ప్రగతి పరుగులు.. సంక్షేమ ఫలాలు | AP Improved over the national average in development with welfare programs | Sakshi
Sakshi News home page

ప్రగతి పరుగులు.. సంక్షేమ ఫలాలు

Published Tue, Jun 16 2020 5:40 AM | Last Updated on Tue, Jun 16 2020 5:40 AM

AP Improved over the national average in development with welfare programs  - Sakshi

మూడు రంగాలూ ప్రగతిపథంలో.. 
ఆంధ్రప్రదేశ్‌ 2019–20లో మూడు రంగాల్లోనూ ప్రగతిపథంలో సాగింది. వ్యవసాయ, పరిశ్రమలు, సేవా రంగాల్లో పురోభివృద్ధి సాధించింది. ఈ మూడు రంగాల్లో అంచనాలకు మించి సాధించిన జీఎస్‌డీపీ వివరాలు ఇలా...

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నవశకానికి తెర లేచింది. అన్ని రంగాల్లో రాష్ట్రం పురోగమన పథంలో ఉరకలెత్తుతోంది. జాతీయ వృద్ధిరేటు కంటే రాష్ట్ర వృద్ధి రేటు ఎక్కువగా ఉండటం విశేషం. అభివృద్ధి, సంక్షేమ ప్రమాణాల్లో దేశ సగటు కంటే రాష్ట్రం మెరుగ్గా ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘2019–20 ఆంధ్రప్రదేశ్‌ సామాజిక, ఆర్థిక సర్వే’ నివేదిక ఈ వాస్తవాలను గణాంకాలతో సహా వెల్లడించింది. ప్రజలు తనపై నమ్మకం ఉంచి.. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టో అమలుకు నవరత్నాల పథకాలతో శ్రీకారం చుట్టారు. దీంతో  అటు పెద్ద ఎత్తున ప్రజా సంక్షేమ కార్యక్రమాలు.. ఇటు వినూత్న రీతిలో అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్ర ప్రగతి రథం జోరుగా పరుగెడుతోంది. 2019–20 ఆంధ్రప్రదేశ్‌ సామాజిక, ఆర్థిక సర్వే నివేదికను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం విడుదల చేశారు. ఈ నివేదికలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. 

8.16% వృద్ధి 
► రాష్ట్రం 8.16% వృద్ధి సాధించింది. జాతీయ వృద్ధి కంటే ఇది 3.16 శాతం అధికం. 2019–20 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ గణనీయమైన వృద్ధిని సాధించింది. 2019–20లో మన రాష్ట్రం ‘స్థూల రాష్ట్రీయ ఉత్పత్తి’ (జీఎస్‌డీపీ) 8.16% సాధించింది. దేశ వృద్ధి రేటు 5 శాతం ఉంది. 
► ప్రస్తుత ధరల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.9,72,782 కోట్ల స్థూల రాష్ట్రీయ ఉత్పత్తి (జీఎస్‌డీపీ) సాధించింది. 2018–19లో రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.8,62,957 కోట్లు మాత్రమే. ఈ లెక్కన రూ.1.10 లక్షల కోట్లు అధికంగా జీఎస్‌డీపీ సాధించడం విశేషం.

పండగలా వ్యవసాయం
► రాష్ట్రంలో వ్యవసాయం పండగగా మారింది. సకాలంలో వర్షాలు పడటం, ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సహాయం అందించడం, నాణ్యమైన విత్తనాలు, ఎరువులకు కొరత లేకుండా చూడటంతో వ్యవసాయానికి మళ్లీ మంచి రోజులు వచ్చాయి. 
► అందువల్ల వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు 18.96 శాతం, ఉద్యాన రంగంలో 11.67 శాతం, పశు సంపద రంగంలో 4.53 శాతం వృద్ధి సాధ్యమైంది.
► రాష్ట్రంలో పరిశ్రమల రంగం 5.67 శాతం వృద్ధి సాధించింది. సేవా రంగం 9.11 శాతం వృద్ధి నమోదు చేసింది. 

ప్రజల చెంతకు ప్రగతి ఫలాలు
► వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి ఫలాలు ప్రజలకు చేరుతున్నాయి. రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరుగుతుండటమే దీనికి నిదర్శనం. జాతీయ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం ఎక్కువగా ఉండటం విశేషం.
► 2019–20లో రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.1,69,519గా నమోదైంది. జాతీయ తలసరి ఆదాయం రూ.1,34,432 మాత్రమే. 2018–19లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,51,173 మాత్రమే. 2018–19తో పోలిస్తే రాష్ట్ర తలసరి ఆదాయం 12.14 శాతం పెరిగింది.
► ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల హామీలను నెరవేరుస్తూ నవరత్నాల పథకాలను అమలు చేయడం వల్ల రాష్ట్ర అభివృద్ధిలో నవ శకానికి తెరలేచింది. 

వికసిస్తున్న విద్యా రంగం
► రాష్ట్రంలో 67.35 శాతం అక్షరాస్యత నమోదైంది. ఈ శాతాన్ని పెంచి భావి పౌరులకు మెరుగైన విద్యను అందించడానికి ప్రభుత్వం ఉద్యుక్తమైంది.‘జగనన్న అమ్మ ఒడి’ పథకం కింద పిల్లలను చదివించే ప్రతి పేద తల్లి బ్యాంకు ఖాతాలో రూ.15 వేలు జమ చేస్తోంది. 2019–20లో రాష్ట్రంలో 42.33 లక్షల మంది పేద అమ్మల బ్యాంకు ఖాతాల్లో రూ.6,336.45 కోట్లు జమ చేసింది. 
► విద్యార్థులకు పోషకాహారాన్ని అందించేందుకు మధ్యాహ్న భోజన పథకంలో కొత్త మెనూను ప్రవేశపెట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న 35.99 లక్షల మంది విద్యార్థులకు పోషకాహారాన్ని అందిస్తోంది. ప్రభుత్వ చర్యలతో ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్లు తగ్గాయి. 
► ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకుని రాణించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టాలని కృతనిశ్చయంతో ఉంది.
► ‘నాడు–నేడు’ కార్యక్రమం కింద రాష్ట్రంలో 15,715 పాఠశాలల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తోంది. 
► ‘జగనన్న విద్యా దీవెన’ పథకం కింద ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేస్తోంది. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇతరత్రా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 13.26 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపు, మైనార్టీ విద్యార్థుల కాలేజీ ఫీజుల కింద రూ.3,329.49 కోట్లు చెల్లించింది.
► ‘జగనన్న వసతి దీవెన’ పథకం కింద విద్యార్థుల హాస్టల్, వసతి ఖర్చులను ప్రభుత్వం భరిస్తోంది. అందుకోసం రాష్ట్రంలో 8.08 లక్షల మంది అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపు, మైనార్టీ విద్యార్థులకు రూ.2,087 కోట్లు చెల్లించింది. 
► ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పోషకాహారాన్ని అందించేందుకు ‘జగనన్న గోరుముద్ద’ పథకాన్ని అమలు చేస్తోంది. రూ.1,105 కోట్లు ఖర్చు చేసింది. 2019–20లో రూ.1,105 కోట్లు ఖర్చు చేసి రాష్ట్రంలో 36 లక్షల మందికి ప్రయోజనాన్ని కలిగించింది.

