జిల్లాలో ఈ నెల 23న జరగనున్న పంచాయతీ కార్యదర్శులు (గ్రేడ్-4) పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని జెడ్పీ సీఈవో మహేశ్వరరెడ్డి సూచించారు.
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో ఈ నెల 23న జరగనున్న పంచాయతీ కార్యదర్శులు (గ్రేడ్-4) పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని జెడ్పీ సీఈవో మహేశ్వరరెడ్డి సూచించారు. పరీక్ష కేంద్రాల నిర్వహణ, ముందస్తు ఏర్పాట్లపై కళా శాలల ప్రిన్సిపాళ్లు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో శుక్రవారం సమీక్షించారు. ఈ పరీక్షకు జిల్లాలో 42,368 మంది దరఖాస్తు చేసినట్టు చెప్పారు. మొత్తం 150 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉదయం 10 నుంచి 12.30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4.30 వరకూ పరీక్ష జరుగుతుందని వెల్లడించారు.
ఇందుకు సంబంధించి 150 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 25 మంది పరిశీలకులు, 67మంది లైజన్ ఆఫీసర్లు, 20 టీమ్‌ల ఫ్లయింగ్ స్క్వాడ్లు, 150 మంది అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్లు, ప్రతి 24 మంది అభ్యర్థులకు ఒక్కొక్క ఇన్విజిలేటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్‌టీసీ బస్సులను రైల్వే స్టేషన్, కాంప్లెక్స్, ప్రధాన కేంద్రాల నుంచి నడపనున్నట్టు చెప్పారు. గిరిజన ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థుల కోసం పరీక్ష ముందు రోజు ప్రత్యేక బస్సు లు నడుపుతామన్నారు. ఈ సమావేశంలో డీపీవో సుధాకర్, డీఈవో లింగేశ్వరరెడ్డి, ఇంటర్‌బోర్డు ఏవో ఇందిర పాల్గొన్నారు.
ఇవీ సెంటర్లు
విశాఖ నగర పరిధిలో 90, అనకాపల్లిలో 16, నర్సీపట్నంలో 9, చోడవరంలో 8, పాయకరావుపేటలో 6, యలమంచిలిలో 6, భీమిలిలో 4, కశింకోటలో 3, అచ్యుతాపురంలో 3, మాకవరపాలెంలో 2, పరవాడలో 3 పరీక్షా కేంద్రాలు ఏర్పాటయ్యాయి.
అభ్యర్థులకు సూచనలు
అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి అరగంట ముందుగా చేరుకోవాలి. సెల్‌ఫోన్లు, కాలిక్యులేటర్లు, ఎరైజర్లు, బ్లేడ్లు వంటి వస్తువులు తీసుకురాకూడదు.