న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన రుణం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న దరఖాస్తు ప్రపంచ బ్యాంకు పరిశీలనలో ఉందని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. రాజధాని నగరం అభివృద్ధి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు రూ.3.324 కోట్ల రుణం కోరుతూ ఏపీ ప్రభుత్వం దరఖాస్తు పెట్టుకుందన్నారు. రుణం మంజూరు విషయంలో ప్రపంచ బ్యాంకు ప్రారంభించిన అధ్యయనం, మదింపు ప్రాథమిక దశలో ఉందన్నారు. ప్రాజెక్టు మదింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత రుణానికి సంబంధించిన సంప్రదింపులు ప్రారంభమవుతాయని, ఈ సంప్రదింపుల ప్రక్రియ పూర్తయ్యాకనే రుణాన్ని మంజూరు చేస్తుందని ఆయన చెప్పారు. రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా జవాబు ఇచ్చారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం జనరల్ కేటగిరీ రాష్ట్రాలు ప్రపంచ బ్యాంకు వంటి బహుముఖ ఆర్థిక సంస్థల నుంచి పొందే ఆర్థిక సహాయం మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 70 శాతం మించకూడదన్నారు. మిగిలిన 30 శాతం రాష్ట్ర ప్రభుత్వం తన సొంత వనరుల నుంచే సమకూర్చుకోవలసి ఉంటుందని తెలిపారు. ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత జరిగే ఖర్చును రుణంలో భాగంగా ప్రపంచ బ్యాంకు నియమిత కాలపరిమితి ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తూ వస్తుందని వివరించారు. ప్రపంచ బ్యాంకు రుణం ఇంకా ఆమోదం పొందనందున ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు, వాటి వినిమయ పత్రాల సమర్పణ ప్రసక్తే లేదని మరో ప్రశ్నకు జైట్లీ సమాధానమిచ్చారు.
రాజధాని నిర్మాణానికి రూ.1500 కోట్లు ఇచ్చాం
అమరావతిలో అసెంబ్లీ, రాజ్‌భవన్, హైకోర్టు, సెక్రటేరియట్ తదితర సదుపాయాల నిర్మాణం కోసం గత మూడేళ్ళ కాలంలో రూ.1500 కోట్లను విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పి.రాధాకృష్ణన్ వెల్లడించారు. రాజ్యసభలో విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఏపీ విభజన చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా నూతన రాజధాని నగరంలో సదుపాయాల కల్పన కోసం ప్రత్యేక సహాయం కింద కేంద్రం ఈ నిధులను విడుదల చేసిందన్నారు. రాజ్‌భవన్, అసెంబ్లీ భవనాల నిర్మాణం కోసం 2014-15లో రూ.500 కోట్లు, 2015-16లో నూతన రాజధాని నిర్మాణానికి రూ.350 కోట్లు, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.200 కోట్లు, 2016-17లో రూ.450 కోట్లు విడుదల చేసినట్లు వివరించారు. కేంద్రం ఇప్పటివరకు విడుదల చేసిన రూ.1500 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు సమర్పించిందని, ఆయా నిర్మాణాల కోసం రూ.1,583 కోట్లు ఖర్చు చేసినట్లు నీతి అయోగ్‌కు వినిమయ పత్రాలు సమర్పించినట్లు మంత్రి రాధాకృష్ణన్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment