,051
2018 1,314
––––––––––––––––––––––––––––––––––––––––––––––––
Comments
Please login to add a commentAdd a comment