అమరావతిని చుట్టేశారు | Chandrababu and team insider trading came out by CID investigation | Sakshi
Sakshi News home page

అమరావతిని చుట్టేశారు

Published Mon, Jan 20 2020 3:45 AM | Last Updated on Mon, Jan 20 2020 1:07 PM

Chandrababu and team insider trading came out by CID investigation - Sakshi

అదిగదిగో రాజధాని అంటూ ఓ వైపు చూపించి, మరో వైపు ఉన్న భూములను కారు చౌకగా కొట్టేసిన గత పాలకుల బండారం బట్టబయలవుతోంది. అమాయకపు రైతులను నమ్మించి, బెదిరించి బంగారం లాంటి భూములను కాజేసిన వైనం విస్తుగొలుపుతోంది. అధికారం అండ చూసుకుని బంధువులు, అనుచరుల పేరుతో విచ్చలవిడిగా సాగించిన అనైతిక, అక్రమ లావాదేవీల నిగ్గు తేలుతోంది. రాజధాని పేరుతో గత సర్కారు పెద్దలు సాగించిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ను చూస్తున్న దర్యాప్తు అధికారులు.. ‘అబ్బబ్బబ్బబ్బా.. నెవ్వర్‌ బిఫోర్‌.. ఎవ్వర్‌ ఆప్టర్‌’ అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. 

సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో గత ఐదేళ్లలో చంద్రబాబు బృందం సాగించిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై చేపట్టిన సీఐడీ దర్యాప్తులో తీగలాగితే డొంక కదులుతోంది. పచ్చ గద్దల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్ర రాజధాని ఎంపిక కోసం కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్‌ కమిటీ ఇచ్చిన నివేదికను బుట్ట దాఖలు చేసి.. అప్పటి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ నేతృత్వంలో వ్యాపారులు, తన బినామీలతో ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చంద్రబాబు రాజధానిపై నిర్ణయం తీసుకున్నారు. ఇందులో కీలక భూమిక పోషించిన మాజీ మంత్రి పి.నారాయణ, కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరిలు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా తక్కువ ధరకే భూములు కాజేయడంలో నువ్వా–నేనా అన్న రీతిలో పోటీపడినట్లు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది.

మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రి పరిటాల సునీత, మరో మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు, చంద్రబాబు కోటరీలో కీలక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ తనయుడు శివరామకృష్ణ రైతుల నుంచి తక్కువ ధరలకే భూములు కాజేసి కోట్లకు పడగలెత్తారు. మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరాం ప్రైవేటు సైన్యంతో రాజధాని ప్రాంతంలో సాగించిన ఆకృత్యాలు, భూ దందాలు, సెటిల్‌మెంట్లపై సీఐడీ ప్రత్యేకంగా విచారణ చేస్తోంది. కోడెల శివప్రసాద్‌ తనయుడు కోడెల శివరామకృష్ణ రాజధాని ప్రాంతంలో భూములను కోడె దూడలా దున్నేయడమూ సీఐడీ విచారణలో బహిర్గతమైంది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి లింగమనేని రమేష్‌తో చంద్రబాబు కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం పరిధిని నిర్ణయించడం.. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా లింగమనేని సంస్థలు దోచేసిన భూములు.. ఆ సంస్థల్లో చంద్రబాబు కుటుంబ సభ్యులకు దక్కిన రహస్య వాటాలపై సీఐడీ విచారణను ముమ్మరం చేసింది.
బినామీ పేర్లతో నారాయణ దూకుడు 
అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడంలో కీలక భూమిక పోషించిన మాజీ మంత్రి పి.నారాయణ తన సమీప బంధువులు, విద్యా సంస్థల్లో పనిచేసే సిబ్బంది పేర్లతో రాజధానిపై అధికారిక ప్రకటన వెలువడక ముందే భారీగా భూములు కొనుగోలు చేశారు. తన బంధువు ఆవుల మునిశంకర్‌ పేరుతో తుళ్లూరు మండలం రాయపూడిలో సర్వే నంబర్‌ 167/8 లోని 1.18 ఎకరాలను.. ఎకరం రూ.9.44 లక్షల వంతున కొనుగోలు చేసి, అగ్రిమెంట్‌ చేసుకున్నారు. రాజధానిపై అధికారిక ప్రకటన వెలువడ్డాక 2015 జూలై 23న రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. నారాయణ.. తన బావమరిది, నారాయణ విద్యా సంస్థల్లో డైరెక్టర్‌గా పనిచేస్తున్న రాపూరి సాంబశివరావు పేరుతో రాయపూడిలో 3.54 ఎకరాలు, ఆవుల మునిశంకర్‌ పేరుతో ఏడు ఎకరాలు, బెంగళూరులో తన విద్యా సంస్థల్లో పని చేసే కోతపు వరుణ్‌కుమార్‌ పేరుతో 0.4 ఎకరాలు.. వెరసి 12.12 ఎకరాలను 15 డాక్యుమెంట్ల ద్వారా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లు సీఐడీ దర్యాప్తుల్లో వెల్లడైంది.

మందడంలో ఆవుల మునిశంకర్, రాపూరి సాంబశివరావు, కోతపు వరుణ్‌కుమార్‌లతోపాటు.. హైదరాబాద్, బెంగళూరుల్లో నారాయణ విద్యా సంస్థలను పర్యవేక్షించే పోతూరి ప్రమీల పేర్లతో 33.43 ఎకరాలను కొనుగోలు చేశారు. లింగాయపాలెంలో ఆవుల మునిశంకర్, పోతూరి ప్రమీల పేర్లతో 8.89 ఎకరాలను 12 డాక్యుమెంట్ల ద్వారా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఉద్దండరాయుని పాలెంలో పోతూరి ప్రమీల పేరుతో 1.43 ఎకరాలను కొన్నారు. మొత్తమ్మీద ఈ 4 గ్రామాల్లో 57.05 ఎకరాలను బినామీ పేర్లతో నారాయణ కొనుగోలు చేసినట్లు సీఐడీ తేల్చింది.  

కుటుంబ సభ్యులు, షెల్‌ కంపెనీల పేర్లతో సుజనా భూదందా 
టీడీపీలో నంబర్‌ టూగా పేరొందిన కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి అలియాస్‌ యలమంచిలి సత్యనారాయణ చౌదరి.. జాతీయ బ్యాంకులకు రూ.6 వేల కోట్లకు పైగా ఎగ్గొట్టిన ఘనుడు. బ్యాంకులకు కన్నం వేసి దోచేసిన సొమ్ముతో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా రైతుల నుంచి తక్కువ ధరకే భూములు కాజేశారు. సీఆర్‌డీఏ పరిధిలోని చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామంలో సుజనా చౌదరి ఏర్పాటు చేసిన 120 కంపెనీల్లో ఒకటైన శివసత్య పిగ్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో సర్వే నెంబర్లు 432–1, 403–5, 433, 434, 402–1ఏ, 429, 428, 412, 410–2, 427–2, 413, 415, 416, 431, 437, 399–7, 404–11, 407–4లలో 110.6 ఎకరాల భూమిని రాజధాని ప్రకటన వెలువడక ముందే ఎకరం రూ.ఐదు లక్షల చొప్పున రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ అగ్రిమెంట్‌ చేసుకున్నారు.

రాజధాని ప్రకటన వెలువడ్డ తర్వాత గుడిమెట్లలో ఎకరం భూమి విలువ రూ.50 లక్షలకుపైగా పలుకుతోంది. ఈ లెక్కన రూ.50 కోట్లకుపైగా సుజనా చౌదరి కొట్టేసినట్లు స్పష్టమవుతోంది. తమను మోసం చేశారని నిలదీసేందుకు యత్నించిన రైతులపై అప్పట్లో ఉక్కుపాదం మోపి, ఆ భూములను 2018లో తన సంస్థ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. సోదరుడు యలమంచిలి జతిన్‌ కుమార్‌ పేరుతో ఏర్పాటు చేసిన శివజ్యోతి ఫ్లైకాన్‌ బ్లాక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో సర్వే నెంబర్లు 404–1, 404–5, 404–6లో 11.56 ఎకరాలను రాజధాని ప్రకటన వెలువడక ముందే ఎకరం రూ.5 లక్షల చొప్పున కొనుగోలు చేసి 2014లోనే రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. కుటుంబ సభ్యులు, షెల్‌ కంపెనీల పేర్లతో రాజధాని ప్రాంతంలో 623.12 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నిగ్గు తేల్చింది. సీఐడీ విచారణలోనూ ఇదే అంశం వెల్లడైంది. 

కుమారుడి పేరుతో చినరాజప్ప చేతివాటం 
మాజీ డిప్యూటీ సీఎం.. హోం శాఖ మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తన కుమారుడు నిమ్మకాయల రంగనాథ్‌ పేరుతో తుళ్లూరు మండలం నేలపాడులో సర్వే నంబరు 59లో ఒక ఎకరం, తన అనుచరుడు జగతా వెంకట గంగాధర్‌ పేరుతో ఒక ఎకరం.. ఎకరం రూ.మూడు లక్షల చొప్పున 2014 జూన్‌ 10న కొనుగోలు చేసినట్లుగా సీఐడీ దర్యాప్తుల్లో వెల్లడైంది. ఆ భూమిని 2014 అక్టోబరు 31న రిజిష్టర్‌ చేసుకున్నట్లు తేలింది. మిగతా గ్రామాల్లోనూ తన కుటుంబ సభ్యులు, అనుచరుల పేర్లతో భూమి కొనుగోలు చేసినట్లు అంచనాకు వచ్చిన సీఐడీ.. ఆ దిశగా విచారణ చేస్తోంది. 

చంద్రబాబు–లింగమనేని బంధం బట్టబయలు 
మంగళగిరి మండలం కాజ, తాడికొండ మండలం కంతేరు గ్రామాల్లో 636.32 ఎకరాల్లో లింగమనేని రమేష్‌ భూములు కొనుగోలు చేసి 2014కు ముందే అపార్ట్‌మెంట్లను నిర్మించారు. టీడీపీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి రాగానే రాజధాని ఏర్పాటుపై లింగమనేనితో చంద్రబాబు ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం 2014 జూన్‌ 1 నుంచి 2014 డిసెంబర్‌ 30 మధ్య లింగమనేని రమేష్‌ తన సంస్థ పేరుతో కాజ, కంతేరు గ్రామాల్లో 168 ఎకరాలకుపైగా భూమిని ఎకరం కనిష్టంగా రూ.10 లక్షల నుంచి గరిష్టంగా రూ.40 లక్షల చొప్పున కొనుగోలు చేశారు. కాజా, కంతేరు గ్రామాలకు ఆనుకుని 804.32 ఎకరాలకుపైగా భూమిలో ఎస్టేట్‌ను ఏర్పాటు చేశారు.

తుళ్లూరు మండలం రాయపూడిలో లింగమనేని ఎస్టేట్స్‌ డైరెక్టర్‌ బొబ్బా శివప్రకాష్‌ తన డ్రైవర్‌ బోడెపూడి హరిబాబు పేరుతో రాయపూడిలో సర్వే నంబర్‌ 369–2లో 0.65 ఎకరాలు, 369–2లో 1.13 ఎకరాలు, 371–2లో 0.65 ఎకరాలు.. మొత్తం 2.43 ఎకరాలను కొనుగోలు చేశారు. ముందస్తు ఒప్పందం మేరకు చంద్రబాబు కుటుంబ సభ్యులకు అందులో రహస్యంగా లింగమనేని వాటా ఇచ్చినట్లు అప్పట్లో టీడీపీ వర్గాలే వెల్లడించాయి. దీనికి ప్రతిఫలంగా రాజధాని ల్యాండ్‌ పూలింగ్‌ పరిధిలోకి లింగమనేని ఎస్టేట్స్‌ భూములు రాకుండా చంద్రబాబు సహకరించారు. ఈ విషయంపై సీఐడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. 

సెటిల్‌మెంట్లతో పరిటాల వీరంగం 
మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరాం, అల్లుడు వడ్లమూడి హర్షవర్దన్‌ డైరెక్టర్లుగా ఉన్న పీఆర్‌ ఇన్‌ఫ్రా అవెన్యూస్‌ పేరుతో అమరావతి మండలం ధరణికోటలో సర్వే నంబర్‌ 38–1లో ఎకరం భూమిని రూ.3.50 లక్షలకు కొనుగోలు చేసి 2014 ఆగస్టు 27న రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. పెదకూరపాడు మండలం బలుసుపాడులో సర్వే నంబర్‌ 371లో ఎకరం రూ.2 లక్షల చొప్పున రెండు ఎకరాల భూమిని ఆ సంస్థ పేరుతో కొనుగోలు చేసి.. 2014 ఆగస్టు 21న రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. తన భర్త పరిటాల రవి సోదరి కుమార్తె వడ్లమూడి మౌనిక పేరుతో అమరావతి మండలం నెమలికల్లులో 71/1, 71/2బీ సర్వే నంబర్లలో ఒక ఎకరం భూమిని రూ.2 లక్షలకు కొనుగోలు చేసి 2014  నవంబర్‌ 24న రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.

అమరావతి మండలం ధరణికోటలో అల్లుడు హర్షవర్దన్‌ పేరుతో 38/1 సర్వే నంబర్‌లో 1.3 ఎకరాల భూమిని ఎకరం రూ.2.10 లక్షల చొప్పున కొనుగోలు చేసి 2014 ఆగస్టు 21న రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. పరిటాల రవి సోదరి వడ్లమూడి సుధాశారద పేరుతో తుళ్లూరు మండల కేంద్రంలో సర్వే నంబర్‌ 193లో ఎకరం భూమిని రూ.4 లక్షలకు కొనుగోలు చేసి.. 2014 అక్టోబర్‌ 11న రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరాం.. రాజధాని ప్రకటన వెలువడక ముందే రాజధాని ప్రాంతంలో ప్రైవేటు సైన్యాన్ని మోహరింపజేసి.. వివాదాస్పద భూములపై సెటిల్‌మెంట్లు చేసి బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవడంపై సీఐడీ దర్యాప్తు చేస్తోంది. 

కారుచౌకగా 11.60 ఎకరాలు కొట్టేసిన కోడెల
మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ తనయుడు కోడెల శివరామకృష్ణ తుళ్లూరు మండలం కొండమరాజుపాలెంలో సర్వే నంబర్‌ 21–సీలో ఎకరం రూ.1.87 లక్షల చొప్పున 1.66 ఎకరాలను రాజధానిపై ప్రకటన వెలువడక ముందే కొనుగోలు చేసి, 2015 మార్చి 7న రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. రాజధాని ప్రాంతంలో వివాదాస్పద భూములను గుర్తించి, అధికార బలంతో వాటిని తక్కువ ధరలకే సొంతం చేసుకోవడంలో దూసుకెళ్లారు. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో సర్వే నంబర్లు 167–1ఏ, 167–1సీ, 168–1, 168–3లో 11.60 ఎకరాల భూమికి సంబంధించి ఇద్దరు అన్నదమ్ముల మధ్య వివాదం నడుస్తుండటాన్ని పసిగట్టిన కోడెల శివరామకృష్ణ.. ఆ భూమిని చౌకగా కొట్టేశారు. అన్నదమ్ముల్లో ఒకరిని తన వద్దకు పిలిపించుకుని.. తన వ్యక్తిగత సహాయకుడు గుత్తా నాగప్రసాద్‌ మేనేజింగ్‌ పార్టనర్‌గా వ్యవహరిస్తున్న శశి ఇన్‌ఫ్రా పేరుతో ఎకరం రూ.8 లక్షల చొప్పున కొనుగోలు చేసి, 2015  ఆగస్టు 1న రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు సీఐడీ విచారణలో వెల్లడైంది. వాస్తవంగా ఆ ప్రాంతంలో అప్పటికే ఎకరం రూ.1.50 కోట్లకుపైగా పలుకుతుండేది.

కేసుల నమోదుకు రంగం సిద్ధం
సీఐడీ అధికారులు ఇప్పటి వరకు చేసిన దర్యాప్తులో రాజధాని ప్రాంతంలో చంద్రబాబు బృందం ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడి 4,069.94 ఎకరాల భూమిని కాజేసినట్లు తేలింది. 2014 జూన్‌ 1 నుంచి 2014  డిసెంబర్‌31 మధ్య కాలంలో అంటే రాజధాని ప్రాంతాన్ని అధికారికంగా ప్రకటించక ముందే కుటుంబ సభ్యులు, కుటుంబ సంస్థలు, బినామీల పేర్లతో ఆ భూములను దోచేయడం వెల్లడైంది. నిబంధనలు ఉల్లంఘించి భూములు కొనుగోలు చేసిన చంద్రబాబు బృందం, వ్యాపార సంస్థలపై ఐపీసీ 418, 420, 406, 403, 409 సెక్షన్ల కింద కేసు నమోదు చేసేందుకు సీఐడీ సిద్ధమైంది. ‘రాజధాని ప్రాంతంపై ప్రభుత్వం ప్రకటన చేయక ముందే ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేయడంలో ఆంతర్యమేమిటి? అక్కడే రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు మీకు ఎలా తెలుసు? ఎవరు చెప్పారు? ఆ భూములు కొనుగోలు చేయడానికి డబ్బులు ఎలా వచ్చాయి? వాటికి ఆదాయ మార్గాలు ఏమిటి? ఆదాయపు పన్ను చెల్లించారా?’ అంటూ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో భూములు కొనుగోలు చేసిన వారికి చట్ట ప్రకారం నోటీసులు జారీ చేయడానికి సీఐడీ అధికారులు సిద్ధమయ్యారు. ఈ విచారణలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా కేసులు నమోదు చేయడంతోపాటు ఆదాయపు పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌లకు సమాచారం ఇచ్చి ఆ సంస్థలతో కూడా కేసులు నమోదు చేయించి సమాంతరంగా విచారణ చేపట్టనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement