థర్డ్ పార్టీతో పర్యావరణ తనిఖీ
అప్పుడే పారదర్శకత ఉంటుంది -ఏపీఐఐసీ ఎండీ జయేశ్ రంజన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంపెనీలు పర్యావరణ తనిఖీలకు థర్డ్ పార్టీలను(అన్య సంస్థలు) అనుమతించాలి. అప్పుడే కంపెనీలపై నమ్మకంతోపాటు పారదర్శకతకు ఆస్కారం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) ఎండీ జయేశ్ రంజన్ అన్నారు. పర్యావరణ చట్టాలు, నియంత్రణలు-పరిశ్రమ పాత్ర అన్న అంశంపై మంగళవారమిక్కడ ఫ్యాప్సీలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. పర్యావరణాన్ని కాపాడే విషయంలో కంపెనీలు స్వీయ నియంత్రణలు పాటించాలని సూచించారు. కాలుష్యకారక కంపెనీల నుంచి కొంత మొత్తాన్ని వసూలు చేసి, స్థానికంగా ఆ మొత్తాన్ని ఖర్చు చేయాలని పర్యావరణ శాఖ ప్రత్యేక కార్యదర్శి కేడీఆర్ జయకుమార్ అభిప్రాయపడ్డారు.
ప్రమాణాలు అవసరం: ఆర్థికాభివృద్ధికి అవసరమైన పర్యావరణ ప్రమాణాలు ప్రత్యేక ప్రాంతాలు, రాష్ట్రాలవారీగా రూపొందాలని ఫ్యాప్సీ ఎన్విరాన్‌మెంటల్ కమిటీ చైర్మన్, సువెన్‌లైఫ్ సెన్సైస్ సీఈవో వెంకట్ జాస్తి అభిప్రాయపడ్డారు. పారిశ్రామికవాడలను ప్రోత్సహించేలా ప్రస్తుత నియంత్రణలను సమీక్షించాలని కోరారు. పర్యావరణానికి సంబంధించి 26 చట్టాలు ఉన్నాయని, వీటిపై అత్యధికులకు అవగాహన లేదని జీడిమెట్ల ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ చైర్మన్ జి.కృష్ణబాపయ్య చౌదరి అన్నారు.
రెండు రాష్ట్రాలు సమంగా..
పారిశ్రామికంగా సీమాంధ్రకు, తెలంగాణకు సమానమైన ప్రయోజనాలు కల్పించాలని కేంద్రాన్ని కోరతామని ఫ్యాప్సీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శివ్‌కుమార్ రుంగ్టా సాక్షి బిజినెస్ బ్యూరోతో పేర్కొన్నారు. కేవలం ఒక ప్రాంతానికే అధిక ప్రయోజనాలు ఇవ్వడం వల్ల సమతుల్యత దెబ్బతింటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరు రాష్ట్రాల్లో స్నేహపూర్వక పోటీ ఉండాలని ఈ సందర్భంగా సూచించారు.