ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, పీజీ వైద్య సీట్లకు జరిగే నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పరీక్షకు జాతీయ పూల్‌లో ఆంధ్రప్రదేశ్ చేరిక ఖరారైనట్లు తెలిసింది. ఇందులో చేరడం ద్వారా మన ప్రభుత్వ బోధనా కళాశాలల్లో ఉన్న ఎంబీబీఎస్ సీట్లలో 15 శాతం జాతీయ పూల్‌కు కేటాయించాల్సి ఉంటుంది. ఇలా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఇచ్చే సీట్లకు కూడా మనం పోటీపడే అవకాశం లభిస్తుంది. అదే పీజీ వైద్య సీట్లకొచ్చేసరికి 50 శాతం సీట్లు మనం జాతీయ కోటాలోకి ఇవ్వడం, అన్ని రాష్ట్రాలు ఇచ్చే 50 సీట్లకూ మనం పోటీపడటం జరుగుతుంది.
రెండు నెలల కిందటే ఏపీ వైద్య విద్యాశాఖ కేంద్ర ప్రభుత్వంతో పాటు సీబీఎస్‌ఈకి లేఖ రాసింది. దీనికి స్పందించిన కేంద్రం.. మన రాష్ట్రాన్ని నేషనల్ పూల్‌లో చేరుస్తున్నట్లు అధికారికంగా చెప్పిందని వైద్యవిద్యాశాఖ వర్గాలు చెప్పాయి. ఇప్పటివరకూ పలు రాష్ట్రాలు జాతీయ పూల్‌లో ఉన్నా మన రాష్ట్రంతో పాటు తెలంగాణ, జమ్ముకాశ్మీర్ రాష్ట్రాలు ఈ పరిధిలో లేవు. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ రాష్ట్రం కూడా జాతీయ పూల్‌లో చేరేందుకు సమ్మతించడంతో తెలుగు విద్యార్థులు మరిన్ని సీట్లకు పోటీపడే అవకాశం లభిస్తోంది. 2018–19 సంవత్సరంలో జరిగే ప్రవేశ పరీక్షలో మనకు జాతీయ పూల్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. కాగా, ఇప్పటికే పీజీ వైద్య సీట్ల ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల అయిందని.. మన రాష్ట్రం జాతీయ పూల్‌లో ఉన్నట్టు బ్రోచర్‌లో పేర్కొన్నట్టు వైద్య విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.
ఎంబీబీఎస్ సీట్లలో ఎక్కువ లాభం
జాతీయ పూల్‌లో చేరడంవల్ల ఎక్కువ ఎంబీబీఎస్ సీట్లకు పోటీపడే అవకాశం లభించడం మన రాష్ట్రానికి కలిసొచ్చే అంశమని అధికారులు చెబుతున్నారు. మన రాష్ట్రం కేవలం 285 సీట్లను జాతీయ పూల్‌కు కేటాయిస్తే.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఇచ్చే 4157 సీట్లలో పోటీపడేందుకు మనకు అవకాశం ఉంటుందని అధికారులు చెప్పారు.
రాష్ట్రంలో ఉన్న సీట్లు.. జాతీయ పూల్‌లో చేరితే వచ్చే సీట్ల వివరాలు ఇలా
Comments
Please login to add a commentAdd a comment