అనకాపల్లి మండలం కొత్తూరు నర్సింగరావు పేటకు చెందిన ఆర్మీ జవాన్ గొల్లవిల్లి భాను(26) తూర్పు గోదావరి జిల్లా అన్నవరం రైల్వేస్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడు.
అనకాపల్లి రూరల్, న్యూస్‌లైన్ : అనకాపల్లి మండలం కొత్తూరు నర్సింగరావు పేటకు చెందిన ఆర్మీ జవాన్ గొల్లవిల్లి భాను(26) తూర్పు గోదావరి జిల్లా అన్నవరం రైల్వేస్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖపట్నం వైపు వెళుతున్న గూడ్స్ రైలు కిందపడి అక్కడికక్కడే చనిపోయాడు. జమ్మూ కాశ్మీర్‌లో ఆర్మీ జవాన్‌గా అతడు పని చేస్తున్నాడు. పోలీసుల వేధింపుల వలే ్ల తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని భాను తల్లిదండ్రులు గొల్లవిల్లి అప్పారావు, పద్మ ఆరోపించారు.
వారి వివరాల ప్రకారం.. భానుతో అదే గ్రామానికి చెందిన ఓ యువతి పరిచయం పెంచుకుంది. మిలట్రీ క్యాంటీన్ నుంచి వస్తువులను భాను ద్వారా తక్కువ ధరకు కొనిపించేది. కొన్నాళ్ల తర్వాత భానును ప్రేమిస్తున్నానని, అతడినే పెళ్లి చేసుకుంటానని గొడవ పెట్టింది. అయితే తమ మధ్య ఏ ప్రేమ లేదని భాను చెప్పాడు. దీంతో గ్రామ పెద్దల్లో పంచాయతీ పెట్టగా, ఆమె ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో వారు ఆ యువతిని మందలించారు. అయినా ఆమె అనకాపల్లిరూరల్ పోలీసులకు భానుపై ఫిర్యాదు చేసింది. పలుమార్లు పోలీసులు ఇంటికి వచ్చి, భానును విచారణ పేరుతో పిలిచేవారు.
ఆ వేధింపులు తట్టుకోలేక అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. రూ.2 లక్షలు ఇస్తే కేసు మాఫీ చేస్తానని ఎస్‌ఐ బెదిరించేవారని బంధువులు ఆరోపించారు. ఇదిలావుండగా మృతి చెందిన భాను మృతదేహాన్ని రూర ల్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి ఎస్‌ఐని సస్పెండ్ చేయాలంటూ బంధువులు ఆందోళన చేపట్టారు. కాగా మృతుని వద్ద దొరికిన సూసైడ్ నోట్‌లో కూడా భాను ఇంచుమించు ఇలాగే రాశాడు. తనను అనకాపల్లి రూరల్ పోలీసులు మానసికంగా వేధించారని, ఆ యువతితో సంబంధం లేదని చెప్పినా వినలేదని పేర్కొన్నాడు. ‘అమ్మా.. నేను ఏ తప్పు చేయలేదు. తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో’ అని రాశాడు.
ఆ సూసైడ్ నోట్‌లో మృతుడి సంతకం లేదు. ఆ చేతిరాత తన కుమారుడిదేనని భాను తల్లిదండ్రులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తుని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తుని రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఎస్‌ఐ వివరణ: భాను తనను ప్రేమించాడని, పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేస్తున్నాడని కొత్తూరు నర్సింగరావుపేటకు చెందిన లీలావతి ఫిర్యాదు చేసిందని ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపారు.ఈమేరకు ఇరువర్గాల తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడానని,సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచిం చానే తప్ప తానెవరినీ బెదిరించలేదని ఎస్‌ఐ తెలిపారు.