సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ స్కిల్ యూనివర్సిటీగా మారి పలు కార్యక్రమాల్ని చేపట్టింది. అంతర్జాతీయ స్ధాయిలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసి అక్కడే భారీ వాహనాల డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించనుంది. జేసీబీలు, క్రేన్లు కొనుగోలు వాటిపైనా శిక్షణ ఇవ్వనుంది. ఈ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల ద్వారా ఏటా 5 వేల మంది స్కిల్డ్ డ్రైవర్లను అందించనుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ బస్ రెజునేషన్’ కార్యక్రమం కింద దేశంలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలను ఎంపిక చేసింది. ఈ కార్యక్రమం కింద కేంద్రం గ్రాంటుగా నిధుల్ని అందించనుంది. ఈ నిధులతో ఏపీఎస్‌ఆర్టీసీ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో సిటీ, సబర్బన్ సర్వీసులను పెంచుకునే అవకాశం ఉంది.
- సెట్విన్ తరహాలో బస్సులను ప్రవేశ పెట్టడం, డిపోల నిర్మాణం తదితర పనులు చేపట్టవచ్చు. కేంద్ర నిధులతో నిరుద్యోగ యువత సెట్విన్ తరహా బస్సులు కొనుగోలు చేసుకుని బస్సు ఆపరేటర్లుగా మారి సొంతంగా నడుపుకునేందుకు అవకాశముంది.
- రాష్ట్రంలో ప్రస్తుతం విశాఖ, విజయవాడలో తప్ప మిగిలిన చోట్ల ఎక్కడా సిటీ సబర్బన్ సర్వీసులు లేవు. దీంతో ఆ ప్రాంతాల్లో సిటీ సర్వీసులు పెంచేందుకు ఆర్టీసీ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అర్బన్ మాస్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ (యుఎంటీసీ) ద్వారా అధ్యయనం చేయించనుంది.
- ఇప్పటికే కాకినాడ నగరంలో అధ్యయనం చేసింది. కాకినాడకు 20 కి.మీ పరిధిలో 215 సిటీ సర్వీసులు నడిపేలా ప్రతిపాదనల్ని యుఎంటీసీకి అందించింది. కాకినాడకు చుట్టుపక్కల ఉన్న పెద్దాపురం, రామచంద్రపురం, సామర్లకోట, కరపల నుంచి సిటీ సర్వీసులు నడపే విధంగా ప్రతిపాదనలు రూపొందించారు.
- ఇలా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 20 కి.మీ వరకు 10 వేల సిటీ సర్వీసులు నడపాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో 60 శాతం చిన్న బస్సులు, మిగిలిన 40 శాతం పెద్ద బస్సులు అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ కింద నడపడానికి ప్రణాళిక సిద్ధం చేశారు.
డ్రైవర్ల కొరత తీర్చేందుకే శిక్షణ కేంద్రాలు
- ఏపీఎస్‌ఆర్టీసీ ఫ్లిప్ కార్ట్‌తో ఓ సర్వే నిర్వహించగా, ప్రతి వెయ్యి వాహనాలకు 600 మంది డ్రైవర్లు మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఈ లెక్కన 400 మంది డ్రైవర్ల కొరత ఉంది. రాష్ట్రంలో ఒక్క విజయవాడలో మాత్రమే లారీ డ్రైవర్స్ అసోసియేషన్ వారి ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రం ఉంది. అందువల్లే ఆర్టీసీ అంతర్జాతీయ స్థాయిలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసింది.
- నామ మాత్రంగా నిధులు కేటాయించి కాలం చెల్లిన బస్సులకు వర్క్‌షాపులలో మరమ్మతులు చేయించి డ్రైవింగ్‌కు సిద్ధం చేసింది.
- ఈ డ్రైవింగ్ శిక్షణ కేంద్రంలో ఆర్టీసీ డ్రైవర్‌ను అధ్యాపకుడిగా నియమించి ‘జూమ్ కార్’ తరహాలో డ్రైవింగ్‌లో మెలకువలు నేర్పుతారు. స్క్రాప్ బస్సుకు ఇంటెలికార్ డ్రైవింగ్ సాఫ్ట్‌వేర్ ఏర్పాటు చేసి డ్రైవింగ్‌ను కంట్రోల్ రూం ద్వారా పర్యవేక్షిస్తారు.
- 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒక్కోదానిలో 200 మందికి అంతర్జాతీయ స్థాయిలో డ్రైవింగ్ నేర్పిస్తారు. భారీ వాహనాల లైసెన్స్ కోసం శిక్షణ తీసుకునే వారు డీజిల్ ఖర్చు, డ్రైవర్ బత్తాలను మాత్రమే భరించాలి.
స్క్రాప్ బస్సులను వినియోగించి ఆదాయం
- ఏటా ఆర్టీసీలో 1,600 బస్సులు స్క్రాప్ కింద వస్తున్నాయి. 10 లక్షల కి.మీ తిరిగిన బస్సులను స్క్రాప్‌గా గుర్తిస్తున్నారు. వీటికి రూ.లక్షతో కొత్త ఇంజిన్ ఏర్పాటు చేసి పలు చోట్ల వీటిని వినియోగించడం ద్వారా ఆదాయం ఆర్జించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది.
- రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో జనతా బజార్ల కోసం ఈ బస్సులను వినియోగించనుంది.
- వుమెన్ ఫ్రెండ్లీ కార్యక్రమం కింద మెరుగైన సౌకర్యాలతో మొబైల్ టాయిలెట్లుగా బస్సులను తీర్చిదిద్ది, ఎక్కడ అవసరమైతే అక్కడకు తరలించే ఏర్పాట్లు చేసింది. సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ విధానంలో వీటిని అప్పగించనున్నారు.
- పట్టణాలు/నగరాల్లో చెత్తను తీసుకెళ్లే విధంగా హైడ్రాలిక్ బస్సులుగా వినియోగించనున్నారు.
- పలు బస్సులను కార్గో సర్వీసులుగా మార్చి.. ఏపీ సివిల్ సప్లయిస్, బెవరేజెస్ కార్పొరేషన్, సీడ్స్ కార్పొరేషన్, మార్క్‌ఫెడ్, ఆగ్రోస్‌ల ద్వారా రూ.450 కోట్ల కాంట్రాక్టులను దక్కించుకుంది. వచ్చే ఏడాదికి కార్గో ద్వారా రూ.2 వేల కోట్ల వ్యాపారం చేసేలా ఆర్టీసీ లక్ష్యం విధించుకుంది.
- ఏసీ బస్సులు ప్రస్తుతం ఖాళీగా ఉండటంతో వీటిని కరోనా పరీక్షల కోసం వినియోగించనున్నారు. మొత్తం 53 బస్సులను కరోనా పరీక్షలకు వినియోగించేలా ‘సంజీవిని’ అనే కార్యక్రమం అమలు చేయనున్నారు.
ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ఆర్టీసీ అడుగులు
రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగానే ఆర్టీసీ అడుగులేస్తుంది. జనతా బజార్లకు బస్సులను సిద్ధం చేయడం, పరిపాలన వికేంద్రీకరణకు అనుగుణంగా సర్వీసులు ఏర్పాటు చేయడం వంటివి చేపడుతున్నాం. ఆర్టీసీకి గత ఏడాది మార్చి 21 నుంచి జూన్ 21 వరకు రూ.1,215 కోట్ల ఆదాయం వస్తే, ఈ ఏడాది ఇదే సీజన్‌లో కోవిడ్ కారణంగా కేవలం రూ.86 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. ఆర్టీసీ నాన్ టిక్కెట్ రెవెన్యూ పెంచుకునేందుకు స్క్రాప్ బస్సులను సాంకేతికంగా పరీక్షించి రవాణా శాఖ ద్వారా ఫిట్‌నెస్ పరీక్షలు చేయించి తిప్పి కొంత ఆదాయాన్ని సాధిస్తున్నాం. – మాదిరెడ్డి ప్రతాప్, ఆర్టీసీ ఎండీ
Comments
Please login to add a commentAdd a comment