* రూ.50 వేల లోపు రుణ ఖాతాలకు జనవరి 15 కల్లా విముక్తి!
* ఈ నెల 18 నాటికి బ్యాంకు ఖాతాల్లోకి 20 శాతం నిధుల జమ
* అర్హుల జాబితా అప్‌లోడ్ చేసేందుకు గడువు కోరుతున్న బ్యాంకులు
* ‘రుణ విముక్తి’పై నేడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ‘రుణ విముక్తి’ పథకానికి తమను అర్హులుగా గుర్తించేందుకు రైతులు బ్యాంకులకు ఆధార్, రేషన్ కార్డులు ఇచ్చేందుకు గడువు గురువారంతో ముగియడంతో.. ఇక అర్హులైన వారి సంఖ్యను తేల్చేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు మొదలెట్టింది. ప్రభుత్వం ప్రాథమికంగా.. రుణ విముక్తి పథకం కింద అర్హులైన వారి సంఖ్య 49.37 లక్షలుగా అంచనా వేసి ప్రకటించింది. ఆధార్, రేషన్ కార్డు తదితరాలు బ్యాంకులకు అందించని వారి సంఖ్య 13 లక్షలకు పైగా ఉందని గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ ఆధారాలన్నీ ఈ నెల 13 కల్లా బ్యాంకులకు అందించాలని అప్పట్లో సూచించడంతో రైతులు వాటిని బ్యాంకులకు సమర్పించారు.
దీంతో తొమ్మిది లక్షల మంది ఖాతాలను అర్హులుగా గుర్తిస్తూ జాబితాలో చేర్చింది. మొత్తం 58 లక్షల మంది రైతులు రుణ విముక్తి పథకానికి అర్హులుగా ఇప్పటివరకు తేల్చినట్లు ఈ పథకాన్ని పర్యవేక్షిస్తున్న రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు కుటుంబరావు వెల్లడించారు.డేటా అప్‌లోడ్ చేసేందుకు గడువివ్వాలని బ్యాంకులు కోరుతున్నందున అర్హుల జాబితా ఈ నెల 16 నాటికి ఖరారు చేసేందుకు ప్రభుత్వ వర్గాలు కసరత్తు ప్రారంభించాయి. ఆ తర్వాత ఫిర్యాదులు వస్తే రాష్ట్ర స్థాయిలో ఏర్పాటైన కమిటీ మళ్లీ పరిశీలన జరపనుంది. ఈ నెల 18 నాటికి తొలి విడతగా 20 శాతం నిధుల్ని అర్హుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు శుక్రవారం సమీక్షించనున్నారు.
జనవరి 15 నాటికి రూ. 50 వేల లోపు రుణమున్న ఖాతాలకు మొత్తం జమ
రుణ విముక్తికి అర్హులైన రైతుల్లో రూ. 50 వేల లోపు రుణమున్న ఖాతాలకు జనవరి 15 నాటికల్లా ఆ మొత్తమంతా జమచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ ఖాతాల సంఖ్యను గుర్తించి జాబితా రూపొందించే పని బ్యాంకులకు అప్పగించింది. తొలి విడతగా 20 శాతం నిధుల్ని జమ చేసేందుకు విధానాలను రూపొందించుకున్నారు. తొలుత చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యమిస్తారు. బంగారు రుణాలకు తొలుత మినహాయింపునిచ్చినట్లు సమాచారం.
బాండ్ల జారీ నెలాఖరు నుంచే..
ఈ నెలాఖరు కల్లా రైతులకు బాండ్లు జారీ చేసే ప్రక్రియ ప్రారంభించనున్నారు. రైతు సాధికారిక సంస్థ నుంచి ఈ బాండ్ల జారీకి అధికార యంత్రాంగం సమాయత్తమైంది. ఇందుకోసం ట్యాంపర్ ప్రూఫ్ బాండ్ల తయారీ బాధ్యతను ఓ ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రైవేటు ఏజెన్సీకి ప్రస్తుతం పాస్‌పోర్టులు తయారు చేసే కాంట్రాక్టు ఉన్నట్లు సమాచారం.
‘రుణ విముక్తి’కి అర్హుల సంఖ్య 58 లక్షలు
Published Fri, Nov 14 2014 2:21 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement