శ్రీకాకుళం: శ్రీకాకుళం పట్టణంలో చేపట్టిన ఆరు జిల్లాల ఆర్మీ నియామక ర్యాలీకి వేల సంఖ్యలో అభ్యర్థులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. తొలిరోజైన శుక్రవారం శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల అభ్యర్థులు పాల్గొన్నారు. మొత్తం 10,456 మంది టోకెన్లు తీసుకున్నారు. ఈ నియామక ర్యాలీ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ లక్ష్మీ నరసింహం, జిల్లా ఎస్పీ ఎ.ఎస్.ఖాన్ పర్యవేక్షించారు. అయితే అనుకున్న స్థాయిలో అధికారులు ఏర్పాట్లు చేయలేకపోయారు. శనివారం సీఎం పర్యటన ఉండటంతో మెజారిటీ పోలీసు సిబ్బందిని సీఎం బందోబస్తు విధులకు తరలించడంతో వేల సంఖ్యలో వచ్చిన అభ్యర్థులను అదుపు చేయడం అక్కడున్న పోలీసులకు కష్టసాధ్యంగా మారింది. అభ్యర్థులు ఒక్కసారిగా స్టేడియంలోకి దూసుకు వచ్చేందుకు ప్రయత్నించడంతో రెండుసార్లు తోపులాటలు జరిగాయి.