జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం
కర్నూలు(అర్బన్): పల్లె పాలనపై సందిగ్ధం నెలకొంది. సర్పంచుల పదవీ కాలం ఆగస్టు 1వ తేదీతో పూర్తి కానుండడం...ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా లేకపోవడంతో సమస్య ఎదురవుతోంది. ప్రస్తుత సర్పంచులనే పర్సన్ ఇన్‌చార్జీలుగా కొనసాగిస్తారా..లేదంటే ప్రత్యేకాధికారులను నియమిస్తారా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
జిల్లాలో 889 పంచాయతీలకు 2013 జూలై 24, 26, 31వ తేదీల్లో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించారు. అదే ఏడాది ఆగస్టు 2వ తేదీన పల్లెల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. వీటి పదవీకాలం 2018 ఆగస్టు 1వ తేదీతో పూర్తి కానుంది. సకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఐదారు నెలల క్రితమే పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఓటర్ల జాబితా తదితర ప్రక్రియను పూర్తి చేసింది. ఎన్నికల వ్యయం ఎంతవుతుందనే విషయంపై సమావేశాలు నిర్వహించారు. అయితే ప్రభుత్వం వెనకడగు వేయడంతో ఎన్నికల ఏర్పాట్లను మానుకున్నారు. ఇదిలా ఉండగా.. తమనే పర్సన్ ఇన్‌చార్జ్‌లుగా కొనసాగించాలని పలు జిల్లాలకు చెందిన సర్పంచులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఈ మేరకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు కోరినట్లు తెలుస్తోంది. 1996 మార్చి4న అప్పటి ప్రభుత్వం పర్సన్ ఇన్‌చార్జీల నియామకానికి సంబంధించి జీఓ నం113ను విడుదల చేసింది. 2011లో బీసీ రిజర్వేషన్లపై ఏర్పడిన సందిగ్ధ కారణంగా రెండేళ్ల పాటు ప్రత్యేకాధికారులతో పల్లె పాలనను అప్పగించారు. అయితే 1994 పంచాయతీరాజ్ యాక్ట్ సెక్షన్ 143 ప్రకారం గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగించాలన్నా.. పర్సన్ ఇన్‌చార్జీలను నియమించాలన్నా అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంది. ఇదిలా ఉండగా..ఈ నెల మొదటి వారంలో 14వ ఆర్థిక సంఘం నిధులు జిల్లాకు రూ.69 కోట్లు విడుదలయ్యాయి. పలు సాంకేతిక కారణాలతో ఆయా నిధులు సర్పంచుల ఖాతాల్లో జమ కాలేదు. పంచాయతీల్లో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు వస్తాయోరావోనని సర్పంచులు ఆందోళన చెందుతున్నారు.
‘ప్రత్యేక’ సమస్యలివీ..
ప్రత్యేకాధికారుల పాలనతో గ్రామీణపాలన అస్తవ్యస్తంగా తయారవుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. మండల స్థాయి అధికారులు ప్రత్యేకాధికారులుగా వ్యవహరించాల్సి రావడంతో వారికున్న పనిఒత్తిడి కారణంగా గ్రామీణ పాలనపై దృష్టి సారించలేరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అత్యవసర సమయాల్లో డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తే వారు వెనకడుగు వేసే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం జిల్లాలో 520 మంది పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. వీరికి బాధ్యతలను అప్పగించినా పాలన కష్టమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పాలకవర్గాలు ఉంటేనే గ్రామాలాభివృద్ధి
పాలకవర్గాలు ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. ప్రత్యేకాధికారుల పాలనలో ప్రజలు నేరుగా ఇబ్బందులు చెప్పుకునే అవకాశాలు చాలా తక్కువ. ప్రభుత్వ కుట్రతోనే 14వ ఆర్థిక సంఘం నిధులు సర్పంచుల ఖాతాల్లో జమ కావడం లేదు.
వై. కోటేశ్వరరెడ్డి, సర్పంచ్, ఎం. కృష్ణాపురం, గోస్పాడు మండలం
Comments
Please login to add a commentAdd a comment