సామాజిక పింఛన్లతో ఆర్థిక భద్రత
► అర్హులందరికీ సామాజిక పింఛన్లతో ప్రభుత్వం పేదలకు ఆర్థిక భద్రతనిస్తోంది. 2019–20లో వృద్ధాప్య, వితంతు, కల్లు గీత, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు, చర్మకారులు, హెచ్‌ఐవీ బాధితుల పింఛన్లను రూ.2,250కు పెంచారు. దివ్యాంగులకు రూ.3 వేలు, డయాలసిస్‌ చేయించుకునే కిడ్నీ బాధితులకు రూ.10 వేలిస్తున్నారు. 
► పింఛన్‌ పొందేందుకు అర్హత వయసును 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించింది. 2020 జనవరిలో కొత్తగా 6.14 లక్షల పింఛన్లు ఇచ్చారు. ప్రతి నెలా రాష్ట్రంలో 54.68 లక్షల మంది పింఛన్‌దారులకు రూ.1,320.76 కోట్లు పింఛన్లుగా పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం 2019–20లో రూ.15,635 కోట్లు కేటాయించారు. 2020–21లో రూ.18 వేల కోట్లకు పెంచాలని నిర్ణయించారు.

ఆరోగ్యానికి భరోసా 
► రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం పెద్ద పీట వేసింది. వైద్య, ఆరోగ్య మౌలిక వసతులను అభివృద్ధి పరుస్తుండటంతోపాటు వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తోంది. 
► చైల్డ్‌ ఇమ్యునైజేషన్‌ కార్యక్రమం కింద రాష్ట్రంలో 93 శాతం మంది పిల్లలకు వ్యాక్సిన్లు వేశారు. 
► వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం పూర్తి స్థాయిలో అమలు చేస్తోంది. ఈ పథకం కింద పేదలు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలను ఉచితంగా పొందుతున్నారు. 
► రాష్ట్రంలో రూ.5లక్షలలోపు ఆదాయం ఉన్న 144 లక్షల కుటుంబాలు లబ్ధిదారులుగా ఉన్నారు. 2019–20లో వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 2.70 లక్షల మంది ప్రయోజనం పొందారు. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ట్రస్టు కింద రాష్ట్రంలో 1,529 నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో 1,259 రోగాలకు ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. 
► వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ సేవలను రాష్ట్రం వెలుపల హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో ఉన్న సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులకు కూడా విస్తరించారు. ఆ మూడు నగరాల్లోని 130 సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో 716 రకాల రోగాలను ఈ పథకం పరిధిలోకి తీసుకువచ్చారు. 
► ఆపరేషన్‌ అనంతరం రోగి కోలుకునే వరకు కూడా ప్రభుత్వం ప్రత్యేక అలవెన్స్‌ ఇస్తోంది. రోజుకు రూ.225 చొప్పున నెలకు గరిష్టంగా రూ.5 వేలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తోంది. 2019–20లో రాష్ట్రంలో 1.05 లక్షల మంది రోగులకు రూ.73 కోట్లు అలవెన్స్‌గా చెల్లించింది. 
► రాష్ట్రంలో అందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేస్తున్నారు. మూడేళ్ల పాటు కొనసాగే ఈ కార్యక్రమాన్ని 2019–20లో ప్రారంభించారు. దీని కింద 60,406 పాఠశాలలను కవర్‌ చేశారు. ఇప్పటికి 66 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో 4.35 లక్షల మందికి కంటి సమస్యలు ఉన్నట్లుగా గుర్తించారు. 1.52 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. 46,287 మందికి తదుపరి పరీక్షలు నిర్వహించాల్సి ఉందని చెప్పారు. 

దశలవారీగా మద్య నియంత్రణ దిశగా..
► రాష్ట్రంలో దశల వారీగా మద్య నియంత్రణకు ప్రభుత్వం ఉద్యుక్తమైంది. ఇందులో భాగంగా 43 వేల బెల్ట్‌ దుకాణాలను పూర్తిగా తొలగించింది. 33 శాతం మద్యం దుకాణాలను తగ్గించింది. 4,380 పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేసింది. మద్యం విక్రయ సమయాన్ని తగ్గించి, ధరలను పెంచింది. 

పేద మహిళలకు ‘వైఎస్సార్‌ చేయూత’
► పేద మహిళల సంక్షేమం కోసం ‘వైఎస్సార్‌ చేయూత’ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు 2020–21 నుంచి నాలుగేళ్లలో నాలుగు విడతలుగా రూ.75 వేలు ఆర్థిక సహాయం చేయనుంది.

వైఎస్సార్‌ ఆసరా
► 2019 ఏప్రిల్‌ 11 నాటికి డ్వాక్రా మహిళలకు ఉన్న రుణ బకాయిలను చెల్లించేందుకు నాలుగు దశల్లో ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2020–21 నుంచి నాలుగేళ్లపాటు అమలు చేయనుంది.

గ్రామ స్వరాజ్యం 
పరిపాలనను క్షేత్ర స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను నెలకొల్పింది.  రాష్ట్రంలో 2,61, 216 గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 541 సేవలను అందిస్తోంది. పౌరుల సమస్యల పరిష్కారానికి ‘స్పందన’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 72 గంటల్లో ప్రజల సమస్యలను పరిష్కరిస్తుండటం విశేషం. 

పరిశ్రమలు, మౌలిక సదుపాయాలకు పెద్దపీట 
► టెండర్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ‘జ్యుడిషియల్‌ ప్రివ్యూ కమిషన్‌’ను ఏర్పాటు చేసింది. రూ.100 కోట్లు కంటే విలువైన కాంట్రాక్టుల బిడ్డింగ్‌ ప్రక్రియకు ముందుగా డాక్యుమెంట్లను ఈ కమిషన్‌ పరిశీలిస్తుంది. 
► చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ‘వైఎస్సార్‌ నవోదయం’ కార్యక్రమాన్ని చేపట్టింది. 2019 సెప్టెంబర్‌ 5 నుంచి 
కొత్త ఇసుక విధానాన్ని అమలులోకి తెచ్చింది. 

అందరికీ ఇళ్లు 
► ఇల్లు లేని పేదలందరికీ ఇల్లు నిర్మించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. దాదాపు 30 లక్షల ఇళ్ల పట్టాలు మంజూరు చేయనుంది. 
► ఒక్కో ఇంటికి రూ.7.50 లక్షల చొప్పున రాబోయే నాలుగేళ్లలో 30 లక్షల ఇళ్లను నిర్మించాలని నిర్ణయించింది. 2020–21లో 15 లక్షల ఇళ్లను నిర్మించనుంది. 

పోర్టులు  
► కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద కొత్తగా గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించింది. ఇక్కడి నుంచి విమాన సర్వీసులను త్వరలోనే ప్రారంభిస్తారు. 
► మచిలీపట్నం, భావనపాడు, కాకినాడ ఎస్‌ఈజెడ్, రామాయపట్నంలలో కొత్తగా నాలుగు పోర్టులు నిర్మాణ ప్రక్రియను చేపట్టింది.
► రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్‌ రంగాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా కృషి చేస్తోంది. రూ.18,691.42 కోట్ల పెట్టుబడితో 215 ఐటీ కంపెనీలను తీసుకువచ్చేందుకు ఉద్యుక్తమైంది. తద్వారా రాష్ట్రంలో 1,10,343 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. 
► రూ.30,656.16 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో 128 ఎలక్ట్రానిక్‌ పరిశ్రమలను నెలకొల్పనున్నారు. తద్వారా 1,07,864 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. రాబోయే ఐదేళ్లలో ఈ పరిశ్రమలను నెలకొల్పనున్నారు. 

వడివడిగా జలయజ్ఞం
► రాష్ట్ర ప్రభుత్వం జలయజ్ఞం కార్యక్రమం కింద రాష్ట్రంలో 54 సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టింది. వాటిలో 14 ప్రాజెక్టులను పూర్తి చేసింది. 
► మరో రెండు ప్రాజెక్టుల రెండో దశను పూర్తి చేసింది. అన్ని ప్రాజెక్టుల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించింది. 

 రైతు సంక్షేమం
► రైతుల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి రూ.13,500 పెట్టుబడి సహాయం అందిస్తోంది. రాష్ట్రంలో నిరుపేదలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రైతులు 46.69 లక్షల మంది ప్రయోజనం పొందారు. వారిలో 1.58 లక్షల మంది కౌలు రైతులు కూడా ఉన్నారు. వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద 2019–20లో రైతుల ఖాతాల్లో రూ.6,534 కోట్లు జమ చేశారు. 
► రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల సరఫరాకు గ్రామ సచివాలయాల్లో 10,614 వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పింది. రైతుల ప్రయోజనం కోసం ఉచిత పంటల బీమా పథకం అమలు చేస్తోంది. 2019 ఖరీఫ్‌ సీజన్‌లో 21.53 లక్షల మంది రైతులు పంటల బీమా కింద పేర్లు నమోదు చేసుకున్నారు. వారి తరఫున ప్రభుత్వం రూ.12,70.01 కోట్లు ప్రీమియంగా చెల్లించింది. 
► రూ.లక్షలోపు వ్యవసాయ రుణం తీసుకుని చెల్లించిన వారికి వడ్డీ లేని రుణాల పథకం అమలు చేస్తోంది.  రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షలు, మత్స్యకార కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తోంది. 
► ఆయిల్‌పాం, బొప్పాయి, నిమ్మ, కోకో, టమాటా, మిర్చి ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలో మొదటి స్థానం సాధించింది. మామిడి, బత్తాయి, పసుపు ఉత్పత్తిలో రెండో స్థానం దక్కించుకుంది. 
► మత్స్యకారులకు వేట నిషేధ కాలంలో చెల్లించే పరిహారాన్ని ప్రభుత్వం రూ.10 వేలకు పెంచింది. అందుకోసం రూ.102.33 కోట్లు చెల్లించి రాష్ట్రంలో 1.02 లక్షల మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం కలిగించింది.  

దశా దిశా మార్చే విధాన నిర్ణయాలు
► శాశ్వత ప్రాతిపదికన రాష్ట్ర బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 
► నామినేటెడ్‌ పోస్టులు, నామినేటెడ్‌ పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు ప్రకటించింది. 
► నామినేటెడ్‌ పోస్టులు, నామినేటెడ్‌ పనుల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించింది. 41 కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 
► మహిళలపై వేధింపులను అరికట్టేందుకు ‘దిశా’ చట్టాన్ని చేసింది. 
► ఏపీఎస్‌ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేసింది. తద్వారా ఏపీఎస్‌ఆర్టీసీని పరిరక్షించడమే కాకుండా 51,488 మంది ఉద్యోగులకు ప్రయోజనం కలిగించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ ప్రకటించింది. 
► అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, హోంగార్డుల జీతాలను పెంచింది. 

అభివృద్ధి వికేంద్రీకరణ
► అభివృద్ధి ఫలాలను రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు సమానంగా అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ప్రాంతీయ సమానాభివృద్ధి సాధించేందుకు మూడు రాజధానుల ఏర్పాటును ప్రతిపాదించింది. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటిస్తూ శాసనసభలో బిల్లులను ప్రవేశ పెట్టింది.
► రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్‌ కల్పిస్తూ చట్టం చేసింది. అందుకు అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించేందుకు ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీ, 25 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లను నెలకొల్పింది. 
► సొంత ఆటో రిక్షాలు / ట్యాక్సీలు/ మ్యాక్సి క్యాబ్‌లు ఉన్న ఆటో కార్మికులకు ఏటా రూ.10 వేలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తోంది. తద్వారా రాష్ట్రంలో 2.62 లక్షల మందికి ప్రయోజనం కల్పించింది. 
► పేద చేనేత కార్మికులకు సహాయం చేసేందుకు ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ పథకాన్ని ప్రవేశ పెట్టింది. అర్హులైన లబ్ధిదారులకు ఏటా రూ.24 వేలు ఆర్థిక సహాయం చేస్తోంది. అందుకోసం రూ.196.27 కోట్లు పంపిణీ చేయడం ద్వారా 81,779 మందికి ప్రయోజనం కల్పించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement