
మంత్రి అయ్యన్నకు చేదు అనుభవం
అమరావతి: ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీ ప్రారంభోత్సవంలో ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడుకు శనివారం చేదు అనుభవం ఎదురైంది. మంత్రి అయ్యన్నపాత్రుడిని పోలీసు సిబ్బంది లోనికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. మంత్రిననే విషయం ఆయనే స్వయంగా చెప్పినా బారికేడ్లు తొలగించేందుకు నిరాకరించారు. దీంతో ఆయన ఆగ్రహంతో వెనుదిరిగారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ...రాజకీయ నాయకులకు అవమానాలు, గౌరవాలు సహజమేనన్నారు.
అయితే ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ కోన శశిధర్ ...మంత్రి అయ్యన్నకు ఫోన్ చేశారు. తిరిగి కార‍్యక్రమానికి హాజరు కావాలని మంత్రిని కోరినప్పటికీ ఆయన నిరాకరించారు. అయ్యన్నతోపాటు పలువురు అతిథులను.. ప్రముఖులను కూడా లోపలికి వెళ్లకుండా గుంటూరు పోలీసులు ఇబ్బందులకు గురి చేశారు. మరోవైపు మంత్రి గంటా శ్రీనివాసరావే ఇలా చేయించారని అయ్యన్న వర్గీయులు మండిపడుతున్నారు. విశాఖ భూ కబ్జాల వ్యవహారంలో మంత్రులు గంటా, అయ్యన్న మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే.