ఆక్వా రైతులూ.. మేలుకోండి
- వాతావరణంలో మార్పులతో ఆక్వాకు నష్టం
- అధికారులు వెంటనే స్పందించాలి
- చేపల రైతులకు సూచనలిచ్చి ఆదుకోవాలి
- లేకుంటే వందల కోట్లలో నష్టం జరిగే ప్రమాదం
- వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి
గుడివాడ, న్యూస్‌లైన్ : ఆక్వా రైతులూ మేలుకోండి.. వాతావరణంలో ప్రస్తుతం వస్తున్న మార్పులు అర్థం చేసుకుని తక్షణం నివారణ చర్యలు చేపట్టండి.. అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్, ఐసీఆర్‌ఏ బోర్డు సభ్యుడు ఎంవీఎస్ నాగిరెడ్డి హెచ్చరించారు. రెండు రోజులుగా వాతావరణంలో వస్తున్న మార్పులపై ఆక్వా రైతులను అప్రమత్తం చేయాలని మత్స్య శాఖ అధికారులకు ఆయన సూచించారు.
లేకుంటే వందల కోట్ల రూపాయల్లో నష్టం జరిగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ఏలూరు రోడ్డులోని తన కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చేపల చెరువుల్లో రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు మారుతున్నాయని చెప్పారు. వాతావరణంలో మార్పులు, అక్కడక్కడ పడుతున్న వర్షాల వల్ల చెరువుల్లో ఉష్ణోగ్రత తగ్గి చేపలు చనిపోతున్నాయన్నారు.
నేడు సీమాంధ్రలో చేపల సాగు ఎంతో కీలకమైనదని, ఈ రంగానికి నష్టం జరిగితే రైతులు తీవ్ర ఇబ్బందులు పడతారని చెప్పారు. ముందస్తు జాగ్రత్తలను రైతులకు వివరించి వారిని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రాష్ట్రంలోని కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో చేపలు, రొయ్యల సాగు దాదాపు రెండు లక్షల 50 వేల ఎకరాల్లో ఉందని చెప్పారు. ప్రతి ఎకరానికీ చేపల సాగుకు రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు, ఫంగస్ చేపల సాగుకు రూ.5 లక్షల వరకు, రొయ్యల సాగుకు రూ.5 లక్షల నుంచి 8 లక్షల వరకు ఖర్చు పెట్టారని తెలిపారు.
వాతావరణం మార్పుతో ఆక్సిజన్ అందదు...
వాతావరణం మార్పు కారణంగా వేసవిలో ఒక్కసారిగా వర్షాలు పడినా, చేపలకు ఆక్సిజన్ అందదని నాగిరెడ్డి చెప్పారు. చేపల శరీర ఉష్ణోగ్రత చెరువులో ఉండే నీటి ఉష్ణోగ్రతతో సమానంగా ఉంటుందని ఆయన తెలిపా రు. ఒక్కసారిగా చేపల చెరువులో నీ టి ఉష్ణోగ్రత మారితే ఆక్సిజన్ అందక అవి మృత్యువాత పడతాయన్నారు.
చేపల మేత ఆపాలి...
ప్రస్తుత పరిస్థితిలో చేపలకు మేత వేయటం ఆపాలని నాగిరెడ్డి కోరారు. చేపలకు మేత వేయటం వల్ల బరువు పెరిగి ఆక్సిజన్ లోపం ఏర్పడే అవకాశం ఉందని ఆయన చెప్పారు. రైతులు ముందస్తు జాగ్రత్తలను తక్షణం చేపట్టడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. దీనిపై మత్స్య శాఖ అధికారులు రైతుల్ని అప్రమత్తం చేయాలని ఆయన కోరారు. ప్రస్తుత డిమాండును చూసి చేపల మందుల కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించే ప్రమాదముందని తెలిపారు. రైతులు ఆక్వా కన్సల్టెంట్‌లను సంప్రదించి ముందస్తు యాజమాన్య చర్య లు చేపట్టాలని ఆయన సూచించారు.