సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో భూ కుంభకోణంపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. భూ సేకరణతోపాటు గత సర్కారు హయాంలో జరిగిన పలు అక్రమాలకు సంబంధించి క్షుణ్ణంగా దర్యాప్తు నిమిత్తం దీనిని ఏర్పాటు చేసినట్లు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి పాలకపక్ష నేతలు అధికార రహస్యాల ప్రతిజ్ఞను తుంగలో తొక్కి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని, అసైన్డ్ చట్టాన్ని తుత్తునియలు చేస్తూ అడ్డగోలుగా, బలవంతంగా, కారు చౌకగా పేదల నుంచి భూములు కొన్నారని.. సరిహద్దులు మార్చి అడ్డగోలుగా లబ్ధి పొందారని మంత్రివర్గ ఉప సంఘం అధ్యయనంలో ప్రాథమిక ఆధారాలు లభ్యమయ్యాయి. (మూడు రాజధానులు ముమ్మాటికీ అవసరమే)
ఆ మేరకు మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చ అనంతరం ప్రభుత్వం లోతుగా దర్యాప్తు జరిపించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ) డాక్టర్ కొల్లి రఘురామ్ రెడ్డి నేతృత్వంలో పది మందితో కూడిన ‘సిట్’ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కీలక విధానాలు, ప్రాజెక్టులు, పథకాలు, కార్పొరేషన్లు, సొసైటీలు, కంపెనీలు తదితరాలపై సమీక్షించేందుకు జీవో 1411 ద్వారా గతేడాది జూన్ 26న మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటైన విషయం తెలిసిందే. సీఆర్‌డీఏ ప్రాంతంలో భూ సేకరణతోపాటు పలు ప్రాజెక్టుల్లో విధాన, న్యాయ పరమైన లోపాలతోపాటు నకిలీ లావాదేవీలు, ఆర్థిక అవకతవకలు చోటు చేసుకున్నట్లు ఉప సంఘం గుర్తించింది. (వెనకుండి నడిపిందెవరు?)
పాత్రధారులు, సూత్రధారులెవరో తేల్చాలనే..
రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలో భారీ అక్రమాలు జరిగినట్లు మంత్రివర్గ ఉప సంఘం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందించింది. ఈ నివేదికపై గత అసెంబ్లీ సమావేశాల్లో సమగ్ర చర్చ జరిగింది. ఎవరెవరు అసైన్డ్ భూములు కొన్నారు? ఎవరెవరు ఎక్కడెక్కడ ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వారా భూములు కారుచౌకగా దక్కించుకున్నారనే వివరాలను పేర్లు, సర్వే నంబర్లతో సహా సభలో వివరించారు. ఈ నేపథ్యంలో మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని స్పీకర్ తమ్మినేని సీతారాం కోరారు. తమ నుంచి బలవంతంగా అసైన్డ్ భూములను కొన్నట్లు కొందరు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. (అమరావతి ఆందోళనలపై కేంద్రం కీలక వ్యాఖ్యలు)
ఈ మేరకు కేసులు కూడా నమోదయ్యాయి. ఇన్‌సైడర్ ట్రేడింగ్ వ్యవహారంతోపాటు రాజధాని భూకుంభకోణంలో సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, నాటి మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి బినామీల హస్తం ఉందని రిజిస్ట్రేషన్ లావాదేవీలు, భూముల కొనుగోలు సాక్షిగా తేలిపోయింది. అందువల్ల ఈ వ్యవహారంలో పాత్రధారులు, సూత్రధారులను తేల్చడంతోపాటు మొత్తం అక్రమాలను బట్టబయలు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందానికి పూర్తి స్థాయి అధికారాలు అప్పగిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. (‘ఇన్‌సైడర్’పై ఈడీ కేసు!)
విధి విధానాలు..
– గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై సీఆర్‌పీసీ నిబంధనల ప్రకారం దర్యాప్తు.
– అవసరమైతే కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో కలిసి పని చేయొచ్చు. సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవచ్చు.
– అవసరమైన పక్షంలో విచారణ నిమిత్తం ఎవరినైనా పలిపించి, ప్రశ్నించే సంపూర్ణ అధికారం. వారి వాదనను సిట్ రికార్డు చేస్తుంది.
– భూ లావాదేవీలు, ఇతర వ్యవహారాలకు సంబంధించిన ఏ రికార్డులనైనా పరిశీలించే అధికారం.
– అన్ని ప్రభుత్వ శాఖలు, అధికారులు ‘సిట్’ కోరిన సమాచారాన్ని అందజేయడంతోపాటు సంపూర్ణ సహకారం అందించాలి.
పక్కా ఇన్‌సైడర్ ట్రేడింగ్
రాజధాని ముసుగులో అమరావతి వేదికగా గత సర్కారు పాలనలో అంతులేనన్ని అక్రమాలు జరిగాయని మంత్రివర్గ ఉప సంఘం అధ్యయనంలో తేలింది. గత పాలకులు రాజధాని నూజివీడులో వస్తుందని ఒకసారి, మరో చోట వస్తుందని మరో సారి, ఇంకో చోట వస్తుందని ఇంకోసారి.. లీకులిచ్చి సామాన్యులు భూములు కొనుగోలు చేసి నష్టపోయేలా చేశారు. పాలక పెద్దలు మాత్రం ఎక్కడ రాజధాని వస్తుందో అక్కడే కారుచౌకగా భూములు కొన్నారు. ఇలా వారు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారు. ఇందుకు కొన్ని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఆధారంగా ఉన్నాయని మంత్రివర్గ ఉప సంఘం నివేదిక మేరకు ప్రభుత్వం అసెంబ్లీలోనే బట్టబయలు చేసింది. 2014 జూన్ నుంచి 2014 డిసెంబర్ మధ్య రాజధాని ప్రకటనకు ముందు.. వాస్తవ రాజధాని ప్రాంతంలో అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరెవరు భూములు కొన్నారో ఆధార సహితంగా వివరాలు వెల్లడించిన విషయం తెలిసిందే.
బినామీల పేరుతో కారుచౌకగా కొనుగోలు
రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలిసినందున గత పాలకులు.. డ్రైవర్లు, పనివాళ్లు, బంధువుల పేర్లతో కారు చౌకగా భూములు కొన్నారు. ఇలా టీడీపీ పెద్దలు అమరావతి ప్రాంతంలో 4,075 ఎకరాల భూములను తక్కువ ధరలకు కొనుగోలు చేశారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనమని మంత్రివర్గ ఉప సంఘం పేర్కొంది. సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ 14.22 ఎకరాలు తాడికొండ మండలం కంతేరులో కొనింది. టీడీపీ నేత లంకా దినకర్ (లోకేశ్ బినామి), జీవీఎస్ ఆంజనేయులు, లింగమనేని రమేష్, పయ్యావుల కేశవ్, అప్పటి మంత్రి నారాయణ, కంభంపాటి స్వాతి (కంభంపాటి రామ్మోహన్‌రావు కుటుంబీకురాలు)లాంటి వారెందరో ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వారా భూములు కొన్నారు. బంధువుల పేర్లతోనే కాకుండా బినామీల పేర్లతో కూడా భూములు కొన్నారు.
సరిహద్దులు మార్చి భారీగా లబ్ధి
చంద్రబాబు అండ్ కో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌తో సరిపెట్టుకో లేదు. లంక, పొరంబోకు, ప్రభుత్వ భూములనూ వదల్లేదు. సీఆర్‌డీఏ సరిహద్దులు సైతం మార్చారు. కోర్ రాజధానిని జూలై 2015లో 395 చదరపు కిలోమీటర్ల మేర ప్లాన్ చేశారు. అయితే వ్యవహారాలన్నీ చక్కబెట్టుకుని 2016లో దానిని 217 చదరపు కిలోమీటర్లకు తగ్గించారు. తమ భూమిని ల్యాండ్ పూలింగ్‌కు ఇవ్వకుండా కాపాడుకుని అధిక విలువ పొందడమే లక్ష్యంగా వ్యవహరించారు. రింగ్ రోడ్డును కూడా వాళ్లకు అనుకూలంగా మార్చుకున్నారు.
లేని భూములు ఇచ్చి.. కోట్లకు పడగలెత్తి..
అనంతవరంలో భూభాగోతం మరోరకంగా సాగింది. లేని ప్రభుత్వ భూమి, పొరంబోకు భూములిచ్చి ప్లాట్లు తీసుకున్నారు. ఐనవోలులో 2.98 ఎకరాలు, బోరుపాలెం, కేఆర్ పాలెంలో 6.47 ఎకరాలు లేని భూమిని ఇచ్చినట్లుగా చూపి ప్లాట్లు దక్కించుకున్నారు. లింగాయపాలెంలో మొత్తం 158 ఎకరాల ప్రభుత్వ భూమి.. నేలపాడు, పిచ్చుకాయలపాలెంలో 9 ఎకరాలు, శాఖమూరులో 3 ఎకరాలు, వెలగపూడిలో 3 ఎకరాలు తీసుకున్నారు. చట్ట విరుద్ధంగా అసైన్డ్ భూములను కైవసం చేసుకున్నారు. శివాయ్ జమీందార్ పేరుతో జీఓలు ఇచ్చి దాదాపు 289 ఎకరాలను బదలాయించుకున్నారు. చెరువుల భూముల విషయంలోనూ ఇలాగే చేశారు. కాగా, ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు తక్కువ ధరకు కట్టబెడుతూ, ప్రభుత్వ సంస్థలకు మాత్రం అధిక ధరలకు ఇచ్చిన వైనం కూడా వెలుగు చూసింది.
సీఐడీ విచారణలోనూ అక్రమాలు బట్టబయలు
రాజధాని ప్రాంతంలో చంద్రబాబు అండ్ కో సాగించిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ దర్యాప్తులో తీగలాగితే డొంక కదిలింది. అమరావతిని రాజధానిగా నిర్ణయించడంలో ప్రధాన పాత్ర పోషించిన అప్పటి మంత్రి పి.నారాయణ తన సమీప బంధువులు, విద్యా సంస్థల్లో పనిచేసే సిబ్బంది పేర్లతో ఇన్‌సైడరన్ ట్రేడింగ్ ద్వారా భూములు కొన్నారు. వందలాది మంది తెల్లకార్డుదారులు భారీగా భూములు కొనుగోలు చేసిన విషయం కూడా బట్టబయలైంది.
సిట్ బృందమిదే..
డాక్టర్ కొల్లి రఘురామ్ రెడ్డి (డీఐజీ, ఇంటెలిజెన్స్–బృంద నాయకుడు),అత్తాడ బాబూజీ (విశాఖపట్నం ఎస్పీ),సీహెచ్ వెంకట అప్పలనాయుడు (ఎస్పీ–2 ఇంటెలిజెన్స్), సీహెచ్ శ్రీనివాస రెడ్డి, (అడిషనల్ ఎస్పీ, కడప), జయరామరాజు (డీఎస్పీ, ఇంటెలిజెన్స్), విజయ భాస్కర్ (డీఎస్పీ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్), ఎం.గిరిధర్ (డీఎస్పీ, ఇంటెలిజెన్స్), కెన్నెడి (ఇన్‌స్పెక్టర్, ఏలూరు రేంజి), ఐ.శ్రీనివాసన్ (ఇన్‌స్పెక్టర్, నెల్లూరు జిల్లా), ఎస్వీ రాజశేఖర్‌రెడ్డి (ఇన్‌స్పెక్టర్, గుంటూరు జిల్లా).
Comments
Please login to add a commentAdd a comment