
కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి రేవంత్ వ్యవహారం
నేడు ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యేకు లంచం ఇవ్వజూపి ఏసీబీకి దొరికిపోయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వ్యవహారాన్ని కేంద్ర ఎన్నిక కమిషన్ (సీఈసీ) దృష్టికి తీసుకెళ్లినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. సోమవారం సచివాలయంలోని తన చాంబర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏసీబీ డీజీ ఇచ్చిన నివేదికను సీఈసీకి సమర్పించినట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అంతకుమించి ఈ విషయంలో వివరాలు వెల్లడించనని తెలిపారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థలకు సంబంధించి 12 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు మంగళవారం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు భన్వర్‌లాల్ తెలిపారు. విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లోని రెండేసి ఎమ్మెల్సీ స్థానాలు 2013, 2015లో ఖాళీ అయిన దృష్ట్యా వాటికి ఒకేసారి వేర్వేరుగా రెండు బ్యాలెట్లతో ఎన్నికలు జరుగుతాయన్నారు. ఈ ఎన్నికలకు మొత్తం తొమ్మిది జిల్లాల్లో 35 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, 10,004 మంది ఓటర్లున్నారన్నారు.
తొమ్మిది జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుందని, జెడ్పీ, మున్సిపల్, కార్పొరేషన్ సర్వసభ్య సమావేశాలు నిర్వహించరాదన్నారు. ప్లయింగ్ స్క్వాడ్, చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు భన్వర్‌లాల్ తెలిపారు. ఓటు కోసం ప్రలోభపెడితే మాత్రం కఠిన చర్యలుంటాయన్నారు.