ఏపీ ఎంసెట్-2016, ఏపీ పీజీ సెట్ దరఖాస్తుల స్వీకరణ తేదీలు ఖరారయ్యాయి. ఎంసెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభం కానుంది.
అపరాధ రుసుము లేకుండా తుది గడువు మార్చి 21
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎంసెట్-2016, ఏపీ పీజీ సెట్ దరఖాస్తుల స్వీకరణ తేదీలు ఖరారయ్యాయి. ఎంసెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభం కానుంది. పీజీ సెట్ దరఖాస్తుల స్వీకరణ మార్చి 6 నుంచి ప్రారంభమవుతుంది. ఎంసెట్ నోటిఫికేషన్‌ను ఈ నెల 29న, పీజీ సెట్ నోటిఫికేషన్‌ను మార్చి 4న విడుదల చేయనున్నారు. ఏపీ ఎంసెట్, పీజీ సెట్ కమిటీల సమావేశం బుధవారమిక్కడి ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగింది. ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ బి.ఉదయలక్ష్మి, ఎంసెట్ కమిటీ ఛైర్మన్ ప్రొఫెసర్ వీఎస్‌ఎస్‌కుమార్, కన్వీనర్ సీహెచ్ సాయిబాబు, పీజీ సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ప్రసాదరాజు హాజరయ్యారు.
పరీక్ష రుసుముల పెంపు
ఎంసెట్, పీజీ సెట్ పరీక్ష రుసుములను పెంచారు. ఎంసెట్ ఫీజు గతంలో రూ.250 ఉండగా.. ఈసారి 350కి పెంచారు. ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. పీజీ సెట్ ఫీజు గతంలో రూ.500 ఉండగా.. ఈసారి 600కు పెంచారు. ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు రూ.500 చెల్లించాలి. కాగా, ఎంసెట్ దరఖాస్తులను ఆన్‌లైన్‌లోనే దాఖలు చేయాలని కన్వీనర్ సాయిబాబు చెప్పారు. దరఖాస్తు, ఇతర నియమ నిబంధనలను ‘‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఈఏఎంసీఈటీ.ఓఆర్‌జీ’’ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తున్నామని చెప్పారు. ఒక దరఖాస్తు ఒక్కసారే ఆన్‌లైన్‌లో ఆమోదం పొందుతుందని, ఈ విషయాన్ని గమనించి వివరాలను సరిచూసుకొని అప్‌లోడ్ చేయాలని సూచించారు.