
సాక్షి, తూర్పుగోదావరి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌పై ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో బ్రిటిష్ జనరల్ డయ్యర్ కన్న దారుణంగా వ్యవహరించారని అన్నారు. బహీర్ బాగ్‌లో రైతులపై కాల్పులు జరిపించి అమాయకులను పొట్టనపెట్టుకున్న ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. మంగళవారం దాడిశెట్టి రాజా ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనను చూసి ఓర్వలేకనే ఆయనపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
చంద్రబాబు హయాంలో అనేక రకాల అవినీతికి పాల్పడి.. ఇప్పుడు ఎదుటి వారిపై విమర్శలు చేయడం దారుణమన్నారు. ప్రజల మధ్యకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేని లోకేష్.. ఇంట్లో కూర్చోని ట్విట్టర్లో పోస్టులు పెడుతున్నారని విమర్శించారు. ఆయనకు సోషల్ మీడియాలో సరిగ్గా పోస్టులు కూడా చేయడం రాదని ఎద్దేవా చేశారు. ఆయన తీరు చూస్తుంటే ఎవరికో జీతం ఇచ్చి మెసేజ్‌లు పెడుతున్నట్లు అర్థమవుతోందని సందేహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో రూ.300 కోట్లు ఖర్చు పెట్టినా.. మంగళగిరి ప్రజలు ఏవిధంగా బుద్ది చెప్పారో ప్రజలంతా చూశారని రాజా గుర్తుచేశారు.