
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఈసారి ఒక్కో పోస్టుకు ఏకంగా 67 మంది పోటీ పడుతుండడం గమనార్హం.
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు 2019 ఆగస్టు–అక్టోబరులో జరిగిన నియామక ప్రక్రియలో ఒక్కో పోస్టుకు 17 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 2020 జనవరిలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈసారి ఒక్కో పోస్టుకు ఏకంగా 67 మంది పోటీ పడుతుండడం గమనార్హం. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా మొదటి విడత గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేయడంతో కొత్తగా ఈ పోస్టులవైపు చూసేవారి సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పుడు 16,208 పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయగా, 10.96 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 2019 జూలైలో 1,26,728 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు 21,69,719 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే పోటీ నాలుగు రెట్లు పెరిగింది. రాత పరీక్షలను యూపీఎస్సీ తరహాలో నిర్వహిస్తుండడంతో యువతలో ప్రభుత్వం పట్ల విశ్వాసం పెరిగింది. ఫలితంగా నోటిఫికేషన్‌కు అనూహ్య స్పందన లభించింది.
16,208 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఈ ఏడాది జనవరి 10న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరి 7వ తేదీ అర్ధరాత్రి వరకూ ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 10,96,740 మంది అన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నట్టు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయ అధికారులు వెల్లడించారు. గ్రేడ్–4 పంచాయతీ కార్యదర్శి, మహిళా పోలీసు, ఎడ్యుకేషన్ అసిస్టెంట్, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పోస్టులతో కూడిన కేటగిరీ–1లో మొత్తం 1,025 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా, 4,53,531 మంది దరఖాస్తు చేసుకున్నారు. 1,134 డిజిటల్ అసిస్టెంట్ పోస్టులకు 2,22,409 మంది, 1,501 వీఆర్వో, విలేజీ సర్వేయర్ పోస్టులకు 1,13,201 మంది దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది జూలైలో జారీ చేసిన నోటిఫికేషన్‌లో 9,886 పశు సంవర్దక శాఖ అసిస్టెంట్ పోస్టులకు కేవలం 6,265 మంది దరఖాస్తు చేసుకోగా, ఈ ఏడాది జనవరిలో ఇచ్చిన నోటిఫికేషన్‌లో 6,858 పశు సంవర్దక శాఖ పోస్టులకు 44,691 మంది దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.