
తొంభై శాతం మద్దతు..పచ్చి అబద్ధం
హైదరాబాద్ : నోట్ల రద్దు నిర్ణయంపై ప్రధాని మోదీకి 90 శాతం మంది ప్రజలు మద్దతు పలికారన్నది పచ్చి అబద్ధమని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘవీరా రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..130 కోట్ల మంది జనాభాలో 10 లక్షల మంది మద్దతిస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. తప్పుడు సర్వేలతో ప్రధాని మోదీ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలు అడుగుతున్న 18 ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పాలని రఘువీరా నిలదీశారు. 100 రోజుల్లో విదేశాల్లో ఉన్న బ్లాక్‌మనీ తెస్తానన్న హామీ ఏమైందన్నారు. నల్లకుబేరుల బ్యాంక్ అప్పులను కేంద్రం ఎందుకు రద్దు చేసిందని ప్రశ్నించారు. పెద్ద నోట్లతో బ్లాక్ మనీకి బ్రేకులు వేయవచ్చు అంటున్న మోదీ..రూ.2 వేల నోటు ఎందుకు తెచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఎందుకు దేశంలోని నల్లకుబేరుల పేర్లు బయట పెట్టడం లేదన్నారు. నోట్ల రద్దుపై ఢిల్లీలో టీడీపీనేతలు మోదీకి ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. నోట్ల రద్దుపై కేంద్ర వైఖరికి నిరసనగా ఈ నెల 28న ఆక్రోష్ దినంగా నిర్వహిస్తామన్నారు. దీనికి అన్ని పక్షాల మద్దతు తీసుకుంటామని రఘువీరా చెప్పారు.