జాయింట్ వెంచర్లకు గుడ్‌బై!
సాక్షి, హైదరాబాద్: జాయింట్ వెంచర్ (జేవీ) ప్రాజెక్టుల నుంచి బయటకు రావాలని ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) నిర్ణయించింది. సంస్థకు సంబంధించిన జేవీలపై వివిధ రకాల విచారణలు కొనసాగుతుండటంతో పాటు ఆయూ ప్రాజెక్టుల్లో సంస్థ వాటాపై చెలరేగుతున్న వివాదాల నేపథ్యంలో ఏపీఐఐసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఏపీఐఐసీ పాలకమండలి సమావేశం శుక్రవారం జరిగింది. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, ఏపీఐఐసీ ఎండీ జయేష్ రంజన్‌తో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఎమ్మార్, రహేజా, హైటెక్ సిటీ, రాంకీ ఫార్మాసిటీ మొదలైన మొత్తం 19 రకాల జాయింట్ వెంచర్ ప్రాజెక్టులను వివిధ సంస్థలతో కలిసి ఏపీఐఐసీ చేపట్టింది.
ఈ జేవీల్లో ఏపీఐఐసీకి 11 శాతం నుంచి 26 శాతం వరకూ వాటాలు ఉన్నాయి. జేవీల నుంచి బయటపడాలని భావిస్తున్న సంస్థ.. తన వాటాల విలువను లెక్కించేందుకు చార్టర్డ్ అకౌంటెంట్లను నియమించాలని సమావేశంలో నిర్ణయించింది. ఈ విలువ లెక్కింపు ఆధారంగా... ప్రస్తుతం జేవీలో ఉన్న సంస్థకు తమ వాటా కొనుగోలు చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఒకవేళ సదరు సంస్థ ముందుకు రాని పక్షంలో ఇతర సంస్థలకు విక్రయించే వీలుందని సమాచారం. అయితే జేవీ ప్రాజెక్టుల్లో ప్రభుత్వ భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలనే వాదన వినిపిస్తోంది. ఈ సంస్థలకు ప్రభుత్వం భూమి ఇవ్వడంతో పాటు రకరకాల రాయితీలను కల్పించింది. అందువల్ల ఏపీఐఐసీ ఈ ప్రాజెక్టుల నుంచి బయటకు వస్తే భాగస్వామ్య ప్రైవేటు సంస్థలు ఏకపక్షంగా వ్యవహరించే అవకాశం ఉందనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. వాస్తవానికి ఏపీఐఐసీ జేవీ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యూరుు. ఫలితాలు కూడా వస్తున్నారుు. డివిడెండ్ల రూపంలో ఆర్థిక లాభాలు పొందాల్సిన ఏపీఐఐసీ ఈ నిర్ణయం తీసుకోవడం వివాదానికి దారితీసే సూచనలు కన్పిస్తున్నారుు.