♦వెంకయ్యను సన్మానించడం గౌరవంగా భావిస్తున్నా..
సాక్షి, అమరావతి : ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం ఘనంగా పౌర సన్మానం నిర్వహించింది. బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి ఉప రాష్ట్రపతి హోదాలో సొంత రాష్ట్రనికి విచ్చేసిన ఆయనకు వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సన్మానం చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... వెంకయ్యను సన్మానించడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పని చేసిన ఘనత కూడా ఆయనదేనని అన్నారు. కేంద్రం నుంచి ఏపీకి ఇళ్ల కేటాయింపులో ఆయన కృషి అభినందనీయమన్నారు. నమ్మిన సిద్ధాంతాన్ని వెంకయ్య నాయుడు ఏనాడూ విడిచిపెట‍్టలేదన్నారు. ఉత్తరాదివారి కంటే ధీటుగా హిందీలో మాట్లాడగలరని ప్రశంసించారు.
గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ క్రమశిక్షణకు మారుపేరు వెంకయ్య నాయుడు అని, ఆయనది సుదీర్ఘ రాజకీయ ప్రస్థానమన్నారు. అంతకు ముందు వెంకయ్య పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అలాగే ఈ రోజు ఉదయం గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఘనస్వాగతం పలికారు.