
తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా నిరసన తెలుపుతున్న కార్మికులు
సాక్షి, విజయనగరం అర్బన్ : తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న న్యాయ పోరాటానికి అండగా నిలుద్దామని ఆర్టీసీ సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. స్థానిక డిపో కార్యాలయం ఎదుట ఆదివారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ఆ సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఉద్యమానికి అండగా ఉంటామని తెలిపారు. ఈ నెల 19న తెలంగాణ బంద్ సందర్భంగా ఎర్ర బ్యాడ్జీలతో ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరై మద్దతు తెలపాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. సమ్మె 9వ రోజుకు చేరినా అక్కడి ప్రభుత్వం మొండి వైఖరి వీడకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. వెంటనే తెలంగాణ జేఏసీ నాయకత్వంతో చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే ప్రయత్నం చేయాలన్నారు. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే రానున్న కాలంలో జేఏసీ రాష్ట్ర కమిటీ ఎలాంటి ఉద్యమానికి పిలుపునిచ్చినా సిద్ధంగా కార్మికులు ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.కృష్ణంరాజు, ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ కార్యదర్శి పి.భానుమూర్తి, డిపో అధ్యక్ష, కార్యదర్శులు జీవీఎం రాజు, చవక శ్రీనివాసరావు, ఎస్‌డబ్ల్యూఎఫ్ నాయకులు ఏ.చంద్రయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment