హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘ది హిందూ’ దినపత్రిక రెసిడెంట్ ఎడిటర్ నగేష్ కుమార్ తదితర జర్నలిస్టులపై పెట్టిన కేసులను పత్రికా స్వేచ్ఛపై దాడిగా పరిగణించి మీడియా సిబ్బంది ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్), హైదరాబాద్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (హెచ్‌యూజే) పిలుపునిచ్చాయి. సోమవారం ఇక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏపీడబ్ల్యూజేఎఫ్, హెచ్‌యూజే ఆధ్వర్యంలో ప్రజాశక్తి ఎడిటర్ తెలకపల్లి రవి అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితిని ఆసరాగా తీసుకొని పోలీసులు మీడియాపై వేధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 10టీవీ చైర్మన్, ఎమ్మెల్సీ డాక్టర్ కె.నాగేశ్వర్ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులతోనే పత్రికా స్వేచ్ఛ వచ్చింది తప్ప డీజీపీ దయాదాక్షిణ్యాలతో కాదని ధ్వజమెత్తారు. నగేష్ కుమార్‌ను ఇంటికివెళ్లి మరీ పోలీసులు వేధించాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. ఇలా ప్రశ్నిస్తున్నానని తననూ అరెస్టు చేసుకోవచ్చని సవాల్ విసిరారు.
టైమ్స్ దినపత్రిక ఎడిటర్ కింగ్ షుక్‌నాగ్ మాట్లాడుతూ నగేష్‌పై దాడిని చూస్తే పోలీస్ రాజ్యం నడుస్తున్నట్లు అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. ఎన్‌టీవీ చీఫ్ ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ బోఫోర్స్, జయలలిత వ్యవహారాల్లో సుదీర్ఘ పోరాటం చేసిన హిందూ పత్రిక విలేకరిపై పోలీసులు పిచ్చి కేసులు పెట్టి పరువు తక్కువ పనిచేశారని విమర్శించారు. నమస్తే తెలంగాణ పత్రిక ఎడిటర్ అల్లం నారాయణ మాట్లాడుతూ తెలంగాణ ప్రకటన వెలువడిన తర్వాత సీఎం మూడుసార్లు మాత్రమే ప్రజాజీవితంలో కనిపించారన్నారు. పోలీసుల తీరు రాబోయే ప్రమాదానికి సంకేతంగా భావించాలని, పాత్రికేయ ప్రపంచం ముక్త కంఠంతో ఖండి ంచాలని కోరారు. సీనియర్ జర్నలిస్టులు రాజేంద్ర, గంగాధర్ (సాక్షి), నరసింహారెడ్డి (ఈనాడు), ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ర్ట అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బసవపున్నయ్య, జి.ఆంజనేయులు, కార్యదర్శి మామిడి సోమయ్య, అమరయ్య, హెచ్‌యూజే అధ్యక్ష, కార్యదర్శులు ఆనందం, నర్సింగ్‌రావు పాల్గొన్నారు.
‘ఆప్నా’ ఖండన: ‘ది హిందూ’ జర్నలిస్టు నగేష్‌కుమార్‌పై క్రిమినల్ కేసులు బనాయించడాన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్‌పేపర్స్ అసోసియేషన్ (ఆప్నా) ఒక ప్రకటనలో ఖండించింది. ఈ ఘటన రాష్ట్రంలో మీడియా కార్యకలాపాల్లో పోలీసులు చేయి పెట్టడమేనని, ఇది అనవసర జోక్యమని సంఘ కార్యదర్శి ఐ.వెంకట్ పేర్కొన్నారు.