
'నోట్ల రద్దు బాబుకు ముందే తెలుసు'
విజయవాడ: పెద్ద నోట్ల రద్దు విషయం సీఎం చంద్రబాబుకు ముందే తెలుసునని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. విజయవాడలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... బీజేపీ, టీడీపీ నేతలు తమ వద్దనున్న నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్న తర్వాతనే రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేశారని చెప్పారు.
నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని... విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని ఎందుకు తేలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు. కాగా, జాబు రావాలంటే బాబు పోవాలని, ప్రత్యేక హోదాతోనే ఉద్యోగాలు వస్తాయని, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని స్పష్టం చేశారు. బాబు ఇచ్చిన 600 హామీలను అమలు చేయాలని, లేదంటే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని రఘువీరా డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.