సమ్మెను మీరు సమర్థిస్తున్నారా? | Are supporting strike, high court criticises state government | Sakshi
Sakshi News home page

సమ్మెను మీరు సమర్థిస్తున్నారా?

Published Wed, Sep 18 2013 1:51 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

సమ్మెను మీరు సమర్థిస్తున్నారా? - Sakshi

సమ్మెను మీరు సమర్థిస్తున్నారా?

ప్రభుత్వ వైఖరిపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో ఏపీఎన్జీవో, ఇతర ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శిక్షార్హమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తోందంటూ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. సమ్మె విషయంలో సర్కారు అనుసరిస్తున్న వైఖరిని తప్పుపట్టింది. ప్రభుత్వ చర్యలను గమనిస్తుంటే అవి సమ్మెను సమర్థిస్తున్నట్లు కనిపిస్తున్నాయంటూ అసహనం వ్యక్తం చేసింది. ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంటున్నట్లు కనిపిస్తోందని మండిపడింది. సమ్మె నివారణకు తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతున్న చర్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. సమ్మెపై తీసుకున్న చర్యలను వివరిస్తూ డిప్యూటీ సెక్రటరీ స్థాయి అధికారి కౌంటర్ దాఖలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలు చేసేందుకు కనీసం సెక్రటరీ స్థాయి అధికారి కూడా ముందుకు రాకపోవడం చూస్తుంటే ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో స్పష్టమవుతోందని వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం.. సమ్మె చేస్తున్న ఉద్యోగులతో చర్చలు జరపడాన్ని ప్రశ్నించింది. ఏ చట్టం ప్రకారం, ఏ నిబంధనకు లోబడి సమ్మె చేస్తున్న ఉద్యోగులతో మంత్రుల బృందం చర్చలు జరిపిందని, సమ్మె చేస్తున్న వారిని చర్చలకు ఆహ్వానించడంలో ఉన్న ఆంత్యర్యమేమిటని నిలదీసింది. ప్రభుత్వ చర్యలు చట్ట ప్రకారం లేనప్పుడు, అవి ఎంత మాత్రం సదుద్దేశంతో తీసుకున్న నిర్ణయాలుగా చెప్పలేమని స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం సమ్మె జరగడానికి వీల్లేదని, అయినా సమ్మె జరుగుతోందని, ఈ విషయంలో ప్రభుత్వం నుంచి సంతృప్తికరమైన వివరణలను ఆశిస్తున్నామని పేర్కొంది.
 
 సమ్మెను ఆపేందుకు చర్యలు తీసుకుంటున్నారా..? లేదా..? సూటిగా చెప్పాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని, రాజకీయ అంశమైన రాష్ట్ర విభజన గురించి సమ్మె చేసే హక్కు ప్రభుత్వ ఉద్యోగులకు లేదంటూ హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది రవికుమార్, ఆల్ ఇండియా బీసీ, ఓబీసీ పార్టీ అధ్యక్షుడు టి.దానయ్య వేర్వేరుగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను సోమవారం విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం.. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఇందులో భాగంగా ఈ వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపించగా, ప్రభుత్వం తరఫున వీసీ.హెచ్.నాయుడు, ఏపీఎన్‌జీవోల తరఫున సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు.
 
 
 చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యమే: సత్యంరెడ్డి
 తొలుత సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ.. సమ్మె చేస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఒకవేళ ఈ విధులను నిర్వర్తించకపోతే అది ప్రభుత్వ వైఫల్యమే అవుతుందని తెలిపారు. సమ్మెను విరమించాలని ఉద్యోగులను, విరమించని వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించే అధికారం న్యాయస్థానాలకు ఉందని చెప్పారు. సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో వెలువరించిన పలు తీర్పులను ఈ సందర్భంగా ఆయన ఉటంకించారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. సర్వీసు నిబంధనలను ఉద్యోగులు ఉల్లంఘిస్తే ఏం చేయాలో చెప్పండి..? అని సత్యంరెడ్డికి సూచించింది. ఈ విషయంలో స్పష్టతనిచ్చే నిబంధనలేవీ లేవని సత్యంరెడ్డి చెప్పగా, అయితే ఈ కేసులో తాము చేయగలిగింది ఏముందని ధర్మాసనం ప్రశ్నించింది. క్లాసిఫికేషన్, కంట్రోల్ అండ్ అప్పీల్ (సీసీఏ) నిబంధనల ప్రకారం సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వారిపై చర్యలు తీసుకోవచ్చునని, ప్రభుత్వం మౌనంగా ఉండటానికి వీల్లేదని ఆయన చెప్పారు. సమ్మె వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషిస్తోందని సత్యంరెడ్డి తెలిపారు.
 
 ఈ వ్యాజ్యాలను ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది: వీసీహెచ్ నాయుడు
 ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వ వైఖరి ఏమిటో చెప్పాలని సాధారణ పరిపాలనశాఖ తరఫు న్యాయవాది వీసీహెచ్.నాయుడుని ధర్మాసనం కోరింది. (అత్యంత ముఖ్యమైన ఇలాంటి కేసులో సాధారణంగా అడ్వొకేట్ జనరల్ హాజరవుతారు. ఆయన బీజీగా ఉంటే కనీసం అదనపు ఏజీలైనా వస్తారు. అయితే అటు ఏజీగానీ, ఇటు అదనపు ఏజీలుగానీ ఈ కేసులో వాదనలు వినిపించేందుకు ఇప్పటి వరకు రాలేదు. దీంతో ప్రభుత్వ న్యాయవాదే ఈ కేసులో వాదనలు వినిపించాల్సి వస్తోంది.) అంతేకాక ఈ వ్యాజ్యాలను వ్యతిరేకిస్తున్నారా..? సమర్థిస్తున్నారా..? చెప్పాలని నాయుడికి స్పష్టం చేసింది. ఇందుకు ఈ వ్యాజ్యాలను తాము వ్యతిరేకిస్తున్నామని నాయుడు సమాధానమిచ్చారు. సమ్మె విషయంలో ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని, ఇప్పటికే ఆయా శాఖలకు తగిన ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. పిటిషనర్ రవికుమార్ సైతం ప్రభుత్వాన్ని తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారని, తాము అన్ని రకాలు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం తరఫున డిప్యూటీ కార్యదర్శి దాఖలు చేసిన కౌంటర్‌ను చదివి వినిపించారు. ఈ సమయంలో ధర్మాసనం... కౌంటర్‌ను డిప్యూటీ కార్యదర్శి పేరు మీద దాఖలైన విషయాన్ని గమనించింది.
 
 ‘‘ఓ డిప్యూటీ కార్యదర్శి కౌంటర్ దాఖలు చేశారన్న మాట. కనీసం కార్యదర్శి కూడా ముందుకు రాలేదన్న మాట..! ప్రధాన కార్యదర్శి గానీ, ముఖ్య కార్యదర్శి గానీ ముందుకు రాకపోవడాన్ని చూస్తుంటే సమ్మెను ప్రభుత్వం సమర్థిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్నట్లు చెబుతున్న చర్యలను చూస్తే అవి హాస్యాస్పదంగా ఉన్నాయి’’ అంటూ ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. సమ్మె చేస్తున్న ఉద్యోగులతో చర్చించేందుకు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశామని, ఆ బృందం రెండు దఫాలుగా ఉద్యోగులతో చర్చలు జరిపిందని నాయుడు చెప్పగా.. అసలు ఏ చట్టం ప్రకారం, ఏ నిబంధనకు అనుగుణంగా సమ్మె చేస్తున్న వారితో మంత్రుల బృందం చర్చలు జరిపిందని ధర్మాసనం ప్రశ్నించింది. ‘‘సమ్మె చేస్తున్న వారిపై ఏం చర్యలు తీసుకున్నారో ఎక్కడా మీ కౌంటర్‌లో చెప్పలేదే. ఇది సమర్థనీయమా..? మీ బాధ్యత ఏమైంది.? మీరు చర్యలు తీసుకున్న తర్వాత కూడా వారు (ఉద్యోగులు) సమ్మె చేస్తుంటే వారి సంగతి మేం చూసుకునే వాళ్లం. సమ్మెను ఆపేందుకు మీరు చర్యలు తీసుకుంటారా..? లేదా..? సూటిగా, స్పష్టంగా చెప్పండి’’ అని నాయుడికి స్పష్టం చేసింది. కొంత గడువిస్తే ఇప్పటివరకు తీసుకున్న చర్యల వివరాలతో మరో అఫిడవిట్‌ను కోర్టు ముందుంచుతామని నాయుడు చెప్పగా.. గడువు ఇచ్చేది లేదని, గడువు కావాలంటే ప్రతీ వాయిదాకు రూ.2 లక్షల చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం శిక్షార్హమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోన్నట్లు కనిపిస్తోంది. నిబంధనల ప్రకారం సమ్మె చేయరాదు. ఆయినా కూడా ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు..? మీరు మాత్రం సమ్మెను చట్ట విరుద్ధంగా ప్రకటించాలన్న ఈ వ్యాజ్యాలను కొట్టివేయాలని కోరుతున్నారు. ఈ విషయంలో స్పష్టతనివ్వండి. పిటిషన్లను కొట్టివేయాలా..? వద్దా..?’’ అని ధర్మాసనం నాయుడిని కోరింది. చివరకు నాయుడు ఈ వ్యాజ్యాలను కొట్టివేయాలని చెప్పడంతో.. ఇక ప్రభుత్వ వాదనలు ముగిసినట్లేనని, వాదనలు వినిపించాలని మోహన్‌రెడ్డిని ధర్మాసనం కోరింది.
 
 సమ్మెపై ఎక్కడా నిషేధం లేదు: సి.వి.మోహన్‌రెడ్డి
 సి.వి.మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ... ఈ వ్యాజ్యాన్ని పిటిషనర్ సొంత ప్రయోజనాల కోసం, దురుద్దేశాలతో దాఖలు చేశారని, ఇలాంటి పిటిషన్లకు అసలు విచారణార్హత ఉండదని చెప్పారు. ఇందుకు సంబంధించి ఆయన సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో వెలువరించిన తీర్పులను చదివి వినిపించారు. పిటిషనర్ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారని, అప్పుడు అతనికి కనిపించని ప్రజల ఇబ్బందులు, ఇప్పుడు కనిపిస్తున్నాయని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, విచారణార్హత తదితర అంశాలపై తర్వాత వాదనలు వింటామని, ముందు కేసు పూర్వాపరాల ఆధారంగా వాదనలు వినిపించాలని మోహన్‌రెడ్డికి సూచించింది. కోర్టు ఇచ్చే ఉత్తర్వుల వల్ల పిటిషనర్‌కు మాత్రమే లబ్ధి చేకూరుతుందా..? లేక ప్రజలందరికీ ప్రయోజనం చేకూరుతుందా..? అన్న అంశమే తమకు ప్రధానమని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేయకూడదని ఏ నిబంధనల్లోనూ లేదని, సమ్మె చేస్తే ఏం చేయాలి..? ఏం చేయకూడదన్నది మాత్రమే ఉంటుందంటూ, సీసీఏ నిబంధనలను చదవి వినిపించారు. సమ్మె చేస్తే తలెత్తే పర్యవసానాల గురించి ఎక్కడా చర్చించలేదన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లోఉద్యోగులందరూ సమ్మె చేస్తే.. వారిపై చర్యలు తీసుకునే అవకాశం లేదని ఆయన తెలిపారు. సీసీఏ నిబంధనల్లో పెనాల్టీల గురించి చర్చించారే తప్ప సమ్మెపై నిషేధం గురించి ఎక్కడా లేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కేవలం ఎస్మా కింద మాత్రమే సమ్మెపై నిషేధం ఉందని, నిబంధనల్లో ఎక్కడా లేదని పేర్కొన్నారు. అంతేకాక సర్వీసు నిబంధనలను ఉల్లంఘించినంత మాత్రనా, ఉద్యోగులపై చర్య తీసుకోవడానికి వీల్లేదని వివరించారు. అప్పటితో కోర్టు పనివేళలు ముగియడంతో, విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement