అజయ్ కల్లాం, చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పనితీరుపై మరో మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లాం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోయిందని, రాజధాని నిర్మాణం పేరుతో భారీ ఎత్తున డబ్బులు వృధా చేస్తున్నారని కల్లాం ఆరోపించారు. ఇటీవలే మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు సైతం టీడీపీ సర్కారు విధానాలను తప్పుపట్టిన నేపథ్యంలో తాజాగా కల్లాం వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమరావతిలో అవినీతికి సంబంధించి తానో పుస్తకం రాశానన్న ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.
వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం: ‘‘అనుభవజ్ఞుల పాలన అంటే పెద్ద పెద్ద నగరాలు కట్టడంకాదు. గ్రామీణ ప్రాంతాల్లో జరిగితేనే నిజమైన అభివృద్ధి. మహానగరాల పేరుతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నది. ప్రభుత్వాలు వ్యాపారాలు చేయడం వల్ల ప్రజలకు మేలు జరగదు. పైగా అభివృద్ధినంతా ఒకే చోట కేంద్రీకరించడం సరైన భావనకాదు. విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం నగరాలకు పరిపాలనను విస్తరించాలి. కొత్త రాష్ట్రంలో ప్రజలకు మంచి జరగకపోగా పాలకుల అవినీతి చాలా పెరిగిపోయింది. దీనివల్ల వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదముంది. నిజానికి ఏపీలో కొత్త రాజధాని కట్టాలనుకునేది కేవలం పైరవీల కోసం మాత్రమే. రాజధాని పేరుతో భారీగా డబ్బును దుబారా చేస్తున్నారు’’ అని అజయ్ కల్లాం అన్నారు.
ఆసక్తికర వ్యాఖ్యలు: మీడియాతో భేటీ సందర్భంగా కల్లాం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘మేకప్‌లు వేసుకున్న కొందరు రాజకీయాలు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’ అని అన్నారు. ప్రస్తుత యువతరంలో ప్రశ్నించే తత్వం లోపిస్తున్నదని కల్లాం ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment