పరిపాలనా భాషగా తెలుగు
ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆకాంక్ష
- తెలుగు రాష్ట్రాలను మర్చిపోను.. సాయం చేసేందుకు ప్రయత్నిస్తా
- తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇచ్చి పుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలి
- రాజ్యసభకు పూర్వ వైభవం తీసుకొస్తా..
- అమరావతిలో వెంకయ్యకు ఏపీ ప్రభుత్వం పౌరసన్మానం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తెలుగు భాష పరిపాలనా భాషగా మారాలని ఉప రాష్ట్రపతి ముప్పవరకు వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. తెలుగును పరిపాలనా భాషగా ఉపయోగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. అందరూ తెలుగులోనే మాట్లాడాలని, తెలుగులోనే పాలన సాగాలని పిలుపునిచ్చారు. ఉప రాష్ట్రపతి హోదాలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన వెంకయ్యనాయుడికి వెలగపూడి తాత్కాలిక సచివాలయం ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం శనివారం పౌరసన్మానం చేసింది. ఈ సందర్భంగా వెంకయ్య ప్రసంగిస్తూ... ‘‘రాజకీయాల్లో అయామ్ రిటైర్డ్, బట్ నాట్ టైర్డ్ (రాజకీయాల నుంచి విరమణ పొందానే కానీ అలసిపోలేదు).
ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండను కాబట్టి తరచూ కలిసి మాట్లాడుకునే అవకాశం ఉండదు. అయినా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను మర్చిపోను. నా స్థాయి వరకూ సాయం చేసేందుకు ప్రయత్నిస్తా’’ అని చెప్పారు. ఉపరాష్ట్రపతి అయితే రాజకీయంగా తమకు అందుబాటులో ఉండరని పలువురు తన వద్ద ప్రస్తావించినట్టు తెలిపారు. జాతీయ స్థాయి నాయకుడిగా ఉన్నప్పటికీ ఏపీకి అన్ని విధాలుగా సహకరిస్తూ వచ్చానన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దేందుకు జాతీయ నాయకుడిగా ఉన్న తాను రాష్ట్రం కోసం మాట్లాడాలా? వద్దా? అనే దానిపై మూడు రోజులు ఆలోచించానన్నారు. చివరకు ఎవరు ఏమనుకున్నా రాష్ట్రానికి అన్ని విధాలుగా మేలు జరిగేలా రాజ్యసభలో పట్టుబట్టానని వెంకయ్య గుర్తు చేశారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే...
‘‘1972లో జైఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్నా. అప్పుడే రాష్ట్ర విభజన జరిగి ఉంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఎంతో ముందుండేది. తెలంగాణ కూడా అభివృద్ధి సాధించేది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తరచూ కలుస్తూ ఉండాలి. మనసు విప్పి మాట్లాడుకుని ఇచ్చి పుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలి. ఇదే విషయాన్ని రెండు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబులకు గతంలోనే చెప్పా. ప్రజాస్వామ్యంలో చట్టసభలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రస్తుతం వాటిపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోంది. ప్రభుత్వం చేతిలో అధికారం ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్నవారు ప్రతిపక్షాన్ని గౌరవించాలి. ప్రభుత్వంపై ప్రతిపక్షం సద్విమర్శలు చేయాలి. ఇరు పక్షాలు రాజకీయంగా ప్రత్యర్థులే తప్ప విరోధులు కారు. రాజకీయాల్లో వ్యక్తిగత ద్వేషాలకు తావులేదు.
నా కోరిక నెరవేరేలా లేదు
ఇప్పటి వరకు నేను అనుకున్నవన్నీ చేశా. 2020 జనవరి 12న రాజకీయాల నుంచి వైదొలగి సేవా కార్యక్రమాల్లోకి వెళ్లాలన్న కోరిక నేరవేరేలా లేదు. నాకు ఇప్పుడు 68 ఏళ్లు. మరో రెండేళ్లు అంటే 2019 ఎన్నికల్లో నరేంద్ర మోదీని మరోసారి ప్రధానిని చేశాక, రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావించినట్టు నా భార్యకు చెప్పా. ఇప్పుడు అనుకోకుండా ఉపరాష్ట్రపతి కావడంతో మరో ఆరేళ్లు ఈ పదవిలో కొనసాగాల్సి ఉంది. అందువల్ల రాజకీయ పార్టీలకు అతీతంగా ఉన్నప్పటికీ రిటైర్మెంట్ అనే కోరిక నేరవేరే అవకాశం లేదు. సన్మానాలు బాధ్యతలను గుర్తు చేస్తాయి. ఇక్కడ లభించిన అపూర్వ స్వాగతాన్ని ఎప్పటికీ మరచిపోలేను. ఇప్పటివరకు నేను చేపట్టిన ప్రతి పదవికీ న్యాయం చేశా. రాజ్యసభలో కొత్త ప్రమాణాలు నెలకొల్పి పెద్దల సభకు పూర్వ వైభవం తీసుకొస్తా’’ అని వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు. వెంకయ్య నాయుడుది సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం అని రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. ఎన్నో గొప్ప గుణాలు కలిగిన వ్యక్తి వెంకయ్య అని కొనియాడారు.
బాధగా ఉంది: సీఎం చంద్రబాబు
రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి వెంకయ్య నాయుడు అండగా నిలిచారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రతి సందర్భంలోనూ తమకు పెద్ద దిక్కుగా ఉన్న ఆయన ఉపరాష్ట్రపతిగా రాజకీయాలకు దూరంగా ఉండటం లోటు అని, ఇది బాధగా ఉందని చెప్పారు. వెంకయ్య ఇకపై రాజకీయాలు మాట్లాడకపోయినా ఏపీకి అవసరమైన అండదండలు అందిస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి పట్టణ గృహ నిర్మాణ పథకం కింద 26 లక్షల ఇళ్లను మంజూరు చేస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే 5.35 లక్షల ఇళ్ల మంజూరుకు వెంకయ్య చొరవ చూపారని పేర్కొన్నారు.
ఉప రాష్ట్రపతి అయ్యే ముందు కూడా రాష్ట్రానికి 2.25 లక్షల ఇళ్ల మంజూరుకు సంతకం చేశారని చెప్పారు. పౌరసన్మానం సందర్భంగా స్వచ్ఛ సత్తెనపల్లి, స్వర్గపురి పుస్తకాలను ఆవి ష్కరించారు. వెంకయ్య నాయుడుకు వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు. వెంకయ్య తొలుత సభా ప్రాంగణంలో పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. రాష్ట్రంలోని వంద మున్సిపాలిటీలకు ప్రధానమంత్రి పట్టణ గృహ నిర్మాణ పథకం కింద కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 2.25 లక్షల ఇళ్ల నిర్మాణానికి వెంకయ్య నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ మేరకు శిలాఫలకం ఆవిష్కరించారు.