సాక్షి, అమరావతి: శాసన మండలి రద్దును ప్రతిపాదిస్తూ అసెంబ్లీలో చర్చ జరిగిందని, ప్రజా సంబంధమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అన్ని వర్గాల సలహాలు తీసుకుంటే మంచిదనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్ కొంత సమయం ఇచ్చారని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాము ప్రలోభాలు పెడుతున్నట్లు ఓ వర్గం మీడియా దుష్ప్రచారం చేస్తోందని, ఆ మీడియా ఆగడాలకు అంతేలేకుండా పోతోందన్నా్డరు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సెలెక్ట్ కమిటీకి బిల్లులు పంపినంత మాత్రాన టీడీపీ సాధించేది ఏమీ లేదన్నారు. తప్పు చేశానని మండలి చైర్మన్ అంగీకరించారని, నిబంధనలను తుంగలోతొక్కి ఆయన నిర్ణయం ప్రకటించారని, బిల్లులపై ఓటింగ్ కూడా నిర్వహించలేదన్నారు. ఆ బిల్లులు చట్టాలు కాకుండా ఎవరూ అడ్డుకోలేరన్నారు. శాసనసభే ఎప్పుడూ సుప్రీం అని, తన పరిధికి మించి మండలి వ్యవహరించడం కరెక్టు కాదన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రజా సంక్షేమ పథకాలు చేపడుతుంటే.. మండలిలో ఆ కార్యక్రమాలకు టీడీపీ అడ్డుపడుతోందన్నారు. మండలిని ఎవరూ తక్కువ చేయడంలేదన్నారు. మండలిలో మెజార్టీతో తామేదైనా చేయగలుగుతామని టీడీపీ ప్రజలకు భ్రమలు కల్పిస్తోందని మండిపడ్డారు. మండలిని రద్దు చేస్తారేమోనని చంద్రబాబుకు, లోకేశ్‌కు భయం పట్టుకుందన్నారు. చైర్మన్‌ను చంద్రబాబు తన చెప్పుచేతల్లో పెట్టుకున్నారని, గ్యాలరీలో కూర్చుని చైర్మన్‌ను నియంత్రించడం దుర్మార్గమన్నారు.
అంతరించిపోతున్న నేత బాబు ..
టీడీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల్లో 17 మంది వైఎస్సార్‌సీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సజ్జల చెప్పారు. ఆ పార్టీ ఎమ్మెల్సీల పరిస్థితి కూడా అలాగే ఉందని, అయితే వాళ్లందరిని తీసుకుని తామేం చేయాలని ప్రశ్నించారు. రూ. 5 కోట్లో, రూ. 10 కోట్లో ఇచ్చి ఎమ్మెల్సీలను కొనాల్సిన అవసరమేముందని అన్నారు. పొరపాటున కూడా డబ్బులతో సీఎం వైఎస్ జగన్ రాజకీయాలు చేయరని స్పష్టం చేశారు. సీఎం జగన్ నవతరం నాయకుడైతే, చంద్రబాబు అంతరించిపోతున్న నేత అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చీకటి అయితే.. సీఎం వైఎస్ జగన్ వెలుగు అన్నారు. అమిత్‌షాతో మాట్లాడి మండలి రద్దును అడ్డుకుంటామని చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్సీలకు చెపుతున్నారని తెలిసిందన్నారు. ఎమ్మెల్సీలను భ్రమపెట్టేందుకు అమిత్ షాతో మాట్లాడినట్టు వేరే ఎవరితోనో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసిందన్నారు. 18 మంది ఎమ్మెల్సీలను బీజేపీలోకి పంపుతాను.. రెండేళ్లు మండలి రద్దు కాకుండా ఆపాలని చంద్రబాబు కోరారని, ఒక ఏడాది ఆపుతానని ఫోన్‌లోని అవతలి వ్యక్తి చెప్పినట్లు ఎమ్మెల్సీలను మభ్యపెట్టారని చెప్పారు. అమిత్ షా ఎందుకు లైన్‌లోకి వచ్చి మీతో మాట్లాడతారని ఎమ్మెల్సీలు ప్రశ్నిస్తే బాబు వద్ద సమాధానం లేదన్నారు.
అమరావతిలో కృత్రిమ ఉద్యమం
ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికి చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని సజ్జల విమర్శించారు. శివరామకృష్ణన్ కమిటీని చంద్రబాబు పట్టించుకోక పోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. బినామీ భూమల వ్యవహారం బయటపడుతుందనే, అమరావతి ప్రాంతంలో కృత్రిమ ఉద్యమం సృష్టించారని తెలిపారు. ఎన్టీఆర్ నిర్ణయాలను మండలిలో వ్యతిరేకించడం కరెక్టు కాదని అప్పట్లో ఈనాడు రాసిందని, ఇప్పుడేమో దానికి భిన్నంగా రాస్తోందని అన్నారు. లోకేశ్‌ను ఓడించి సీఎం జగన్ నాయకత్వాన్ని ఆహ్వానించిన ప్రాంతాన్ని, ఆ ప్రజలను తాము ఎట్లా విస్మరిస్తామని, భవిష్యత్తులో అమరావతి ప్రాంతంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment