అపార్టుమెంట్ వాసులతో మాట్లాడుతున్న సబ్‌కలెక్టర్ సాయికాంత్‌వర్మ
తూర్పుగోదావరి ,సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ఏవీ అప్పారావు రోడ్డు గెయిల్ కార్యాలయం ఎదురుగా గతంలో ప్రసాదిత్య మల్టీప్లెక్స్ నిర్మాణంలో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా సుమారు 30 అడుగుల లోతు తవ్వడంతో పక్కనే ఉన్న అపార్టుమెంటు ఒరిగిన సంగతి తెలిసిందే. తాజాగా సోమవారం పూడ్చిన మట్టి ఒక్కసారిగా కిందకి జారిపోయింది. దాంతో అపార్టుమెంటు వాసులు భయాందోళనలు వ్యక్తం చేశారు. గత ఏడాది నవంబర్ 24న జరిగిన సంఘటనతోనైనా నిర్మాణదారులు కనీసం చర్యలు తీసుకోకపోవడం విడ్డురంగా ఉందని అపార్ట్‌మెంట్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రెండు ఎకరాల స్థలంలో 70 అడుగల మేర లోపలికి తవ్వారు. పార్కింగ్ కోసం రెండు సెల్లార్లు, ఆపై భవనం నిర్మించేలా ప్రణాళికలు రచించారు. చుట్టూ 13 అడుగుల మేర స్థలం వదిలి పునాదులు తవ్వాల్సి ఉండగా అడుగు కూడా వదలకుండా నాలుగు వైపులా తవ్వేయడంతో ఆ స్థలానికి అనుకుని ఉన్న జీఈవీ గ్రాండు అపార్టుమెంటు ప్రహరీ దెబ్బతింది. అయినా ఆగకుండా పనులు చేయడంతో గత ఏడాది నవంబర్ 24న అపార్టుమెంటు సెట్‌బ్యాక్ స్థలం కుంగిపోవడంతో పాటు వంద అడుగుల మేర ప్రహరీ కూలిపోయింది. దీంతో అపార్టుమెంటులో నివసిస్తున్న కుటుంబాలు భయాందోళనతో బయటకు పరుగులు తీశాయి. తరువాత జేఎన్‌టీయూకే ప్రొఫెసర్లు, నిపుణులతో సంబంధిత ప్రాంతాన్ని పరిశీలించి అపార్టుమెంటుకు ఎటువంటి ప్రమాదం లేకుండా రిటైనింగ్ వాల్‌ను అంచెల విధానంలో బలోపేతం చేసేలా ప్రణాళిక రూపొందించారు. కానీ భవన యాజమానుల నిర్లక్ష్యం వలన సోమవారం రాత్రి మరలా కొంతమేర రక్షణ గోడ కూలిపోయింది. దీంతో మరలా ఆపార్టుమెంటు వాసులు మరోసారి ఉలిక్కిపడ్డారు. సోమవారం జరిగిన సంఘటనతో నగరపాలక సంస్థ కమిషనర్ సుమిత్ కుమార్, పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు పరిస్థితిని సమీక్షించారు. మట్టి జారిన ప్రాంతానికి ఆనుకుని ఉన్న ప్లాట్లలోని రెండు కుటుంబాలను ఖాళీచేయించారు.
నిర్లక్ష్య సమాధానంఇస్తున్న నిర్మాణ సిబ్బంది
సోమవారం రాత్రి ఆపార్టుమెంటుకు విద్యుత్‌ను సరఫరా చేసే ఒక ట్రాన్స్‌ఫార్మర్ కూలిపోయింది. ఇదేంటిని నిర్మాణానికి సంబంధించిన సిబ్బందిని అడిగితే తమకు అన్ని అనుమతులు ఉన్నాయని, ట్రాన్స్‌ఫార్మర్ కూలిన మాట వాస్తవమేనని, దీని నుంచి విద్యుత్ సరఫరా అయ్యే అపార్టుమెంటు బ్లాకులోని వారిని హోటల్ రూమ్‌లకు మార్చామని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. విద్యుత్ పునరుద్ధరణ పూర్తయ్యాక మరలా వారిని అపార్ట్‌మెంట్‌కి చేరుస్తామన్నారు. విద్యుత్ శాఖ అధికారులు కూడా పరిశీలించారని చెప్పుకొచ్చారు. కాగా మంగళవారం అక్కడ పరిస్థితి తెలుసుకోవడానికి వెళ్లిన పాత్రికేయులను లోనికి అనుమతించలేదు.
‘గుడా’ నుంచిఅన్ని అనుమతులు పొందారా?
మల్టీప్లెక్స్ నిర్మాణ సమయంలో ఏడు లేయర్ల లోతు అంటే సుమారు 10 మీటర్లు లోతు తవ్వుకోవడానికి అనుమతులు ఉంటాయి. కానీ మొదట నాలుగు లేయర్ల తవ్వకం పూర్తయిన వెంటనే నిర్మాణానికి సుమారు ఐదారు మీటర్ల దూరంలో ఉండే అపార్టుమెంటు ప్రహరీ కూలిపోయింది. దాంతో అక్కడ మల్టీప్లెక్స్ నిర్మాణానికి అనువైన ప్రాంతమేనా అనే సందేహాలు కలుగుతున్నాయి. గుడా నుంచి భవన నిర్మాణానికి కావలసిన అనుమతులు అన్నీ ఉన్నాయా? అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు, గుడా సంబంధిత వ్యక్తులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనేది మరో ప్రశ్న. అధికార టీడీపీ నాయకులు వెనుకుండడం వల్లే వారందరూ నోరుమెదపడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నవంబర్ 24, 2018ఏవీ అప్పారావు రోడ్డు..
గెయిల్ కార్యాలయం ఎదురుగాప్రసాదిత్య మల్టీప్లెక్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.సుమారు 30 అడుగుల లోతులో మట్టి తవ్వకం పనులు చేపట్టగా.. పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్ పిల్లర్లు ఒరిగాయి. అప్పట్లో ఈ సంఘటన జిల్లాలోసంచలనం సృష్టించింది.వెంటనే రంగంలోకి దిగిన అధికారులు అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించారు. అయితే జేఎన్‌టీయూకే బృందం భూ పరీక్షలు నిర్వహించి కొన్ని సూచనలు చేయడంతో ఆ ప్రకారం అక్కడ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు అక్కడే తిరిగి నివాసం ఉంటున్నారు.
ఆరు నెలల తర్వాత..
జేఎన్‌టీయూకే బృందం ఇచ్చిన నివేదిక ప్రకారం అపార్ట్‌మెంట్ చుట్టూ మట్టితో పూడ్చి పటిష్టం చేసే పనులు చేపట్టారు. పూడ్చిన మట్టి సోమవారం ఒక్కసారిగా కిందకి అండలుగా జారిపోయింది. దీంతో అపార్ట్‌మెంట్ వాసుల్లో మళ్లీకలకలం మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment