వలస కార్మికుడు రామ్‌సింగ్, రాయనపాడులో స్టేషన్‌లో శ్రామిక్ రైలు ఎక్కిన వలస జీవులు
కరోనా పిడుగుపాటుకు వలస కూలీల బతుకు ఛిద్రమైంది. చేసేందుకు పనిలేక.. పరాయి పంచన ఉండలేక.. లాక్‌డౌన్‌తో సొంతూళ్లకు వెళ్లే దారి లేక నరకం అనుభవిస్తున్నారు. కష్టమైనా.. నష్టమైనా స్వస్థలాలకు వెళ్లాలని నిర్ణయించుకుని కాళ్లను చక్రాలు మార్చి సుదీర్ఘ ప్రయాణాన్ని సాగిస్తున్నారు. వారి మాటల్లో ఆవేదన.. కన్నీటి చారికల్లో నిరాశ, నిస్పృహలు కనిపిస్తున్నాయి. అయితే వారి ఆక్రందనను కళ్లారా చూసిన ప్రభుత్వం మానవాత దృక్పథంతో స్పందించింది. సహృదయంతో ఎక్కడిక్కడ ఆశ్రయం కల్పించింది. దాతల సాయంతో కావాల్సిన ఆహారం, సౌకర్యాలు కల్పించి.. ప్రత్యేక రైళ్లు, బస్సులు ద్వారా స్వస్థలాలకు చేరవేస్తోంది. ఆదివారం 1,550 మంది వలస జీవులను ప్రత్యేక శ్రామిక్ రైలులో పంపించింది.
సాక్షి, కృష్ణా: లాక్‌డౌన్ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయి.. స్వరాష్ట్రాలకు కాలినడక వెళ్తున్న వలస కార్మీకులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. వారి ప్రయాణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంది. అందులో భాగంగా కృష్ణా జిల్లా యంత్రాంగం జాతీయ రహదారుల్లో 25 ఉపశమన కేంద్రాలు ఏర్పాటు చేసి ఆపదలో ఉన్న వలస కార్మికులను అధికారులు ఆదుకున్నారు. పలువురు మానవతామూర్తులతో కలిసి అన్నార్తుల కడుపు నింపారు. గమ్యస్థానాలకు తమవారిని చేరుకోవాలనుకునే వారిని పంపేందుకు అధికారులు కృషి చేసి ఆదివారం విజయవాడ శివారులోని రాయనపాడు రైల్వే స్టేషన్ నుంచి నార్త్‌ఈస్ట్‌కు వెళ్లే ప్రత్యేక శ్రామిక్ రైలులో 1,550 మంది వలస కార్మీకులను సొంతూళ్లకు పంపించారు. (కైకలూరు మాజీ ఎమ్మెల్యే రాజబాబు కన్నుమూత )
ఆపత్కాలంలో అండ..
వలస కార్మికులను స్వరాష్ట్రాలకు తరలించేందుకు రైళ్లు, బస్సులు సమకూరుస్తున్నా.. నిత్యం ఎంతో మంది నగరం నుంచి కాలినడకన వెళ్తూనే ఉన్నారు. వృద్ధులు, పిల్లలతో వెళ్తున్న కూలీలను చూసి చలించిన అధికారులు వారి కోసం ఉపశమన కేంద్రాలను ఏర్పాటు చేసి.. అక్కడ వారికి భోజనాలు, పండ్లు, నీళ్లు, ఓఆర్‌ఎస్ పౌడర్ ప్యాకెట్లతోపాటు వలస కార్మికులకు చెప్పులు అందజేశారు. కొన్ని చోట్ల వైఎస్సార్‌సీపీ నేతలు కార్మీకులకు భోజన ఏర్పాట్లు చేసి వారి అండదండలు అందించారు. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వలస కార్మికులను అక్కున చేర్చుకున్నారు. సహాయ శిబిరంలో వైద్య ఆరోగ్య సిబ్బంది ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. (హలో.. హ్యాపీ జర్నీ)
ఇలా వెళ్లారు..
ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి కేంద్రియ విద్యాలయంలో ఉన్న రిలీఫ్ సెంటర్‌లో ఉన్న 1,550 మంది వలస కార్మికులు నార్త్‌ఈస్ట్ ప్రాంతం మణిపాల్‌కు వెళ్లే ప్రత్యేక శ్రామిక రైలులో ఆదివారం రాత్రి 8 గంటలకు బయలుదేరి వెళ్లారు. వారికి రాష్ట్ర డీజీపీ గౌతంసవాంగ్, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, నగర సీపీ ద్వారకా తిరుమలరావు, జాయింట్ కలెక్టర్ మాధవీలతలు సాదర వీడ్కోలు పలికారు. అలాగే గుడివాడలో తాపీ పనుల కొరకు వచ్చి చిక్కుకుపోయిన 60 మంది వలస కూలీలను పట్టణ పోలీసులు, రెవెన్యూ అధికారులు రెండు బస్సులలో చత్తీస్‌గఢ్‌కు తరలించారు.
అన్నార్తుల ఆకలి తీరుస్తూ..
వలస కార్మికుల కోసం జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన షెల్టర్లలో అధికారులు భోజన ఏర్పాట్లు చేశారు. కనకదుర్గ వారధి సమీపంలో ఉన్న షెల్టర్ జోన్‌లో వైఎస్సార్ సీపీ నాయకులు కార్మికులకు భోజనాలు వడ్డించారు. అలాగే వారికి పండ్లు, వాటర్ బాటిళ్లను అధికారులు అందించారు. వారి పాదరక్షలను కూడా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అందజేశారు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు తిరువూరు సమీపంలోని రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద కాలినడకన, సైకిళ్లపె ఒడిశా, చత్తీస్‌గఢ్ వెళుతున్న వలస కార్మికులకు తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి సహకారంతో భోజనం, అరటిపండ్లు, మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు. గుంటుపల్లి కేంద్రీయ విద్యాలయంలో ఉన్న 1600 మంది వలస కార్మికులకు అవసరమైన ఆహార పదార్థాలను మండల వైఎస్సార్ సీపీ నేత పాలడుగు దుర్గా ప్రసాద్ ఏర్పాటు చేశారు.
ప్రభుత్వానికి కృతజ్ఞతలు
నేను, నా భార్య కలిసి తాపీ పనులు చేసేందుకు విజయవాడకు వచ్చాం. గొల్లపూడి, భవానీపురం ప్రాంతాల్లో పనిచేస్తుండేవాళ్లం. లాక్‌డౌన్ నేపథ్యంలో పనులు నిలిచిపోయాయి. దీంతో కొన్నాళ్ల పాటు మమ్మల్ని తీసుకొచ్చిన మేస్త్రీ ఆదుకున్నాడు. 20 రోజుల కిందట ఆయన చేతులెత్తేయడంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న షెల్టర్‌లో ఇన్నాళ్లు గడిపాం. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. ప్రభుత్వానికి కృతజ్ఞతలు. – రామ్‌సింగ్, అరుణాచల్‌ప్రదేశ్
Comments
Please login to add a commentAdd a comment