
సిద్ధంగా ఉన్నాం
విజయనగరం కంటోన్మెంట్: హుదూద్ తుపానువల్ల ఎదురయ్యే విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ ఎంఎం నాయక్ చెప్పారు. శనివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్సు హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనమాట్లాడారు. తీర ప్రాంత మండలాలైన భోగాపురం, పూసపాటి రేగల్లో గుర్తించిన 22 గ్రామాల్లో తొమ్మిది గ్రామాలపై ప్రభావం తీవ్రంగా ఉండవచ్చని, ఈ గ్రామాల్లో ఉన్న మత్స్య కారులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని చెప్పారు. 14 మైనర్ ఇరి గేషన్ చెరువులు దెబ్బతినే అవకాశముందని వాటికి గండ్లు పడితే పూడ్చేందుకు సిబ్బందిని నియమించామన్నారు. మంచినీటి సరఫరాకు తగు చర్యలు తీసుకున్నామని తెలిపారు. 12 పునరావాస కేంద్రాలకు ఇప్పటికే నాలుగు వేల మందిని తరలించామని చెప్పారు. వీరిలో కొందరు మళ్లీ ఇళ్లకు వెళ్లిపోతున్నారని, రానున్న మూడు రోజులు మత్స్య కారులు పునరావాస కేంద్రాలను విడిచి వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
జిల్లాకు వచ్చిన 40 మంది జాతీయ విపత్తు నివారణ, రక్షణ సిబ్బందిని జట్టుకు పది మంది చొప్పున నాలుగు బృందాలుగా విభజించి ముప్పు ఉన్న ప్రాంతాలకు తరలించినట్టు చెప్పారు. 15 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించడానికి ఏర్పాట్లు సిద్ధం చేసినట్టు నాయక్ తెలిపారు. అవసరాన్ని బట్టి పోలీసు సహాయాన్ని తీసుకుంటామన్నారు. ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడం, పడిపోయిన చెట్లను వెంటనే అక్కడ నుంచి తరలించే చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకు ఆర్‌అండ్ బీ సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు పాడయితే వెంటనే బాగుచేసేందుకు, కొత్తవాటిని ఏర్పాటు చేసేందుకు విద్యుత్ శాఖాధికారులు సిద్ధంగా ఉన్నారన్నారు. జిల్లా యంత్రాంగమంతా 24గంటలూ అందుబాటులో ఉండే చర్యలు తీసుకుంటున్నామన్నారు. విపత్కర పరిస్థితుల్లో 1949 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోను చేసి సమాచారమందిస్తే యుద్ధప్రాతిపదిక సహాయక చర్యలు చేపడతామని తెలిపారు. తుఫాను ప్రత్యేకాధికారి పి.ఏ. శోభ, ఏజేసీ యూసీజీ నాగేశ్వరరావు పాల్గొన్నారు.